Nov 3, 2017

గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత


మంత్రి కాలవ శ్రీనివాసులు
Ø 13 జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లతో సమీక్ష
Ø వారం వారం సమీక్షతో వ్యవస్థని పరిగెత్తించాలి
Ø నా పనితీరుపై నేను కూడా సీఎంకు నివేదికలు ఇస్తా
Ø  అలసత్వం ప్రదర్శించే ఏఈలు, వర్క్ ఇనస్టెక్టర్లపై చర్యలు
Ø 2018 జూన్ కి 5 లక్షలు, 2019 జనవరికి 10 లక్షల ఇళ్లు లక్ష్యం

   సచివాలయం, నవంబర్ 2: తమ ప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 13 జిల్లాలకు చెందిన ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అధికారులతో మంత్రి సమావేశమై ఎన్టీఆర్  గృహ నిర్మాణ పథకం ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము వెళ్లిన ప్రతి గ్రామంలో, సర్వేల్లో పేదలు ఇళ్లు కావాలని అడుగుతున్నారని, అందువల్లే ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చి, ఇళ్ల నిర్మిణం త్వరగా జరగాలని  వెసులుబాట్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇంటిని 750 చదరపు అడుగుల వరకు, జాయింట్ వాల్స్ నిర్మించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. అలాగే బిల్డింగ్ ప్లాన్ నించి కూడా మినహాయింపు ఇచ్చారని తెలిపారు.  రాష్ట్రంలో గృహాలు లేని బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్లు నిర్మించే బృహత్తరమైన చాలా పెద్ద రూ.19వేల కోట్ల ప్రాజెక్ట్ అని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఉద్యోగులకు సంతృప్తినిస్తుందని, అలాగే ఏఈలకు, వర్క్ ఇనస్టెక్టర్లకు గ్రామాల్లో గౌరవం పెరుగుతుందన్నారు. గృహ నిర్మాణ పథకం అమలులో ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇదంతా సిబ్బంది శ్రమ ఫలితమేనని  కొనియాడారు. కొంతవరకు ప్రగతి సాధించినప్పటికీ, అధిగమించాల్సిన లక్ష్యం చాలా ఉందని,  2018 జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు, 2019 జనవరి నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇక నుంచి వారం వారం జరిగిన పనులను సమీక్షించుకుంటూ వ్యవస్థని పరిగెత్తించాలని, ప్రతి జిల్లాలో ప్రగతిని చూపించాలని పిలుపు ఇచ్చారు. ఇబ్బందులను, సమస్యలను అధిగమించి సత్తాచాటాలన్నారు. లక్ష్యాన్ని ప్రణాళికా బద్దంగా సాధించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పారు. ఉద్యోగుల పనితీరు మదింపు చేసి తక్కువ పనిచేసే ఉద్యోగుల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికి వారు తమ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. తాను కూడా మంత్రిగా నెలకు ఒకసారి సీఎంకు తన వ్యక్తిగత పనితీరుపై నివేదికను ఇస్తానని చెప్పారు. తాను కర్నూలు జిల్లాకు ఇన్ ఛార్జిగా ఉన్నందున అక్కడకు ఎన్ని సార్లు వెళ్లింది, ఏఏ ప్రాంతాలు సందర్శించింది, ఎన్ని సమస్యలను పరిష్కరించింది, అలాగే తన నియోజకవర్గానికి నెలలో 10 రోజులు వెళ్లవలసి ఉందని, అక్కడ సమస్యలను, పరిష్కరించిన అంశాలను, అలాగే మొత్తం మీద ఎన్ని పాఠశాలలు, హాస్టళ్లు సందర్శించింది తదితర వివరాలను సీఎంకు అందజేస్తానని చెప్పారు. అలాగే అధికారులు, ప్రతి ఒక్క బాధ్యులు తమతమ పనితీరును సమీక్షించుకోవాలని చెప్పారు.

పని విషయంలో, లక్ష్యాలను పూర్తి చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శించే ఏఈలు, వర్క్ ఇనస్టెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమకు ఎవరిమీద శత్రుత్వంలేదని, పనిపై శ్రద్ధ చూపనివారి వల్ల ఇంతటి పెద్దఎత్తున పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి నష్టం జరుగుతుందని, అందువల్ల అటువంటివారిపై చర్యలు తీసుకొని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని మంత్రి కాలవ చెప్పారు.
        గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయని, అయితే వాటిని అధిగమించి సమర్థవంతంగా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. వర్క్ ఇనస్టెక్టర్లు ఒక్కొక్కరు 250 ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించవలసి ఉందని, అలాగే జియో ట్యాంగింగ్ వారు చేయాలని వారితోపాటు డీఈలు, వర్క్ ఇనస్టెక్టర్ల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. కృష్ణా, గుంటూరు, విజయనగరం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పని తీరు ఇంకా మెరుగుపడవలసిన అవసరం ఉందన్నారు. పని జరిగిన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పారు.
జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. విశాఖ జిల్లా పాడేరు డివిజన్ లో ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇటుకల రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నట్లు చెప్పారు. పరిస్థితిని  సీఎంకి గిరిజన ప్రాంతాలకు అదనపు నిదులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని మంత్రి చెప్పారు. కొన్ని జిల్లాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. వెంటనే సిబ్బందిని నియమించుకోమని చెప్పారు. సిబ్బంది నియామకం, అవుట్ సోర్సింగ్ ఏజన్సీల అంశంపై కూడా చర్చించారు.  ఇంకా చురుకుగా పనిచేస్తేనే లక్ష్యాలను అధిగమించగలమని ఎండి చెప్పారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...