Nov 8, 2017

ఆక్వాకల్చర్ వ్యవస్థ క్రమబద్దీకరణ


ఎపెక్స్ కమిటీ తీర్మానం
ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా జోన్
నల్సార్ యూనివర్సిటీ సహకారంతో నూతన ఆక్వా చట్టం
రాష్ట్ర ఆక్వా కల్చర్ అథారిటీ, ఆక్వాకల్చర్ సెంట్రల్ ఇన్ స్టిట్యూట్, ఆక్వా కల్చర్ పరిశోధనా కేంద్రం
ఆక్వా రైతుల విదేశీ పర్యటన
హెచరీస్, రొయ్యల చెరువుల చెరువుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
 ఆక్వా మందుల షాపులకు అనుమతులు తప్పనిసరి
ఆక్వా ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ
యాంటిబయాటిక్ మందుల నియంత్రణ
ధృవీకరించిన మందులు మాత్రమే అమ్మకం
మందులు బయట అమ్మకాలు నిలిపివేయాలి
క్లస్టర్ స్థాయిలో  రైతులకు నిరంతరం శిక్షణ
వంద శాతం పరీక్షించిన తరువాతే ఎగుమతి
కలెక్టర్లకు కీలక బాధ్యతలు
నిబంధనల ప్రకారం రొయ్యలు, చేపల పెంపకం
రొయ్యలు చేపలు కొనుగోలుదారుల సమావేశం ఏర్పాటు
రెడీ టు ఫుడ్ తయారీ ఆలోచన
     సచివాలయం, నవంబర్ 7: ఇప్పటి వరకు ఒక పద్దతి, నియమనిబంధనలు లేకుండా కొనసాగుతున్న ఆక్వాకల్చర్ వ్యవస్థను పూర్తిగా క్రమబద్దీకరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన సచివాలయం 5వ బ్లాక్ సమావేశమందిరంలో మంగళవారం సమావేశమైన ఎపెక్స్ కమిటీ తీర్మానించింది. ఇప్పటి వరకు రైతులే తమకు తెలిసినంతలో చేతనైనంతవరకు రొయ్యలు, చేపల ఉత్పత్తిని, ఎగుమతులలో పురోగతి సాధించారని, నూతన చట్టం, నియమనిబంధనల ద్వారా ఇక ముందు వ్యవస్థను పటిష్టపరచి నాణ్యమైన ఉత్పత్తులు, ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్న అభిప్రాయన్ని సభ్యులు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కోస్తాలోని 9 జిల్లాల కలెక్టర్లు ముఖ్య భూమిక పోషించవలసి ఉంటుందన్నారు.  ఆక్వా ఉత్పత్తులు ముఖ్యంగా రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నందున ఉత్పత్తి, ఉత్పాదన పెంచడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులపై  ప్రభుత్వం దృష్టి పెట్టవలసి ఉందన్నారు. నల్సార్ యూనివర్సిటీ సహకారంతో నూతన ఆక్వా చట్టం రూపొందించాలని కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు.
        
         మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్వా రంగంలో తనకు సుదీర్ఘకాలం అనుభవం ఉందని, దేశంలోనే మొదటిసారిగా రొయ్యలు, చేపల చెరువులు సాగుచేయడం కొల్లేరు ప్రాంతంలో ప్రారంభమైనట్లు చెప్పారు. రైతులకు నాణ్యమైన సీడ్ అందించి, అంతే నాణ్యమైన ఉత్పత్తులు పొందడానికి ప్రయత్నించాలన్నారు. వాళ్లకు తెలిసిన పరిధిలో రొయ్యలు, చేపల చెరువులు నిర్వహిస్తున్నారని,  వారికి బీమా సౌకర్యం కల్పించాలని, వారు ఆధునిక పద్దతుల్లో, యాంటిబయాటిక్స్ ఎక్కువగా వాడకుండా నాణ్యమైన ఉత్పత్తులు సాధించడానికి తగినవిధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ నెల 28న యూరోపియన్ యూనియన్ వారు మన దేశానికి వస్తున్నారని, మన రాష్ట్రానికి కూడా వస్తారని మంత్రి చెప్పారు.
          పశుసంవర్ధక, ఫిషరీస్ శాఖల మంత్రి సీహెచ్.ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వ్యవస్థను క్రమబద్దీకరించవలసి ఉందని,  రైతులకు తెలియనందున ప్రారంభంలో  అధికారులే వెళ్లి రొయ్యలు, చేపల చెరువలను రిజిస్టర్ చేయాలన్నారు. ల్యాబ్ లకు కావలసిన పరికరాలు సమకూర్చి, తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రభుత్వ ల్యాబ్ లపై నమ్మకం పెంచాలన్నారు.

        ఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్రంలోని పరిస్థితి సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో 85వేల మంది వరకు రొయ్యల, చేపల చెరువులు రైతులు ఉన్నారని, అయితే 33,500 మంది రిజిస్టర్ చేసుకోలేదని, తాము 11వేల రైతుల సెల్ నెంబర్లు సేకరించినట్లు తెలిపారు. 56 కాలువలు మరమ్మతులు చేయవలసి అవసరం ఉందన్నారు. ఆక్వా ల్యాబ్ లు 9 జిల్లాల్లో 206 ఉన్నట్లు తెలిపారు. చాలా ప్రాంతాల్లో చెరువులకు విద్యుత్ సౌకర్యంలేదని చెప్పారు. ఏవిధమైన అనుమతులు, ప్రిస్కిప్షన్ లేకుండా  ఆక్వాకల్చర్ కు సంబంధించిన మందులు మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలిపారు.

      డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం ఏ రకమైన మందులు అమ్మాలన్నా అనుమతి తప్పనిసరి అని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. తమ సిబ్బంది దాడులు చేసి అక్రమంగా అమ్ముతున్న మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిలో చైనా, ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్రంలో తయారైన అన్ని రకాల మందులు ఉన్నాయన్నారు. తమ పరిధిలో వెటర్నరీ డివిజన్ కూడా ఉందని, అయితే సిబ్బంది తక్కవగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సమాచారం అందజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

       హెచరీస్, రొయ్యలు, చేపల పెంపకం, వాటికి మందుల వాడకం, కాలుష్య, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, ఆక్వాజోన్, వ్యవస్థలో పని చేసే అన్ని కార్యకలాపాలు నమోదు తదితర అంశాలను దాదాపు 4 గంటలసేపు సుదీర్ఘంగా చర్చించారుప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలను ఆక్వా జోన్ గా ప్రకటించాలని నిర్ణయించారు. జోన్ ప్రకటిస్తే ఆ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం వంటివి కల్పించడానికి అవకాశం ఉంటుందని, అలాగే ఎక్కడ బడితే అక్కడ చేపల చెరువుల పెంపకాన్ని నిరోదంచవచ్చన్న అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. హేచరీస్ ని క్రమబద్దీకరించి, వాటికి గ్రేడింగ్ ఇవ్వాలని,  హెచరీస్, రొయ్యల, చేపల చెరువులు తప్పనిసరిగా  రిజిస్ట్రేషన్ చేయాలని, యాంటిబయాటిక్ మందులను విచ్చలవిడిగా వాడటాన్ని నియంత్రించాలని, ఆక్వా మందుల షాపులకు అనుమతులు తప్పనిసరని, మందులు బయట అమ్మకాలు నిలిపివేయాలనిధృవీకరించిన మందులు మాత్రమే అమ్మాలని నిర్ణయించారు. ధృవీకరణ పొందని  హెచరీస్ ని సీజ్ చేసి, చట్టప్రకారం నియమ నిబంధనలు పాటించేవాటిని మాత్రమే అనుమతించడానికి అంగీకరించారు. అలాగే నిబంధనల ప్రకారం రొయ్యలు, చేపల పెంపకం, నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి  క్లస్టర్ స్థాయిలో  రైతులకు నిరంతరం శిక్షణ ఇప్పించాలని, ఇతర దేశాల్లో ఉత్పత్తి తీరుని గమనించడానికి ఆక్వా రైతులను విదేశీ పర్యటనకు పంపితే బాగుంటుందన్నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారుఆక్వా ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఎప్పటికప్పుడు శిక్షఇప్పిస్తూ ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరంసముద్ర ఉత్పత్తులకు భారీగా అవకాశాలు ఉండటంరాష్ట్రంలో ఆక్వా రంగంలో గణనీయంగా ఉత్పత్తి జరుగుతున్నందున రాష్ట్రంలో రాష్ట్ర ఆక్వా కల్చర్ అథారిటీని, మెరైన్ విశ్వవిద్యాలయాన్ని, ఆక్వాకల్చర్ సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ను, ఆక్వా కల్చర్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసి అవసరం ఉందని సభ్యులు వ్యక్తం చేశారు. హేచరీస్ వారు దరఖాస్తు చేసినా సీఏఏ(ఆక్వా కల్చర్ అథారిటీ) నుంచి లైసెన్స్ లు ఆలస్యంగా ఇస్తున్నందున, దాని ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్నారు. దిగుమతి చేసుకునే దేశాల నియమనిబంధనలకు అనుగుణంగా వంద శాతం పరీక్షించిన తరువాతే సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థను పటిష్టపరిచి రెడీ టు ఫుడ్ ప్యాకెట్లను తయారు చేస్తే ఆదాయం ఎక్కవగా వచ్చే అవకాశం ఉందని పలు సభ్యులు తెలిపారు. ఫిషరీస్ శాఖలో సిబ్బంది కొరతగా ఉందని,  ఖాళీలను వెంటనే  భర్తీ చేయాలని, ఆక్వాకల్చర్ చదివిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని,  రొయ్యలు, చేపలు కొనుగోలుదారుల సమావేశం ఏర్పటు చేయాలని, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే రైతులకు ధర కాస్త ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ల కింద మత్స్యకారులుండే ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని సభ్యులు సలహా ఇచ్చారు.
       
       ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్, కోస్టల్ ఇండియా డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జీవిఆర్ శాస్త్రి, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంత్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్, నెల్లూరు కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ కె.సీతారామరాజు, మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ) డిప్యూటీ డైరెక్టర్ ఏ.లహరి, ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ ఫణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...