Nov 3, 2017

పేదలకు వేగంగా ఇళ్ల నిర్మాణానికి చర్యలు


మంత్రి కాలువ శ్రీనివాసులు
Ø లబ్దిదారులకు అవగాహన సదస్సులు
Ø 2014 కంటే ముందు మంజూరై, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు రూ.25వేలు
Ø ప్రాజెక్ట్ డైరెక్టర్లకు భారీ లక్ష్యాల నిర్ధేశం
Ø కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరుకు ప్రయత్నం

   సచివాలయం, నవంబర్ 2: రాష్ట్రంలో పేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద వేగంగా ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4 బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.  గృహ నిర్మాణ శాఖ 13 జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లతో ఈ ఉదయం సమావేశమై రాష్ట్రంలో ఈ పథకం పనితీరుని సమీక్షించినట్లు చెప్పారు. ఇప్పటివరకు చక్కటి పనితీరు కనపరిచిన శాఖ సిబ్బందికి ఇంకా భారీ లక్ష్యాలను నిర్ధేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పేదల సొంత ఇంటి కల నెరవేర్చడానికి  రూ.19వేల కోట్లతో 13 లక్షల ఇళ్లు కట్టిస్తున్నట్లు చెప్పారుఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేందుకు లబ్దిదారులకు అవగాన కల్పించడానికి కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయడంతోపాటు నియోజకవర్గాల వారీగా, అవసరమైన చోట్ల మండలాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2014 కంటే ముందు మంజూరై, నిర్మాణం పూర్తి కాని ఇళ్లు 2.60 లక్షలు ఉన్నాయని, వాటిలో లక్షా 50 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి  చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వాటికి గతంలో రూ.70వేలు మాత్రమే మంజూరు చేశారని, వారు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడానికి మరో రూ.25వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే కొంతమందికి ఈ విషయం తెలియదని, అవగాహనా సదస్సుల ద్వారా వారికి తెలియని విషయాలు తెలియజెప్పి ఇళ్లు త్వరగా నిర్మించుకునేవిధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మండల స్థాయిలో ఏఈలకు లక్ష్యాలు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రధాన కార్యాలయంలో పని చేసేవారిని ప్రత్యేక అధికారులుగా నియమించి, ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడానికి  వారిని కూడా బాధ్యలను చేసినట్లు  తెలిపారు.
        పేదలు కూడా సౌకర్యవంతంగా ఉండే శాశ్వితమైన ఇళ్లు నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూ.95 వేల సబ్బిడీతోపాటు ఉపాధి హామీ పథకం కింద రూ.55వేలు అందజేస్తున్నట్లు వివరించారు. తమకు గ్రామస్థాయిలో తగినంత సిబ్బంది లేనందున రూ.55వేలకు సంబంధించి 90 రోజుల పనిదినాల మస్టర్ బాధ్యతలను గతంలో మాదిరిగానే పంచాయతీరాజ్ సిబ్బందికి అప్పగించినట్లు చెప్పారు. ఈ నెల 1 నుంచి ఈ కార్యక్రమాలను ఉపాధి హామీ సిబ్బందే చూసుకుంటారన్నారు.
      రాష్ట్రంలో పేదలకు ఏప్రిల్ నెలలో 16,061 ఇళ్లు, మేలో 14,014, జూన్ లో 15,692, జూలైలో 18,305, ఆగస్ట్ లో 24,061, సెప్టెంబర్ లో 26,060, అక్టోబర్ లో 28,593 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను ఇంకా పెంచినట్లు చెప్పారు. 2014 కంటే ముందు మంజూరు చేసిన వాటిలో 10,426 ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. నిర్మాణం వేగంగా జరిగేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, జన్మభూమి కమిటీ సభ్యులను అందరినీ భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరుకు ప్రయత్నం
2020 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి గ్రామీణ యోజన (పీఎంఏవై) పథకం కింద మరిన్ని ఇళ్లు మంజూరు చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాము త్వరలో ఈ విషయమై ఢిల్లీ వెళ్ల కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు.  ప్రజా సాధికార సర్వే అనేది అత్యుత్తమమైనదని, ఆ సర్వే ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 31 లక్షల మంది ఇళ్లు కావాలని కోరినట్లు వివరించారు. వారిలో 20.99 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, వారికి ఇళ్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. కేంద్రానికి చెందిన ఆవాస్ వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్లతో సహా వారి పేర్లు  అప్ డేట్ చేసినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...