Nov 1, 2017

రైతులకు వరం గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం


 v 150 మండలాల్లో అమలు
v సమర్థవంతంగా నిర్వహిస్తున్న సెర్ఫ్
v పేదరిక నిర్మూలనే  ప్రభుత్వ లక్ష్యం
      
      ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం (ఆర్ఐజీపి- రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్) రైతులకు ఓ వరం నిలుస్తోంది.  ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రధాన ఉద్దేశం రైతులకు అన్ని విధాల సహాయపడటం. ఈ సంస్థ మినీ ఫీడ్ మిక్చర్ ప్లాంట్లను సమకూరుస్తుంది. అలాగే ఘనజీవామృతం, వెర్మీకంపోస్ట్ తయారు చేయడానికి సహకరించడంతోపాటు విత్తనాలు పంపిణీ చేస్తుంది. సేంద్రీయ ఎరువులు, పోషక విలువలున్న మొక్కల పెంపకం, కోళ్ల ఫారాలు, రూరల్ రిటైల్ చైన్ మార్ట్స్ వంటి విషయాలలో రైతులకు సహాయపడుతుంది. వివిధ పంటలు పండించే రైతులతోపాటు కూరగాయలు, మామిడితోటలు, జీడిమామిడితోటలు, చింతమండు, వేరుశనగ, గొర్రెలు,మేకలు పెంపకం, కోళ్ల పెంపకం, డెయిరీ, అన్న సంజీవనీ జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ పథకాన్ని సెర్ఫ్ సమర్థవంతంగా అమలు చేస్తోంది.  ఈ సంస్థ వివిధ జిల్లాల్లో ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతం) కార్యక్రమాలను కూడా చేపట్టింది.  పశ్చిమగోదావరి జిల్లాను మే 29న ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతం) జిల్లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు
     వెలుగు ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నా ఇంకా అనేక మండలాలలో లక్షల కుటుంబాలు ఇంకా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడే ఉన్నాయి. పలు నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 150 మండలాల్లో నిరుపేదలు, షెడ్యూల్ కులాలు, గిరిజన కుటుంబాలు మానవాభివృద్ధి, ఆదాయాభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడి ఉన్నట్లు తేలింది. దాంతో సెర్ప్ ఆ మండలాల్లో గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం అమలు చేస్తోంది. 13 జిల్లాల్లో 664 మండల సమాఖ్యలు, 27,813 గ్రామ సంఘాలు, 6,96,302 స్వయం సహాయక సంఘాల ద్వారా 89 లక్షల మంది నిరుపేద, పేద మహిళల ఆర్థిక, ఆర్థికేతర అవసరాల కోసం వెలుగు ప్రాజెక్ట్ పని చేసింది.  ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా పేదరికం కొంతవరకు తగ్గినప్పటికీ షెడ్యూల్ కులాలు, గిరిజనులు, మహిళలలో అధిక శాతం మంది ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ వర్గాల్లోని 63 శాతం మంది స్త్రీలు రక్త హీనతతో బాధపడుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మాతా,శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మలవిసర్జనకు బహిర్భూమికి వెళ్లేవారు కేరళలో 5.6 శాతం ఉంటే రాష్ట్రంలో 65 శాతం మంది ఉన్నారురాష్ట్రంలో కుటుంబాల మధ్య సంపద అసమానంగా ఉంది. ముఖ్యంగా మొత్తం జనాభాలో పేదరికాన్ని పోల్చి చూస్తే ముస్లింలు, ఎస్సీలు, గిరిజనులలో 23 శాతం మంది పేదరికంలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో చిన్న,సన్నకారు రైతులు అభివృద్ధి అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో సెర్ప్ ప్రపంచ బ్యాంకు సహాయంతో స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంఘాల్లో 90 వరకు పేద కుటుంబాల సభ్యులే ఉంటారు.
         ఎస్సీ,ఎస్టీ కుటుంబాలు ఎక్కువగా ఉండి, స్త్రీల అక్షరాస్యత తక్కువ, నీటి పారుదలలేని వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్న 150 మండలాలను గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం కింద ఎంపిక చేశారు. ఈ మండలాల్లోని 2.50 లక్షల పేద కుటుంబాలు వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 50 శాతం అధికంగా ఆదాయం పొందడం, మానవాభివృద్ధి సేవలు ఎక్కవగా అందుబాటులోకి తేవడంతోపాటు వారు సామాజిక, సాంఘిక హక్కులు పొందడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో ఎస్సీ,ఎస్టీ, చిన్న,సన్నకారు రైతులే 70 శాతం భాగస్వాములుగా ఉంటారు.

   ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం రూ.643.88 కోట్లు కేటాయించింది. విలువల గొలుసు (వాల్యూ చైన్), మానవాభివృద్ధి కార్యక్రమాలకు, సామాజిక రక్షణ, హక్కులు పొందడానికి ఈ నిధులు వినియోగిస్తారు. ఈ ప్రాజెక్ట్ కాలపరిమితి 5 ఏళ్లు, అంటే జూన్ 2019 లోపల వీటికి ఖర్చు చేయాలి. ఈ నిధులను విలువల గొలుసు కార్యక్రమాలకు రూ.232.4 కోట్లు, రిటైల్ చైన్స్ కు రూ.36.5 కోట్లు, మానవాభివృద్ధికి రూ.119.5 కోట్లు, ఒన్ స్టాప్ షాప్ కు రూ.67.39 కోట్లు, ఐసీటీకి రూ.117 కోట్లు, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కు రూ. 71.09 కోట్లు కేటాయించారు.  రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 150 మండలాల్లో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల  శారీరక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు, పౌష్టికాహారం అందించడానికి, ఆ కుటుంబాలకు చెందిన స్త్రీల అక్షరాస్యత పెంచడం, మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం వంటి మానవాభివృద్ధి కార్యక్రమాలకు, చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం వెచ్చిస్తారుఆ విధంగా రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...