Nov 16, 2017

సమ్మిళిత అభివృద్ధి – 17 లక్ష్యాలు


Ø శాసనసభలో కూడా చర్చకు రానున్న అంశం
Ø 27 స్థూల స్థాయి లక్ష్యాలు, 104 సూక్ష స్థాయి సూచికలు
Ø సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో ఏపీ
Ø 2030 నాటికి పేదరిక నిర్మూలన
Ø 2019 నాటికి 100 శాతం ఆన్ లైన్ ప్రభుత్వ సేవలు

     సమ్మిళిత అభివృద్ధి, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, స్థిరమైన వృద్ధి వంటి పదాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినవస్తున్నాయి. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ సూచనల మేరకు ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ఒక రోజు ఈ అంశంపై చర్చించాలని బీఏసీ (బిసినెస్ అడ్వయిజరీ కమిటి) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  ఒక్క స్థూల జాతీయోత్పత్తి మాత్రమే కాకుండా వృద్ధి -అభివృద్ధి,  చేరిక,  సమానత-స్థిరత్వం, 12 అంశాల్లో సామర్థ్య సూచికల ఆధారంగా శాస్త్రీయ పద్దతుల్లో  దీనిని లెక్కిస్తారు. ప్రపంచ ఆర్థిక ఫోరం సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి నివేదిక-2017 ప్రకారం సమ్మిళిత ఆర్థిక వృద్ధి సూచీలో భారత  79వ స్థానంలో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 60వ స్థానంలో ఉంది. పొరుగున్న ఉన్న చైనా 15వ స్థానంలో, నేపాల్ 27వ స్థానంలో, పాకిస్థాన్ 52వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో, అజర్‌బైజాన్, హంగరీ రెండు, మూడు స్థానాలు ఆక్రమించాయి. 2015 సెప్టెంబర్ లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యునైటెడ్ నేషన్స్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సదస్సులో పాల్గొన్న తరువాత ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై దృష్టిసారించార. యునైటెడ్ నేషన్స్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలలో పేర్కొన్న ప్రకారం 2030 నాటికి జాతీయాభివృద్ధికి సాధించవలసిన 17 ప్రధాన లక్ష్యాలతోపాటు 169 సూక్ష్మ లక్ష్యాలనుల నిర్ధేశించారు. అలాగే రాష్ట్రాలకు కూడా కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఈ క్రమంలో 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత అనేక సవాళ్లను ఎదుక్కొంటూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గడచిన మూడేళ్లలో రెండంకెల వృద్ధి రేటుతో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వ గణాంక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పలు చర్యలు చేపట్టింది. 17 ప్రధాన లక్ష్యాలు, స్థూల స్థాయిలో 27 లక్ష్యాలు, సూక్ష స్థాయిలో 104 సూచికలతో ఒక ప్రణాళిక రూపొందించి మొదటి అడుగు వేసింది.
జాతీయ స్థాయిలో నీటి(నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా) అయోగ్, అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ రూపొందించిన అంశాల ఆధారంగా రాష్ట్రాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయంగా ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టింది. ఆచరణలో సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల కార్యకలాపాలను సమన్వయపరచడానికి రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో విజన్ మేనేజ్ మెంట్ యూనిట్(విఎంయు)ని ఏర్పాటు చేశారు.
మానవాభివృద్ధికి పేదరికం పెద్ద అండ్డంకిగా ఉంటుంది. అందువల్ల 2030 నాటికి పేదరికం అనేది ఏ రూపాలలో ఉన్నా దానిని నిర్మూలించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆదాయం, వినియోగం ఆధారంగా ప్రస్తుతం దేశంలో వివిధ రూపాలలో ఉన్న పేదరికం  రేట్ 20.9 శాతం ఉండగా, రాష్ట్రంలో 9.2 శాతం మాత్రమే ఉంది. దానిని 2019 నాటికి 7.3 శాతానికి, 2022 నాటికి 2.8 శాతానికి, 2029 నాటికి 0 కి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  అలాగే అందరికీ సామాజిక భద్రక కల్పించాలని కూడా నిర్దేశించుకుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మంచినీరు, రవాణా, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కనీస సౌకర్యలు కల్పించడం, పెన్షన్ వంటి వాటి ద్వారా సామాజిక రక్షణ కల్పించడం, వనరులు అందరికీ సమానంగా అందుబాటులో ఉంచడం, ఆధాయ మార్గాలు కల్పించడం వంటి బహువిధాలైన చర్యల ద్వారా వారి జీవన ప్రమాణ స్థాయిని ప్రభుత్వం పెంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ స్థాయికంటే మెరుగ్గా మానవాభివృద్ధి సూచిక 0.665 గా ఉంది. దానిని 2019 నాటికి 0.7, 2022 నాటికి 0.8, 2029 నాటికి 0.9 కి తీసుకు వెళ్లాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉంది.
      ఆహార ధాన్యాల ఉత్పాదకత పెంచడం ద్వారా అందరికీ పౌష్టికాహారం అందిస్తారు. ఉత్తమ వైద్య విధానాలను అనుసరించి వెయ్యికి 35గా ఉన్న శిశు మరణాలను మూడుకు తగ్గిస్తారు.  ప్రాణాంతకమైన ఎంఎంఆర్ ( మమ్స్-గవద బిళ్ళలు, మీజిల్స్‌-తట్టు, రూబెల్లా) వ్యాధులను వ్యాక్సిన్‌ ద్వార నిర్మూలిస్తారు. ప్రస్తుతం 66 శాతంగా ఉన్న రోగ నిరోధక శక్తిని 2019 నాటికి 100 శాతంగా పెంచుతారు.  ఉత్తమైన విద్యను అందించడంతోపాటు 67.4 శాతం ఉన్న అక్షరాశ్యతను 2019 నాటికి 100 శాతానికి పెంచాలన్నది,  పాఠశాలల్లో బాలబాలిక స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్- గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో) ని 2018 నాటికి 100 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. అలాగే మధ్యలో బడి మానివేసే పిల్లల సంఖ్య (డ్రాప్ అవుట్ రేట్) 0 కి చేర్చాలని, 2019 నాటికి మహిళా అక్షరాశ్యతని 100 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 45 శాతం మంది ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉన్న సురక్షిత త్రాగునీటిని అందరికీ అందిస్తారు. రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా బహిరంగ మలవిసర్జన లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా నిలిపింది. రాష్ట్రంలని మారుమూల గ్రామాలతో సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ అందించడంతోపాటు 5.14 శాతంగా ఉన్న పునరుత్పాధకత శక్తిని 30 శాతానికి పెంచాలని నిర్ధేశించారు. ప్రస్తుతం 10.99గా ఉన్న వార్షిక ఆర్థిక వృద్ధి రేటుని  12 శాతానికి, తలసరి ఆదాయం రూ.1,22,376 నుంచి రూ.9,60,768కి, డిజిటల్ మౌలిక వసతులు 100 శాతం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం అత్యత ప్రాధాన్యత ఇస్తోంది. ఆ క్రమంలో వ్యాపార నిర్వహణకు అనువైన ప్రాంతాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్రంలో ఆర్థక అసమానతలు తగ్గించి జిని కోఎఫిషియంట్( ఆదాయ వ్యత్యాస గణాంక కొలమానం) 0.29 నుంచి 0.26 కి చేర్చాలని, అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 61.3 శాతం ప్రథమిక సేవలను 100 శాతానికి, 31 శాతంగా ఉన్న మురుగునీటి పారుదల సౌకర్యాన్ని 100 శాతానికి పెంచాలని, పక్కా గృహాలు నిర్మించడం వంటి చర్యల ద్వారా సమ్మిళిత నగరాలు, వర్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల వీధులను  లెడ్ (ఎల్ఈడి-లైట్ ఎమిట్టింగ్ డైయోడ్) బల్బుల వెలుగులతో నింపిన ప్రభుత్వం ఇక అన్ని గ్రామాల వీధులలో కూడా 100 శాతం వీటిని అమర్చాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని వాతావరణ మార్పులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
      మెరైన్ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని  మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) లెక్కల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9,45,892 మెట్రిక్ టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  రూ.30,420.83 కోట్ల ఆదాయం లభించింది. ఎగుమతి అయినవాటిలో ఎక్కువ భాగం రొయ్యలు, చేపలు ఉన్నాయి.రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది. సముద్రం ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరగడానికి అవకాశం ఉంది.  2015-16లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  వీటిలో 98,553 టన్నులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి. సముద్ర ఉత్పత్తుల మొత్తం  ఎగుమతులలో  అత్యధిక భాగం 1,58.100 టన్నులు రొయ్యలే ఉన్నాయి. ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి ఎదగడానికి తగిన ప్రణాళికలు రూపొందించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఒక పాలసీని కూడా తీసుకువచ్చారు.   స్వచ్ఛాంధ్ర పేరుతో పారిశుధ్యంతోపాటు రాష్ట్రంలో పచ్చదనం నింపడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  ప్రస్తుతం ఉన్న 23.04 శాతం అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి, 26 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి  పెంచుతారు. ప్రస్తుతం 44.16 శాతంగా ఉన్న ఆన్ లైన్ ప్రభుత్వ సేవలను శత శాతానికి పెంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.  2017-18 సంవత్సరాన్ని ఇ-ప్రగతి పాలనసంవత్సరంగా ప్రకటించింది.  రాష్ట్రంలో ఇ-ప్రగతి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితో సమాచార, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అత్యున్నతంగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టుకు రూపొందించారు. కేంద్రం డిజిటల్‌ ఇండియా ప్రణాళిక సిద్ధం చేయడంతో అన్ని రాష్ట్రాల కన్నా ముందే దాని అమలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. రాష్ట్రంలో  జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రారంభించి చాలా వరకు పూర్తి చేసింది.  పారదర్శక పాలన, పౌరులందరికీ సత్వర సేవలు  అందించేందుకు 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్ఈఏ)లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ఇ-ప్రగతిరూపకల్పన జరిగింది. ఇటువంటి ప్రాజెక్టు చేపట్టిన రాష్ట్రం దేశంలోనేకాదు దక్షిణాసియాలోనే మొదటిది ఏపీ.  రెవిన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం  పడే ఇబ్బందులను  ఇప్పడు చాలా వరకు తగ్గించారు.  ఇప్పటికే కుల, ఆధాయ ధృవీకరణ, ఇసీ, బీ1 అడంగుల్... వంటి దాదాపు 600 సేవలు అందుబాటులోకి వచ్చాయి.
లక్ష్య సాధన కోసం అంతర్జాతీయ సమాజ భాగస్వామ్యతో జీసీఐ( గ్రాస్ కమిషన్ బుల్ ఇన్ కం) స్థాయిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 36వ స్థానం నుంచి అంతర్జాతీయంగా 20 లోపల స్థానానికి చేర్చడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ విధంగా అత్యాధునిక సాంకేతికతతో వ్యవసాయ, పారిశ్రామిక, సాంస్కృతిక, రవాణా, విద్య, వైద్యం, కమ్యూనికేషన్స్, మౌలిక వసతులు తదితర రంగాల్లో అంతర్జాతీయ స్ధాయి పోటీని తట్టుకునేవిధంగా రాష్ట్రాన్ని తయారు చేయడంతోపాటు ప్రజలకు సమాన అవకాశాలు, సామాజిక భద్రత కల్పిస్తూ వారి సంతృప్తిని, సంతోషాన్ని 80 శాతానికి పైగా పెంచుకుంటూ సమ్మిళిత అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...