Nov 26, 2017

సర్వోత్కృష్ఠమైన భారత రాజ్యాంగం

                                      

 నేడు రాజ్యాంగ దినోత్సవం

       ఈ రోజు సర్వోత్కృష్ఠమైన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు.
1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది. యావత్‌ భారత ప్రజలు రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకోవడానికి రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్‌ 26న   రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని 2015లో  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  రాజ్యాంగాన్ని ఆమోదించి 68 ఏళ్లు పూర్తి అయింది. 150 ఏళ్లకు పైగా భారత దేశం బ్రిటీష్ వారి పాలనలో ఉంది. ఆ నాడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేని దయనీయమైన స్థితిలో భారతీయులు ఉన్నారు. పరాయి పాలనను అంతమొందించాలన్నదే ఆ నాటి భారతీయుల అందరి లక్ష్యం. అందరి లక్ష్యం బ్రిటీష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించుకోవాలన్నదే అయినప్పటికి వేరువేరు పోరాట మార్గాలను ఎన్నుకున్నారు. చివరకు లక్షల మంది త్యాగధనుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది.  స్వరాజ్యం సాధించింది 1947లో అయినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్ల పాటు ఆగవలసి వచ్చింది. అప్పటి వరకు కింగ్‌ జార్జిఫైవ్‌ సారథ్యంలో ప్రభుత్వం కొనసాగింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి  దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులు 284 మందితో రాజ్యాంగ నిర్మాణ సభ లేక రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు. అందులో 15 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరంతా  పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు,  భారత్ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది. ప్రజాస్వామ్య యుగంలో రాజ్యాంగానికి విశిష్టస్థానం ఉంది. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులతోపాటు వారికి రక్షణ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని జాతులు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకుగురైన వర్గాలు, అనేక మతాలు,  భాషలు, విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉన్నాయి. వీటికి తోడు ఇక్కడ వేల కులాలు, లింగ వివక్ష, అంటరానితనం వంటి వికృత అంశాలు ఉన్నాయి. అందువల్ల భారత రాజ్యాంగ రచన సంక్లిష్టతతో కూడుకున్నది.
         రాజ్యాంగం అంటే  కేవలం ప్రభుత్వ వ్యవస్థ, దాని విధివిధానాలు, శాసన సభల రూపకల్పనే కాదు కోట్లాది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింభించేదిగా ఉండాలన్నది ప్రధాన లక్ష్యం. వీటన్నిటితోపాటు భవిష్యత్ ని  దృష్టిలోపెట్టుకొని భావితరాలకు కూడా సమన్యాయం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్  మూడేళ్ల కాలం అవిశ్రాంతంగా శ్రమించారు..  ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకుంది.
రాజ్యాంగం ప్రవేశికలోనే పౌరులకు సంబంధించిన ప్రాథమిక హక్కులు, సమన్యాయం, సమానాత్వం, సౌభ్రాత్రుత్వం వంటివాటితోపాటు  సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు.  అక్కడే దీని విశిష్టత అర్ధమవుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలతో కూడినదని  అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది న్యాయనిపుణుల మన్ననలు పొందింది. రాజ్యాంగం దేశ ప్రజలకు అనేక హక్కులు కల్పించింది. ప్రజలు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే స్వేచ్ఛను ప్రసాదించింది.
          తన సారధ్యం రూపొందించిన రాజ్యాంగ తుది ప్రతిని 1949 నవంబర్ 25న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ  ఆమోదించిన రాజ్యాంగంపై 284 మంది సభ్యులు 1950 జనవరి 24న సంతకాలు చేశారు. 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆ రోజునే మూడు సింహాలను జాతీయ చిహ్నంగా ఆమోదించారు. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయింది. అయితే అదే సభ 1952లో  మొదటి సాధారణ ఎన్నికలలు జరిగి కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు  తాత్కాలిక పార్లమెంట్ గా కొనసాగింది. ఆ రోజుల్లో రాజ్యంగం తయారు చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అయింది. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగమంగా దీనికి గుర్తింపు లభించింది. దీని ప్రతులు అందమైన చేతిరాతతో హిందీ, ఇంగ్లీషులో ఉంటాయి. 5 అనుబంధాలు, 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్ తో దీనిని రూపొందించారు. తప్పనిసరిగా అందులో పేర్కొన్న ప్రకారమే మన దేశంలో పాలన జరగాలి. ప్రతి ఒక్కరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ద్వారానే అధికారం స్వీకరిస్తారు. రాజ్యాంగం పేరిట విధులు నిర్వహిస్తారు. ఆ విధంగా రాజ్యాంగానికి  ఎంతటి ఔన్నత్యం ఉందో మనం అర్ధం చేసుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం దేశానికి రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి, రాష్ట్రాల్లో రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్‌లు ఉంటారు. దేశాన్ని పరిపాలించడానికి కేంద్రంలో ప్రధాన మంత్రి, మంత్రి మండలి, రాష్ట్రాల్లో  ముఖ్యమంత్రులు, మంత్రి మండళ్లు ఉంటాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా పరిధిలు కూడా నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. భారత దేశం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగానికి లోబడి సవరణ చేసుకొనే అవకాశం కూడా కల్పించారు. ఇప్పటి వరకు 101 రాజ్యాంగ సవరణలు చేశారు. ప్రస్తుతం దేశమంతటా చర్చనీయాంశమైన జీఎస్ టీ చట్టమే చివరి రాజ్యాంగ సవరణ.

భారత రాజ్యాంగం విశిష్టతలు

·       భారత రాజ్యంగ రూపకల్పనకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రధాన వ్యక్తి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్.
·       రాజ్యాంగ నిర్మాణ సభలో 284 మంది సభ్యులున్నారు. వారిలో  15 మంది మహిళలు.
·       దీని రచనకు రాజ్యాంగ సభకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది.
·       దీనిని రూపొందించడానికి ఆ రోజుల్లో కోటి రూపాయలు వ్యయం అయింది.
·         రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయడానికి పట్టింది.
·         దీనిని టైపు చేయలేదు. ప్రింట్ చేయలేదు. హిందీ, ఇంగ్లీషు భాషలలో రాత ప్రతి ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం.
·        దీనిని పార్లమెంట్ లైబ్రరీలో ప్రత్యేకంగా భద్రపరిచారు.
·        1949 నవంబర్ 26న రాజ్యాంగ నిర్మాణ సభలో దీనిని ఆమోదించారు. 1950 జనవరి 24న మొత్తం 284 మంది సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు చేశారు.
·        1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
·       ఇందులో 5 అనుబంధాలు, 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్ ఉన్నాయి.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...