Nov 9, 2017

నగరాలు సత్వర అభివృద్ధికి అవకాశాలు


Ø కేంద్రం 3, రాష్ట్రం 13 స్మార్ట్ సిటీల ఎంపిక
Ø అమృత్ పథకం కింద 33 పట్టణాలు అభివృద్ధి
Ø పెట్టుబడులకు ఉపాధికి అవకాశాలు
       
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలతోపాటు కేంద్రం కూడా తగిన స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో నగరాల అభివృద్ధికి మార్గం ఏర్పడింది. రాష్ట్రంలో కేంద్రం 3, రాష్ట్ర ప్రభుత్వం 13 మొత్తం  16 నగరాలను స్మార్ట్ సిటీలుగా రూపొందించడానికి పూనుకున్నాయి. స్మార్ట్ సిటీ అనే పేరు 2008లో ఆవిర్భవించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పదం పుట్టుకొచ్చింది. తొలుత ఐబిఎం స్మార్ట్ సిటీలపై దృష్టి పెట్టింది. 2009లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్మార్ట్ సిటీలపై ఆసక్తి కనబరిచాయి. దక్షిణ కొరియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా వంటి దేశాలు స్మార్ట్ సిటీల ఏర్పాటు, పరిశోధనలు చేయడం మొదలుపెట్టాయి. అందుకోసం భారీ స్థాయిలో వ్యయం కూడా చేశాయి. మన దేశం విషయానికి వస్తే వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరచాలని కేంద్రం నిర్ణయించింది. నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాల కల్పనతోపాటు సుస్థిర రియల్ ఎస్టేట్, స్మార్ట్ టెక్నాలజీ, సమాచారం, మార్కెట్ సౌకర్యాలు వంటి వాటిని  అందుబాటులోకి తీసుకురావడమే స్మార్ట్ సిటీల ప్రధాన లక్ష్యం. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ, నీటి వృథాను అరికట్టే సెన్సార్స్, వ్యర్థ నీటి రీసైక్లింగ్, గ్రీన్ స్పేస్భౌతిక, సాంఘిక మౌలిక సదుపాయాల కల్పన, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి వస్తు, సేవల లభ్యత, ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల, సహజ వనరుల సమర్థ వినియోగం, రియల్ టైమ్ గవర్నెస్, పాలనలో పౌరుల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఆర్థిక వృద్ధి, గ్లోబల్ నెట్ వర్కింగ్, సృజనాత్మక పరిశ్రమ, ఆధునిక సమాచార వ్యవస్థ, -ప్రగతి,  పారిశ్రామికీకరణ, భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ వంటివన్నీ సమకూర్చడమే స్మార్ట్ సిటీల ప్రణాళికల లక్ష్యం. ఈ నేపధ్యంలో కొన్ని ప్రమాణాల ఆధారంగా కేంద్రం 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసింది.  విశ్వసనీయత, నగరాన్ని అభివృద్ధి చేయడంలో భవిష్యత్తు వ్యూహం, ఆర్థిక-పర్యావరణ ప్రభావాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు, వినూత్న విధానాలు.. ఇలా మొత్తం ఆరు  విభాగాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మన రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలకు స్మార్ట్ సిటీల జాబితాలో స్థానం కల్పించింది. ఒక్కో స్మార్ట్‌సిటీకి ఏడాదికి రూ.100 కోట్లు చొప్పున ఐదేండ్లపాటు కేంద్రం నిధులు కేటాయిస్తుంది.  ఇందు కోసం కేంద్రం రూ.48,000 కోట్లు కేటాయించింది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీస్ మిషన్ ఈ నిధులను విడుదల చేసి, వ్యయాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ మూడు నగరాలతోపాటు అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న మరో 13 స్మార్ట్ సిటీలను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పారిశ్రామిక, రవాణా, ఐటీ, త్రాగునీరు,  విద్య, వైద్యం, విద్యుత్ వంటి రంగాల్లో వీటిని అభివృద్ధిపరచాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని ఏలూరు, విజయవాడ, గుంటూరులతోపాటు మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో  వీటిని అభివృద్ధి పరుస్తుంది. మొదటి దశలో ఏలూరు, నెల్లూరు, శ్రీకాకుళం, ఒంగోలు, కర్నూలు, అనంతపురం మొత్తం 6 నగరాలను అభివృద్ధి చేస్తుంది. రెండవ దశలో మిగిలిన విజయనగరం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, మచిలీపట్నం, కడప, చిత్తూరు 7 నగరాలపై దృష్టిపెడుతుంది.
ఈ స్మార్ట్ సిటీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం, మౌలిక వసతులు కల్పించడంలో ఆయా జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. స్మార్ట్ సిటీ ఎస్పీవీ(స్పెషల్ పర్సస్ వెహికల్)కి కలెక్టర్లే చైర్మన్లుగా వ్యవహరిస్తారు. స్మార్ట్ సిటీల ప్రణాళిక ప్రక్రియలో కూడా వారు పాల్గొంటారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న భారీ ప్రాజెక్టులను వారు గుర్తించి, వాటి ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపడతారుఆ ప్రాజెక్టలకు అవసరమైన భూ కేటాయింపులు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా వారే కల్పిస్తారు. అయితే మునిసిపల్ కార్పోరేషన్లు స్మార్ట్ సిటీలు సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించవలసి  ఉంటుంది. దేశంలో స్మార్ట్ సిటీల ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, జపాన్, చైనా, సింగపూర్, ఇజ్రాయెల్ వంటి దేశాలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అలాగే అనేక ప్రముఖ ఐటీ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
స్మార్ట్ సిటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ అమృత్(ఏఎంఆర్ యుటీ- అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్) పథకం కింద 500 పట్టణాలకు పూర్తిస్థాయిలో కొత్త రూపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా   ఆంధ్రప్రదేశ్‌లో 33 పట్టణాలను గుర్తించారువాటిలో అమరావతి,  గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయనగరం,  విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, కడప, అనంతపురం, ఏలూరు, కావలి, ప్రొద్దుటూరు, నంద్యాల, ఆదోనీ, మదనపల్లి, చిత్తూరు, మచిలీపట్నం, తెనాలి, చీరాల, హిందూపురం, శ్రీకాకుళం, భీమవరం, ధర్మవరం, గుంతకల్లు, గుడివాడ, నర్సరావుపేట, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట ఉన్నాయి. ఈ పథకాలకయ్యే ఖర్చులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వాటా భరించాలి. ఈ పథకాన్ని 2015-16 నుంచి 2019-20 వరకు 5 ఏళ్లపాటు కొనసాగించేందుకు రూ.50వేల కోట్ల రూపాయలు కావాలన్నది అంచనా. ఈ పథకాన్ని 20 ఏళ్లు కొనసాగించవలసి ఉంటుందని, అందుకు మొత్తం రూ.39.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది.  ఈ పథకం కింద 2015-16లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.60.08 కోట్లు, 2016-17లో  రూ.70.32 కోట్లు, 2017-18లో రూ.80.92 కోట్లు విడుదల చేసింది. పట్టణాల్లో పారిశుధ్యం, మౌలికవసతుల అభివృద్ధి ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాగునీటి సరఫరా, పారిశుధ్యం మెరుగు, వరదనీటి ప్రవాహం నియంత్రణ, పాదచారుల కోసం పేవ్‌మెంట్లు, నాన్‌ మోటరైజ్డ్‌ ప్రజా రవాణా, పార్కులు, ఖాళీ ప్రదేశాల సుందరీకరణ తదితర కార్యక్రమాల కోసం అమృత్‌ పథకం నిధులు ఖర్చు చేస్తారు.  ఆ విధంగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు సమగ్రంగా, సత్వరం అభివృద్ధి చెందడమేకాక, పెట్టుబడులు రావడానికి, యువతకు ఉపాధి అభించడానికి  అవకాశాలు ఏర్పడ్డాయి.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...