Nov 4, 2017

పటిష్టమైన ఆధార్ వ్యవస్థ


మొరోకో బృందానికి వివరించిన యుఐడిఏఐ చైర్మన్ జె.సత్యనారాయణ
Ø 118.69 కోట్ల ఆధార్ కార్డులు జారీ
Ø 1247.07 కోట్ల ప్రామాణిక లావాదేవీలు

      సచివాలయం, నవంబర్ 3: దేశంలో ఆధార్ కార్డుల సమాచార సేకరణ, డేటా వ్యవస్థను పటిష్టమైన భద్రతతో రూపొందించినట్లు యుఐడిఏఐ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు జె.సత్యనారాయణ చెప్పారు. మన దేశంలోని ఆధార్ వ్యవస్థ, అనుసందానం గురించి తెలుసుకోవడానికి  మొరోకో మంత్రి నూరుద్దీన్ బుతాయబ్ నాయకత్వంలో ఒక బృందం శుక్రవారం అమరావతికి వచ్చింది. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం మొరోకో బృందానికి సత్యనారాయణ ఆధార్ కార్డులు రూపొందించే విధానం, వాటి ఉపయోగం గురించి రియల్ టైమ్ డేటా చూపుతూ  వివరించారు. నెట్ వర్క్, ఇంటర్నెట్ పరంగా వ్యవస్థకు నష్టం కలుగకుండా, గోప్యత పరంగా గట్టి భద్రతతో దీనిని రూపొందించినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రతి పౌరుడికి ఇది ఒక డిజిటల్ గుర్తింపుగా ఉంటుందన్నారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లో ఉంటుందని, 8 ప్రాంతీయ కార్యాలయాలు, రెండు పెద్ద డేటా సెంటర్లు ఉన్నట్లు తెలిపారు.
దేశంలో ఇప్పటి వరకు 118,69,34,754 ఆధార్ కార్డులను జారీ చేయగా, 14,87,64,063 సార్లు అప్ డేట్ చేసుకున్నట్లు,  మొత్తం 1242,37,36,586 ప్రామాణిక  లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఆధార్ వివరాలు నమోదుకు సంబంధించి 211 రిజిస్ట్రార్లు, 754 నమోదు ఏజన్సీలు, 6,74,335 మంది ధృవీకరించిన ఆపరేటర్లు, సూపర్ వైజర్లు, 48,434 నమోదు కేంద్రాలు ఉన్నట్లు వివరించారు. బయోమెట్రిక్ విధానంలో పది వేళ్లు, రెండు కళ్ల ఐరిస్ నమోదు చేస్తారని, ఒక్కో వేలుకు సంబంధించి 20 గుర్తులు ఉంటాయని తెలిపారు. ఆధార్ వినియోగానికి సంబంధించి 2016లో ఒక చట్టం చేశారని, అందులో అన్ని వివరాలు స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. ఆధార్ నెంబర్ ఆధారంగానే రేషన్, పెన్షన్, ప్రభుత్వ సబ్సిడీలు, గ్రామీణ ఉపాధి హామీ పథకంస్కాలర్ షిప్స్ వంటి వాటికి అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే భూముల రిజిస్ట్రేషన్ వంటి వాటికి కూడా ఈ నెంబర్ ని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఆధార్ వల్ల పాదర్శకతతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఇప్పటివరకు 8 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆదా అయినట్లు తెలిపారు.  ఆధార్ కు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి వివిధ భాషల్లో 24 గంటలూ పని చేసే సిబ్బంది ఉంటారని చెప్పారు. దేశంలో ఇ-ప్రగతి గురించి కూడా వివరించారు. దేశంలో జరిగే లావాదేవీలన్నీ నమోదవుతాయని తెలిపారు. రాష్ట్రంలో సీఎం డ్యాష్ బోర్డు ద్వారా 170 కార్యక్రమాలకు సంబంధించిన రియల్ టైం  వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఫార్మా హబ్, విద్యా హబ్, ఏపీ ఫైబర్ నెట్ తదితర అంశాలు కూడా వివరించారు.

అవినీతికి తావులేకుండా లబ్దిదారునికి ప్రయోజనం
           ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారునికి ప్రయోజనం చేకూరడానికి, ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు సమయండబ్బు ఆదా అవుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ వివరించారు. కోటి 40 లక్షల కుటుంబాలకు 28,942 చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై పలు రకాల ఆహార ధాన్యాలు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో సరఫరా చేసిన సరుకులకు సరైన జవాబుదారి ఉండేది కాదని, ఇప్పుడు 86 శాతం సరుకులు, 50 శాతం కిరోసిన మాత్రమే పంపిణీ జరుగుతున్నట్లు నమోదవుతుందని వివరించారు. ఆచరణలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.  నగదు రహిత లావాదేవీలు కూడా జరుపుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు పొలం నుంచి వినియోగదారునికి చేరేవరకు అన్ని దశల గురించి సవివరంగా తెలిపారు. రైతులు వద్ద కొనుగోలు చేసినవాటికి 7 రోజుల్లో ఆన్ లైన్ లో చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నెల నుంచి రెండు నెలల సమయం పట్టేదని చెప్పారు. పౌరసరఫరాల శాఖ వాహనాలు బయలుదేరినప్పటి నుంచి  డిపోకు చేరేవరకు ఎక్కడ ఉందో ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చన్నారు.

ప్రజలే ముందు 1100లో 2వేల మంది సిబ్బంది
            రియల్ టైమ్ గవర్నెస్(ఆర్టీజీ)కి చెందిన బాలాజీ ప్రజలే ముందు(పీపుల్స్ ఫస్ట్) 1100 గురించి వివరించారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటిని పరిష్కరించి, వారి సంతోష స్థాయిని పెంచేందుకు ఈ ఏడాది మే 251100 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కాల్ సెంటర్లో  రెండు వేల మంది సిబ్బంది 360 రోజులు 24 గంటలూ  పని చేస్తుంటారని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు, వివిధ కార్యక్రమాల పట్ల వారి సంతృప్తి తెలుసుకుంటూ ఉంటారని తెలిపారు.  రోజుకు పది వేల కాల్స్ వస్తుంటాయన్నారు. పెన్షన్ దారులు 77 శాతం సంతృప్తిగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. మొరాకో బృందం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పారు. అనేక అనుమానాలను వ్యక్తం చేసి నివృత్తి చేసుకున్నారు.

రూ.1500 కోట్లు తగ్గిన ఖర్చు : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
        తొలుత పౌరసరఫరాల శాఖ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆధార్ ను రూ.169 కోట్ల వ్యయంతో అనుసందానం చేసి రూ.1500 కోట్లు ఖర్చు తగ్గించినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు తగ్గాయని, నిజమైన లబ్దిదారునికి సరుకులు అందుతున్నట్లు తెలిపారు. 1100 కాల్ సెంటర్ ద్వారా ప్రజా సమస్యలు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న మొదటి రాష్ట్రం ఏపీ అని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, -ప్రగతి సీఈఓ ఎస్.బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...