Nov 3, 2017

15 నుంచి విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు


వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

Ø సన్న,చిన్నకారు రైతుల ప్రయోజనాలపై చర్చ
Ø అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలకు ఆహ్వానాలు
Ø 15 వందల మంది ప్రతినిధులు హాజరు
Ø ముగింపు సభలో సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ పాల్గొంటారు
Ø సదస్సు నిర్వహణకు కమిటీల నియామకం
Ø రాష్ట్రంలో రూ.160 కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్
Ø ఏపీ సాయిల్ ఇన్ఫర్మేషన్ సెంటర్  ఏర్పాటు

        సచివాలయం, నవంబర్ 2: విశాఖపట్నంలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక సదస్సు-2017ని నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని చిన్న,సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం నిర్వహించే ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణయ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొంటారని తెలిపారు. సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నిర్వహించే ఈ సదస్సుకు దాల్ బర్గ్ సలహాదారుగా ఉన్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, సంబంధిత కార్యదర్శులు, వ్యవసాయశాఖ సంచాలకులను, దేశంలోని వ్యవసాయ, దాని అనుబంధ విశ్వవిద్యాలయాల కులపతులను, విద్యార్థలును, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రా శాస్త్రవేత్తలను, పరిశోధకులను, రాష్ట్రంలోని 13 జిల్లాలల్లోని అభ్యుదయ రైతులు, స్వచ్ఛంద సంస్థలను, వ్యవసాయశాఖ, దాని అనుబంధ శాఖల ఉన్నతాధికారులను, అయోవా విశ్వవిద్యాలయం, నెదర్లాండ్ విశ్వవిద్యాలయంల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. వ్యవసాయ రంగంతోపాటు దాని అనుబంధ రంగాలైన ఉద్యానవన, రొయ్యలు, చేపల ఉత్పత్తి, పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగంలో సాంకేతిక, సృజనాత్మకత, భూసార పరీక్షలు, వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక పరికరాలు, నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్, పరపతి తదితర అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధికి, డిజిటల్ మ్యాపింగ్, ఉపగ్రహాల ద్వారా భూసార పరిక్షలు, వాతావరణం ప్రాతిపదికగా ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెంచేందుకు చిన్న, సన్నకారు రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు కావలసిన సహకారం  బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ఆఫ్రికాలోని నూతన టెక్నాలజీతో ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఇది లాభాపేక్షలేని సంస్థ అని తెలిపారు. ఈ ఫౌండేషన్ మన దేశంలో బీహార్, ఒరిస్సా రాష్ట్రాలతో కూడా ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో అయోవా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అమెరికాలో వెయ్యి ఎకరాలను ఒకే కుటుంబం సాగుచేస్తుందని, వారు వాడే యంత్రాల ఖరీదు రూ.22 కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలిపారు. అక్కడ పొలాల్లో ఒకరిద్దరే పని చేస్తుంటారన్నారు. ఆ రకమైన వ్యవసాయం ఇక్కడ సాద్యం కాదని, ఇక్కడ అన్ని చిన్న కమతాలే ఉంటాయని చెప్పారు. మనకు అనుకూతమైన యంత్రాలు కావాలన్నారు. మన రాష్ట్రంలో రూ.160 కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు చెప్పారు.  ఈ నెల 17న జరిగే సదస్సు ముగింపు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సు అంశం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిందని,  బిల్ గేట్స్ కూడా వస్తున్నట్లు తెలియడంతో అనేక మంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, తమకు కూడా ఆహ్వానాలు పంపమని కోరుతూ పలువురు మెస్సేజ్ లు పంపినట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, గతంలో ఐటీ,ఐటీ.. అన్న ఆయన ఇప్పుడు ఏటీ (అగ్రిటెక్నాలజీ), ఏటీ ... అంటున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయరంగం బాగుందని, వర్షాలు కురిశాయని, నదులు నిండాయని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.

       వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖలో జనవరిలో జరిగిన పార్టనర్ షిప్ సబ్ మిట్ జరిగిన స్థాయిలోనే వ్యవసాయ సాంకేతిక సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఏడాది అర్థ సంవత్సరం గణాంకాల ప్రకారం జీవీఏ (రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి విలువ)లో ప్రాధమిక వ్యవసాయరంగంలో 16 శాతం వృద్ధి రేటు కనిపిస్తోందన్నారు. ఈ సదస్సులో ప్రధానంగా చిన్న,సన్నకారు రైతులకు ఉపయోగపడే అంశాలనే ఎక్కువ చర్చించడం జరుగుతుందన్నారు. 15 వందల మంది ప్రతినిధులు పాల్గొనడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  మూడు రోజుల పాటు వ్యవసాయ సాంకేతిక అంశాలకు సంబంధించిన పోటీ, గ్రామీణ సలహాల సేవలు, మార్కెటింగ్, క్రెడిట్, డేటా సేకరణ, దాని పూర్తి స్థాయి వినియోగం వంటి అంశాలను చర్చిస్తారని వివరించారు. బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా వంటి దేశంలో పరిశోధనలు చేసి ఫలితాలు సాధించిందని చెప్పారు. పంటలకు నేల లక్షణాలు ముఖ్యమని, ఆఫ్రికా సాయిల్ ఇన్ఫర్మేషన్ సెంటర్  నెలకొల్పి, అక్కడ వివిధ ప్రాంతాల్లో మట్టిని సేకరించి, పరీక్షించి భూసారాన్ని మెరుగుపరిచారని వివరించారు  మన రాష్ట్రంలో కూడా ఏపీ సాయిల్ ఇన్ఫర్మేషన్ సెంటర్  ని నెలకొల్పి శాటిలైట్లు, డ్రోన్ ల ద్వారా భూసారాన్ని పరీక్షించి, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు, లేని ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి తగిన సహాయం, సహకారాలు అందిస్తారని తెలిపారు. వ్యవసాయ రంగానికి వెంటనే ఉపయోగపడే అంశాలకు సంబంధించి పోటీ జరుగుతుందని, ఆ పోటీకి ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 75 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఏపీ నుంచి 30, విదేశాల నుంచి 20, మిగిలినవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయని వివరించారు. ఈ దరఖాస్తులను జ్యూరీ పరిశీలించి వాటిలో ఉత్తమమైన పదింటిని ఎంపిక చేస్తుందని, వారు సదస్సులో తమ ప్రాజెక్టులను ప్రదర్శించిన తరువాత ముగ్గురిని ఎంపిక చేసి వారికి అవార్డులు అందజేసి సన్మానాలు చేస్తారని చెప్పారు. సదస్సు జరిగే 3 రోజులు 50 నుంచి 60 స్టాళ్లతో ఎగ్జిబిషన్ నిర్వహించడం దీని ప్రత్యేకతగా పేర్కొన్నారు. సదస్సుని విజయవంతంగా నిర్వహించడానికి స్టీరింగ్ కమిటీ, వర్కింగ్, ప్రొటోకాల్, ఆహ్వనం, వసతి, రవాణ, పిచ్ కాంపిటీషన్, కంటెంట్, సెక్యూరిటీ, నగర సౌందర్య, సాంస్కృతిక, ప్రసారమాద్యమాల, ప్రదర్శన తదితర కమిటీలను నియమించినట్లు రాజశేఖర్ వివరించారు.  వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ కూడ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...