Oct 31, 2017

మొదటి త్రైమాసికంలో లక్ష్యాలను మించి వ్యవసాయం రంగంలో 27.60 శాతం వృద్ధి


ప్రణాళిక శాఖ అధికారులతో ఆర్థిక మంత్రి యనమల సమీక్ష
Ø వృద్ధి రేటు 11.72 శాతం నమోదు
Ø జాతీయ స్థాయి వృద్ధి రేటు 5.6 శాతం
Ø 1,2 త్రైమాసికాల ఫలితాల సమీక్ష
Ø వెనుకబడిన 7 జిల్లాల్లో కేంద్ర నిధులు రూ.787 కోట్లు ఖర్చు
Ø ఎంపీల నిధులు రూ.333 కోట్లు వ్యయం
Ø ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువ

         సచివాలయం, అక్టోబర్ 31: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో లక్ష్యాలను మించి 27.60 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం 2 బ్లాక్ లోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం మంత్రి ప్లానింగ్ శాఖ అధికారులతో మొదటి, రెండవ త్రైమాసిక ఫలితాలను  సమీక్షించారు.  అన్ని రంగాల్లో కలుపుకొని జీవీఏ (రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి విలువ) గత సంవత్సరంతో పోల్చితే  11.72 శాతం వృద్ధి రేటు సాధించినట్లు మంత్రి తెలిపారు. 2016-17 మొదటి త్రైమాసికంలో జీవీఏ రూ. రూ.1,07,099 కోట్లతో వృద్ధి రేటు 12.26 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,480 కోట్ల జీవిఏతో 16.23 సాధించాలన్నది లక్ష్యంగా నిర్ణయించినట్లు వివరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీవీఏ రూ.18,319 కోట్లతో 22.96 శాతం వృద్ధి రేటు సాధించగా, ఈ ఏడాది రూ.23,120 కోట్లతో 26.21 శాతం సాధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పారిశ్రామిక రంగంలో 8.05 శాతం, సేవల రంగంలో 8.67 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో మొదటి త్రైమాసికంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో 2.3 శాతం, పరిశ్రమల రంగంలో 1.6 శాతం, సేవల రంగంలో 8.7 శాతంతో మొత్తం 5.6 శాతం మాత్రమే వృద్ధి రేటు సాధించినట్లు మంత్రి వివరించారు. రెండవ త్రైమాసికం లక్ష్యాలను, సాధించిన ప్రగతిని ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం  సమీక్షించారు. వ్యవసాయం రంగంలో రాష్ట్రంలో సాగు చేస్తున్న భూమి, పంటల వారీగా సాగు, కొత్తగా సాగులోకి వచ్చిన భూమి, పంటల మార్పిడి, వ్యవసాయ ఉత్పత్తుల వివరాలు  పూర్తిగా సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగంలో ఉద్యానవన పంటలను, మత్స్య పరిశ్రమ ఉత్పత్తులను సమీక్షించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి కూడా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితరాల వివరాలు కూడా సేకరించాలని చెప్పారు.
      ఇతర రాష్ట్రాలతో పోల్చితే సేవల రంగంలో వృద్ధి రేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో పట్టణీకరణ తక్కువగా ఉన్నందున ఈ రంగంలో వృద్ధి రేటు తక్కువగా ఉందని, పట్టణీకరణ పెరిగితే పరిశ్రమలు, సేవల రంగం వృద్ధి రేటుతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్న అంశాలను చర్చించారు. పారిశ్రామిక రంగం, పవర్ సెక్టార్, సోలార్ విద్యుత్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు శాఖ, పవర్, మైనింగ్ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయమని మంత్రి ఆదేశించారు.

వెనుకబడిన 7 జిల్లాల్లో కేంద్ర నిధులు రూ.787 కోట్లు ఖర్చు
         రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1574 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1050 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు మంత్రి తెలిపారు. వాటిలో రూ.787 కోట్లు ఖర్చు చేయగా, రూ.770 కోట్లకు సంబంధించి యూసీలు కూడా ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలోని 25 మంది లోక సభ సభ్యుల నిధులు రూ.300 కోట్లు మంజూరు కాగా, రూ.240 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఏడుగురు రాజ్యసభ సభ్యులకు రూ.107 కోట్లు మంజూరు కాగా, రూ.93 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 మంది ఎంపీల నిధులు రూ.333 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేక అభివృద్ధి ఫండ్ కు రూ.500 కోట్ల రూపాయలు కేటాయించగా, రూ.437 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ నిధులను శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏఏ నియోజకవర్గాల్లో ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు సేకరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కూడా సమీక్షించారు. వాటిలో 54 శాతం అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనులను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని మంత్రి యనమల ఆదేశించారు. రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ పనితీరుని, వెబ్ ల్యాండ్ ని  కూడా సమీక్షించారు. ఏపీ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ద్వారా భూమి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువ
          ద్రవ్యోల్బణంపై జరిగిన సమీక్షలో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్రలతో  పోల్చితే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ లో తెలంగాణలో 3.35 శాతం, తమిళనాడులో 5.22, కర్నాటకలో 2.81, కేరళలో 6.35, మహారాష్ట్రలో 4.32 ఉండగా, ఏపీలో 2.59 శాతం మాత్రమే నమోదైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా మండలి  ఉపాధ్యక్షులు సి.కుంటుబరావు, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓ సంజయ్ గుప్త, ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి పివీ చలపతిరావు, ఆర్థిక, గణాంక శాఖ సలహాదారు డాక్టర్ డి.దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...