Nov 10, 2017

రోగులే ముందు- అదే మా నినాదం


ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
ఉద్దానంలో ఐసీఎంఆర్ సెంటర్ ఏర్పాటు టెండర్లు రేపు ఖరారు

          సచివాలయం, నవంబర్ 9: ‘రోగులే ముందు’- అదే తమ నినాదం అని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందు రోగులకు వైద్యం చేయడమే అత్యంత ప్రాధాన్యతా అంశంగా పరిగణిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీసెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య శాఖ పని తీరుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న, ఈరోజు సమీక్షించారని చెప్పారు.  ఎన్టీఆర్ వైద్య సేవ సౌజన్యంతో కార్పోరేట్ ఆస్పత్రులు కూడా తమకు సాధ్యం కాదని వదిలివేసిన అత్యంత క్లిష్టమైన కేసులను కూడా సవాల్ గా స్వీకరించి శస్త్రచికిత్సలు చేసి రోగులను బతికించిన డాక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలతో ముంచెత్తారన్నారు. ముఖ్యమైన ప్రగతి సూచికలను ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వ వైద్య సదుపాయాలు, సేవలు మదింపు చేసినట్లు తెలిపారు. వారసత్వంగా వచ్చే జబ్బులపై అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేకించి ప్రాంతాలవారీగా ఎప్పుడెప్పుడు ఏఏ వ్యాధులు వస్తాయో గత రికార్డులను అనుసరించి బేరీజువేసుకొని ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఇందుకు ఆరోగ్య కంట్రోల్ రూమ్ తో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. వైద్యం కోసం వైద్య కేంద్రాల ఏర్పాటు, చికిత్స తదితర అంశాలను సమన్వయం చేసుకొంటూ సేవల్లో 80 శాతం సంతృప్తి రావాలని సీఎం కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సంతృప్తి 70 శాతం పెరిగినట్లు అధికారులు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య శాఖలో పీపీపీ విధానంలో అమలవుతున్న పలు పథకాలు, నాలెడ్జి పార్టనర్స్, నోడల్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. శానిటేషన్ గతంలో కంటే 70 శాతం మెరుగుపడినట్లు తెలిపారు. త్వరలో 150 సీహెచ్ సీలలో కొత్త శానిటేషన్ పాలసీని అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్ 94 శాతం అందజేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రలు, తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్ కార్యక్రమంపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. 108 సర్వీసుల ద్వారా సమాచారం అందిన వెంటనే రోగిని సంబంధిత ప్రాంతానికి తీసుకువెళ్లడానికి పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 29 నిమిషాలు పడుతుందన్నారు. ఆ సర్వీస్ లో అత్యవసర పరికరాలు అందుబాటులో ఉంచాలని గుర్తించినట్లు చెప్పారు. స్వస్థ విద్యావాహిని పథకం ద్వారా వైద్య విద్యార్థులు గ్రామాలకు వెళ్లి రోగులను పరీక్షిస్తారన్నారు. ఉచిత డయాలసిస్ సేవల విషయంలో రోగులు 92 శాతం సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ పథకం కింద మధుమేహం, బీపీ, కంటిచూపు, హార్మోన్ డిజార్డర్, రొమ్ము క్యాన్సర్ మొదలైన ప్రాణాంతకమైన 7 వ్యాధుల నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం కింద సబ్ సెంటర్ల స్థాయిలో 8,19,925 మంది మహిళలు క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. అత్యవసర వైద్యసేవా పరికరాల నిర్వహణ, మరమ్మతులను వేగంవంతం చేసి వైద్యసౌకర్యాల కల్పనకు ఆటంకంలేకుండా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఏఎన్ఎంలకు ఉచితంగా ట్యాబ్ లు ఇవ్వడంతోపాటు వారికి శిక్షణ ఇప్పించాలని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు.

ఫాతీమా కాలేజీ అంశంపై న్యాయనిపుణులను తీసుకొని  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, తాను కలసి ఈ నెల 13న ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు. ఎంసీఐ ప్రతినిధులతోపాటు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ ను కలుస్తామన్నారు. ఫాతీమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఉద్దానంలో ఐసీఎంఆర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను శుక్రవారం ఢిల్లీలో ఖరారు చేస్తారని చెప్పారు. మందుల కల్తీపై డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రగ్, ఆహార తనిఖీ శాఖలను విలీనం చేయడానికి సీఎం అంగీకరించారని, త్వరలో వాటిని విలీనం చేస్తామని మంత్రి కామినేని  చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...