Nov 9, 2017

సామర్ధ్యాన్ని నిరూపించుకోండి


శాసనసభ,మండలి కమిటీల చైర్మన్లకు స్పీకర్ కోడెల సూచన

        సచివాలయం, నవంబర్ 8: శాసనసభా కమిటీలలో దేనిని తక్కువగా భావించవద్దని, దేని ప్రాధాన్యత దానిదేనని, సత్తా చాటి సామర్థ్యాన్ని నిరూపించుకోమని కొత్తగా నియమితులైన శాసనసభ, మండలి ఉమ్మడి కమిటీల అధ్యక్షులనుద్దేశించి శాసనసభ స్సీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. శాసనసభా ప్రాంగణంలోని తన ఛాంబర్ లో బుధవారం ఉదయం జరిగిన కమిటీల అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాల అమలు తీరుని పరిశీలించి, అమలు జరగకపోతే ఎందుకు జరగడంలేదో తెలుసుకోవాలన్నారు. ప్రతి కమిటీని ఒక ఛాలెంజ్ గా తీసుకొని సమర్థవంతంగా వ్యవహరిస్తే కమిటీ గుర్తింపు వస్తుందని, దాంతో కమిటీ సమావేశాలకు సభ్యుల హాజరు శాతం కూడా పెరుగుతుందని చెప్పారు. మనం చేసే పనుల ద్వారా సంతృప్తి మిగులుతుందన్నారు. హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు విషయంలోగాని, కోటప్పకొండని అభివృద్ధి చేయడంలోగానీ తనకు సంతృప్తి మిగిలిందన్నారు. కోటప్పకొండని సందర్శించి, అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించమని ఆయన చైర్మన్లను కోరారు. షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ టి.శ్రావణ్ కుమార్ తన నియోజకవర్గంలో పెన్షనర్లు అందరినీ పెన్షన్ తీసుకునే రోజు ఒక చోటకు పిలిచి పెన్షన్ తోపాటు భోజనాలు పెట్టి, ఉచిత వైద్యశిబిరం నిర్వహించారని, అది చాలా  మంచి కార్యక్రమం అని కొనియాడారు. సభ్యులు జిల్లాలకు వెళ్లే ముందు తెలియజేస్తే, ఆయా జిల్లా అధికారులకు లేఖలు రాస్తామని, అక్కడ మీకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి గానీ, అధికారులు స్పందించడానికి గాని అవకాశం ఉంటుదన్నారు. తాను ఓ సోదరుడిలా అందరికీ అన్ని విధాల సహకరిస్తానని చెప్పారు. చైర్మన్, సభ్యులు జిల్లాలకు వెళ్లే ముందు తమకు సంబంధించిన అంశాలన్నిటినీ తెలుసుకొని వెళ్లాలని, అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయని, దూకుడుగా వ్యవహరించకుండా ప్రశాంతంగా కమిటీ సమావేశాలు నిర్వహించాలని డాక్టర్ కోడెల వారికి సలహా ఇచ్చారు. చొరవ చూపించి చొచ్చుకు పోవాలని, శాసనసభలో మీ వాణి వినిపించాలన్నారు. ఇప్పుడు ప్రతిపక్షం హాజరు కావడంలేదని, మీకు సమయం ఎక్కువ ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని సమస్యలు లేవనెత్తాలని సూచించారు.

          వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్ గుండుమల  తిప్పేస్వామి మాట్లాడుతూ ఈ కమిటీకి తాను వరుసగా 4వ సారి చైర్మన్ గా నియమితులైనట్లు తెలిపారు. చైర్మన్లు అందరినీ ఈ విధంగా పిలిచి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారని, ఇది మంచి పద్దతని చెప్పారు.  ఎస్సీ,ఎస్టీ,బీసీల విషయంలో ప్రభుత్వ శాఖలతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులలో కూడా  రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరిగేట్లు చూడాలన్నారు. కమిటీలు జిల్లాలకు వెళ్లినప్పుడు ఆయా శాఖ ఉన్నతాధికారులు సరిగా స్పందించడంలేదని, ఈ అంశమై జిల్లా కలెక్టర్లు అందరికీ లేఖలు రాయాలని కోరారు. రెవెన్యూ డివిజన్ స్థాయి వరకు వెళ్లి తాను సమావేశాలు నిర్వహించి, నివేదికలు సమర్పించినట్లు తెలిపారు.

         మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ ఏ.చాంద్ బాషా మాట్లాడుతూ మైనార్టీల్లో అత్యధిక మంది పేదరిక రేఖ దిగువన ఉన్నారని, విద్యా,వ్యాపార పరంగా వారు అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ డి..సత్య ప్రభ మాట్లాడుతూ అందరి సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. సభ్యులను చైతన్య పరచి కమిటీ సమావేశాలకు అధిక శాతం మంది హాజరయ్యేవిధంగా చేస్తానన్నారు. సబార్డినేట్ కమిటీ చైర్మన్  శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ స్పీకర్, తిప్పేస్వామి వంటి సీనియర్ ల సలహాలు తీసుకొని తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ తాను రెండవసారి ఈ కమిటీకి చైర్మన్ గా నియమితులైనట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, విద్యుత్, రవాణా సౌకర్యాలు లేవని, తాము అన్ని ప్రాంతాలు పర్యటించి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఆరు వేల గ్రామాలకు విద్యుత్, రవాణా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. గిరిజనులకు న్యాయం చేస్తానన్నారు.
షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ టి.శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం ఇదే మొదటిసారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యనలు చేసి సమస్యలను నివేదిస్తానని చెప్పారు.

      సమావేశంలో శాసనమండలి ఇన్ ఛార్జి చైర్మన్, శాసనమండలి పిటిషన్స్ కమిటీ చైర్మన్  రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసనసభ డిప్యూటి స్పీకర్, శాసనసభ పిటిషన్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ద ప్రసాద్, శాసనసభ ప్రభుత్వ అస్యూరెన్సెస్ కమిటీ చైర్మన్ జి.సూర్యారావు, శాసనమండలి పేపర్స్ లెయిడ్ ఆన్ ద టేబుల్ కమిటీ చైర్మన్ యలమంచిలి వెంటక బాబూ రాజేంద్ర ప్రసాద్, శాసనసభ ఇన్ చార్జి కార్యదర్శి ఎం.విజయరాజు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కమిటీల చైర్మన్లు
ఇంకా శాసనసభ ఎమినిటీస్ కమిటీ, పర్యావరణం, అడవి జంతుల పరిక్షణ కమిటీలకు చైర్మన్ కు చైర్మన్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు, లైబ్రరీ కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్, శాసనసభ ప్రివిలైజెస్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ డి.శ్రీబాల వీరాంజనేయ స్వామి, శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా పి.నారాయణ స్వామి నాయుడు, శాసనమండలి ప్రివిలైజెస్ కమిటీ చైర్ పర్సన్ గా పమిడి శమంతకమణి, శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా  డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి, శాసనమండలి ప్రభుత్వ అస్యూరెన్సెస్ కమిటీ చైర్మన్ గా గాలి ముద్దుకృష్ణమ నాయుడుని నియమించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...