Nov 9, 2017

మార్చి 15 నుంచి 29 వరకు పదవ తరగతి పరీక్షలు


మంత్రి గంటా శ్రీనివాసరావు
  
        సచివాలయం, నవంబర్ 9: ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ  మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ లో మంత్రి గురువారం ఉదయం ఎస్ఎస్ సీ పరీక్షల టైంటేబుల్ విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు జరుగుతాయని, కంపోజిట్ కోర్సులకు మరో అర్ధగంట అదనంగా ఉంటుందని 12.45 వరకు జరుగుతాయని తెలిపారు.  2016లో 6,17,030 మంది విద్యార్థులు, 2017లో 6,09,502 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని, 2018లో 6,36,831 మంది హాజరుకానున్నట్లు వివరించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 18 వరకు స్పాట్ వాల్యూషన్ జరుగుతుందని, మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిచాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

         పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కింద కూర్చొని పరీక్షలు రాయవలసి అవసరంలేదని, 100 శాతం ఫర్నీచర్ సమకూరుస్తామని, లేని చోట అద్దెకు తీసుకోమని కూడా సంబంధిత అధికారులకు చెప్పనట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉంచుతామని, ప్రత్యేక బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ సెంటర్లను మూసివేస్తారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడామని, మళ్లీ ఒకసారి మాట్లాడి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కూడా చివరి నిమిషంలో కంగారు కంగారుగా రాకుండా ఒక అర్థగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు.

పరీక్షల టైం టేబుల్
మార్చి 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఏ), 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 కాంపోజిట్ కోర్స్, 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II కాంపోజిట్ కోర్స్, ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 17న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్ పేపర్-1, 20న ఇంగ్లీష్ పేపర్-II, 21న మ్యాథ్స్ పేపర్-1, 22న మ్యాథ్స్ పేపర్-II, 23న జనరల్ సైన్స్ పేపర్-1, 24న జనరల్ సైన్స్ పేపర్-II, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 27న సోషల్ స్టడీస్ పేపర్-II, 28న ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్- II (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 29న ఎస్ఎస్ సి ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు జరుగుతాయని మంత్రి వివరించారు.

త్వరలో డీఈఓల నియామకం
డీఈఓల నియామకం విషయమై విలేకరులు ప్రశ్నించగా, కొంతమందిపై  ఆరోపణలు రావడంతో నియామకాలను నిలిపామని, రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ విచారణ జరిపిందని, ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి ఆ నివేదిక ఆధారంగా త్వరలో అన్ని జిల్లాలకు డీఈఓలను నియమిస్తామని మంత్రి చెప్పారు. డీఈఓలకు సంబంధించి రెండు జాబితాలు ఉన్నాయని, ఒకేసారి రెండిటినీ పూర్తి చేయాలా? లేక మొదట ఒక జాబితాలో వారిని నియమించి, తరువాత రెండవ జాబితాలో వారిని నియమించాలనా? అనే విషయమై స్పష్టతరావలసి ఉందని, పరిస్థితిని సీఎం సమీక్షించిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. డిఈఓల నియామకం జరిగిన తరువాత తాను, విద్యాశాఖ ఉన్నతాధికారులు విడతల వారీగా అన్ని జిల్లాలు పర్యటిస్తామని, కాలేజీలను, పాఠశాలలను తనిఖీ చేస్తామని చెప్పారు.

ఇంటర్ వరకు తెలుగు అమలు చేస్తాం
గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు భాషను అమలు చేస్తామని చెప్పారు. కేంద్రీయ విద్యాలయాల విషయంలో అమలుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, సీఎం సమక్షంలో వాటిని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సీఎం సలహా తీసుకొని డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు.
విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు గట్టి చర్యలు
విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు గట్టిచర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. దీనిపై దృష్టి పెట్టామని, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, ఒక కమిటీని కూడా నియమించామని ఆ కమిటీ 730 కాలేజీలు తనిఖీ చేశారని చెప్పారు. కాలేజీ సమయాలు, క్రీడల సమయం, సైకాలజిస్ట్ ల నియామకం వంటి అంశాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అనుమతిలేకుండా 158 హాస్టళ్లు ఏర్పటు చేశారని, అయితే విద్యార్థుల విద్యా సంవత్సరానికి ఇబ్బందిలేకుండా ఈ ఏడాది వరకు వాటిని అనుమతిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్ లో తెలుగు విద్యార్థులుపై జరిగిన దాడుల అంశం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, వారు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో బీఈడి కాలేజీల విషయం సమీక్షిస్తామన్నారు.

విశ్వవిద్యాలయాలకు రూ.381 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టిందని, 7 విశ్వవిద్యాలయాలకు రూ.381 కోట్లు కేటాయించామని, 15, 20 ఏళ్లుగా ఉన్న ఖాళీల భర్తీకి అనుమతించామని, ఏపీపీఎస్సీకి అప్పగించామని, త్వరలో పూర్తి చేస్తారని మంత్రి చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణంలో ఉందని తెలిపారు. మన రాష్ట్రం నుంచి విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్య అందించాన్న ఉద్దేశంతో ఆ స్థాయి విశ్వవిద్యాలయాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వారికి మనం తక్కువ ధరకు భూములు మాత్రమే ఇస్తున్నామన్నారు.
గత నెలలో జరిపిన అమెరికా  పర్యటనలో తెలుగు విద్యార్థులకు ప్రయోజనకరమైన పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. అక్కడి ఒహాయో  విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందం వల్ల తెలుగు విద్యార్థులకు ఏడాదికి రూ.400 కోట్ల వరకు ఆదా అవుతుందని వివరించారు.  రాష్ట్రంలో వెయ్యి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. రైట్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయంతో కూడా ఒప్పందం ఖరారైనట్లు  ఆయన తెలిపారు. ఆ యూనివర్సిటీ వారు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటిస్తారని, భోగాపురంలో గాని, అమరావతిలో గాని వారు కేంపస్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...