Nov 28, 2017

డిసెంబర్ 2 వరకు అసెంబ్లీ సమావేశాలు


సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు
   
        సచివాలయం, నవంబర్ 28: శాసనసభ, శాసన మండలి సమావేశాలు డిసెంబర్ 2వ తేదీ శనివారం వరకు జరుగుతాయాని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ, శాసనమండలి చైర్మన్ ఫరూక్ అధ్యక్షతన శాసన మండలి వ్యవహారాల కమిటీ సమావేశాలు జరిగాయని తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో చర్చించవలసిన అంశాలపై సభ్యులు అభిప్రాయాలు తెలిపారని చెప్పారు. మిలాద్-ఉన్- నబీ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన సెలవని చెప్పారు. 29వ తేదీన కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అక్కడి విద్యార్థుల సమస్యలు, వారిపై ఒత్తిడి తదితర అంశాలతోపాటు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రంపై చర్చించాలని తీర్మానించినట్లు వివరించారు. 30న మహిళా సాధికారిత, బాలల హక్కులపై చర్చిస్తారని, అలాగే విభజన చట్టంలోని హామీల అమలు తీరు, కొన్ని అంశాల అమలులో జరిగే జాప్యం వంటి కీలక అంశాలపై చర్చిస్తారన్నారు. డిసెంబర్ 2 చివరి రోజు రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, యువజన విధానం, మౌలిక సదుపాయాలపై చర్చిస్తారని చెప్పారు. ఈ నెల 29,30 తేదీల్లో రెండు రోజులు 14 బిల్లులపై రెండు సభల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రజా ప్రధాన్యత ఉన్న అంశాలపై చర్చ జరుగుతుందని మంత్రి కాలవ  చెప్పారు.

ఇప్పటి వరకు 9 అంశాలపై చర్చ
ఇప్పటి వరకు 344వ నిబంధన కింద, ప్రశ్నోత్తరాల సమయంలో 9 అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించామన్నారు. శాసనసభ, శాసన మండలి సభ్యులను పోలవరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. వారు పట్టిసీమను కూడా సదర్శించారన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైన, చంద్రన్న బీమాపైన చర్చ జరిగినట్లు చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులపైన, ఫలితాల పైన అర్థవంతమైన చర్చ జరిగినట్లు తెలిపారుఅలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, కాపు, బ్రాహ్మణుల సంక్షేమంపై కూడా చర్చించినట్లు చెప్పారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, విద్యుత్ రంగ విజయాలపైన, పట్టణ, గ్రామీణ ప్రాంత గృహ నిర్మాణంపైన చర్చించినట్లు వివరించారు. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ, సీజనల్ వ్యాధులపై చర్చ జరుగుతున్నట్లు చెప్పారు.

      సభలో ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్షం, మిత్ర పక్షమైన బీజేపీ సభ్యులు నిర్మాణాత్మకంగా మాట్లాడి, మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారన్నారు. కొందరైతే  చక్కగా మాట్లాడి మంత్రులను నిలదీశారని చెప్పారు. ప్రతిపక్షం లేకపోయినా సమర్థవంతంగా శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి నిదర్శనం ఏపీ శాసనసభ సమావేశాలనని మంత్రి కాలవ అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...