Nov 19, 2017

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ప్రభుత్వం దృష్టి


§  2015 నుంచి 245 అవగాహన ఒప్పందాలు
§  రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు అగ్రశ్రేణి కంపెనీల ఆసక్తి
§  రైతుకుల గిట్టు బాటు ధరలకు, ఉపాధికి అవకాశాలు
§  13 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు
§  9 జిల్లాల్లో సముద్ర ఉత్పత్తులు

         ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌(ఆహార తయారీ ప్రక్రియ) రంగం అభివృద్ధికి విస్తృత స్థాయిలో అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం వ్యవసాయాధారిత ప్రాంతమేకాక, 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉండటంతో భారీ స్థాయిలో సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు రెండూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అనుకూలమైనవిటమోటా వంటి వ్యవసాయ, మామిడి, బొప్పాయి, జామ వంటి ఉద్యాన పంటలకు ఒక్కోసారి సరైన ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, 9 జిల్లాల్లో సముద్ర ఉత్పత్తులు భారీ స్థాయిలో ఉన్నందున ఫుడ్ ప్రాసెసింగ్ రంగం తప్పనిసరిగా విస్తరించవలసిన అవసరం ఉంది. భారీ స్థాయి అవకాశాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి సారించింది. ఈ రంగం విస్తరిస్తే ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నేపద్యంలో ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక రాయితీలు ఇవ్వడానికి  ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడుతూ ‘‘ఇరవై ఏళ్ల క్రితం ఐటీ మీద దృ‌ష్టి పెట్టాను. దాని ఫలితాలు ఇప్పుడు అందరం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ రంగంలో ఏపీని నెంబర్‌ వన్‌గా చేయడమే నా లక్ష్యం’’ అని చెప్పారు. రైతులు పంటలు పండించినా సరైన మార్కెటింగ్‌ లేని విషయాన్ని ప్రభుత్వం గుర్తించి మెగా ఫుడ్‌ పార్క్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రారంభించే వారిని ప్రోత్సహించాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పరిశోధనలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందిఈ రంగంలో 2015 నుండి సెప్టెంబర్ 2017 వరకు 245 అవగాహన ఒప్పందాలు జరిగాయి. వాటి  ద్వారా రూ. 1600 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  25 వేల మందికి ఉపాధి లభించింది.

             రాష్ట్రంలో టమోటా రైతులు దశాబ్దాలుగా అనేక కష్టాలు పడుతున్నారు. టమోటా ఒక్కో సమయంలో కిలో రూపాయి అమ్మితే, మరో సారి రూ.60లకు పలుకుతుంది. కోల్డ స్టోరేజ్ యూనిట్లు లేక పండిన పంటలను పారవేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తగిన స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లేనందునే పంటలు వచ్చిన సమయంలో ధరలు పూర్తిగా పడిపోతాయిప్రధానంగా  చిత్తూరు, రాయలసీమ జిల్లాల్లో టమోటా రైతులు ఇటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. అతి ఎక్కవగా టమోటా పండించే మదనపల్లి ప్రాంతంలోనే కాక, యావత్ రాయలసీమలో టమోటాలను కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి జపనీస్ కంపెనీ కాగోమ్ ఆసక్తి ప్రదర్శించింది. శుద్ధిచేసిన టమోటా ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో ఇది ప్రపంచ దిగ్గజ కంపెనీగా ప్రసిద్ధి చెందింది. మామిడి, శుద్ధిచేసిన రొయ్యల ఎగుమతిపై కూడా ఈ కంపెనీ  ఆసక్తి చూపుతోంది. ఈ కంపెనీ రంగంలోకి దిగితే రాయలసీమ ప్రాంతంలోని టమోటా రైతులతోపాటు ఉద్యానవన పంటలు పండించే  రైతులకు కూడా గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉంది.   ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేస్తే రైతుల ఆదాయంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా  గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప, చిత్తూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడానికి అనువైనవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు ఇవి ఉపయోగపడతాయి. సముద్ర ఉత్పత్తులను కూడా రెడీ టు ఈట్తరహాలో ప్యాకింగ్ చేసి దేశ విదేశాల్లో మంచి మార్కెటింగ్ కు అవకాశం ఉంటుంది.   కర్నూలు జిల్లాలో 700 ఎకరాల్లో అల్ట్రా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్ పార్క్‌ ఏర్పాటవుతోంది. ఇప్పటికే అక్కడ జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ అల్ట్రా మెగా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేసింది. గుజరాత్‌ అంబుజా రూ.240 కోట్లతో మొక్కజొన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్మించనుంది. ఈ జిల్లాలో ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ వారు  మిస్సైల్ రీసెర్చ్ ల్యాబ్ ని, అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.
      
        ఇటీవల ఢిల్లీలో జరుగిన  వరల్డ్ ఫుడ్ ఇండియాఎగ్జిబిషన్‌లో జపాన్ వ్యవసాయం, అడవులు, మత్స్యశాఖల డిప్యూటి అసిస్టెంట్ మినిస్టర్  ఇకిఫేషి  నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందంతో  రాష్ట్ర ఆహార శుద్ధి పరిశ్రమల కార్యదర్శి గిరిజా శంకర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కాగోమ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తో కలసి పనిచేస్తుందని జపాన్ మంత్రి స్పష్టం చేశారు. ఫుడ్ వేల్యూ చెయిన్ ఏర్పాటుకు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో  రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఓసీ (మెమోరాండం ఆఫ్ కో ఆపరేషన్) కుదుర్చుకోనుందితాజా మామిడి పండ్లు, శుద్ధిచేసిన రొయ్యలను కాగోమ్ కొనుగోలు చేసి ఎగుమతులు చేస్తుంది. జపాన్ లో  1889లో ప్రారంభమైన కాగోమ్ కంపెనీకి  50 దేశాల్లో  శాఖలున్నాయి. టొమేటో ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల  రసాలు, మసాలాల విక్రయంతో   2 బిలియన్ డాలర్ల వార్షికాదాయన్ని  ఆర్జిస్తోందిటమోటా, కూరగాయలు, పండ్ల రసాలు అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ సహా పలు దేశాల్లో కాగోమ్ విక్రయిస్తోంది. అచ్చంగా టమోటా పంట ఉత్పత్తుల కొనుగోలు, శుద్ధి, మార్కెటింగ్ లో ప్రపంచ దిగ్గజంగా కాగోమ్ పేరుపొందిందిరాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలలో పెట్టుబడుల ఆకర్షణకు జపాన్‌లో రోడ్ షోలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎగ్జిబిషన్ కు హాజరైన స్పెయిన్  ప్రతినిధి బృందం ఆహార శుద్ధి పరిశ్రమల రంగంలో  భారత్ తో కలసి పనిచేయడానికి కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ బృందం గిరిజాశంకర్ తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో ఆహారశుద్ధి రంగం అభివృద్ధికి సహకారం అందించడానికి ఆసక్తి చూపింది.  
         
       విశాఖలో జరుగుతున్న ఏపీ అగ్రిటెక్‌ సదస్సులో కూడా అగ్రశ్రేణి కంపెనీలు ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.  ఆహార శుద్ధి, మార్కెటింగ్‌లో ప్రసిద్ధిగాంచిన క్రిషి స్టార్‌ కంపెనీ  పెట్టుబడులు పెట్టడానికి  ఆసక్తి చూపింది.
అగ్రస్థానంలో ఉన్న కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ఆహార శుద్ధి, ఉద్యాన ఉత్పత్తులకు, అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...