Oct 3, 2017

5న ప్రభుత్వం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి


·       ప్రతి ఏడాడి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు వేడుకలు
·       జీఓ 131 విడుదల
·       ప్రాంతీయ వ్యత్యాసాల తొలగింపు చర్యలు
·       బోయలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు
·       త్వరలో వాల్మీకి కల్చరల్ ఫెస్టివల్

        సచివాలయం, అక్టోబర్ 3: ఇక నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు రామాయణ గ్రంథకర్త, మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వాల్మీకి(బోయ)ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ నెం.131) జారీ చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు  ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జయంతి నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. అఖిలాంధ్ర వాల్మీకి కులస్తుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన అభినందనలు తెలిపారు. పట్టుదల, కృషి ఉంటే మనుషులు రుషులు, మహారుషులవుతారనడానికి  వాల్మీకి జీవితం నిదర్శనం అన్నారు. నేటి యువతకు ఆయన ఆదర్శంగా పేర్కొన్నారు. బోయకులంలో పుట్టిన రత్నాకరుడే వాల్మీకిగా మారినట్లు తెలిపారు. రత్నాకరుడు దారి కాచి ఏ మాత్రం దయ, కరుణ లేకుండా బాటసారులను అవసరమైతే హత్య చేసి కూడా నిలువుదోపిడీ చేసే వాడని పురాణాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అటువంటి రత్నాకరుడు నారధ ముని హితబోధల వల్ల సుదీర్ఘ కాలం రామ నామం జపిస్తూ కఠినమైన తపస్సు చేయడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రీమూర్తులు ప్రత్యక్షమై అతనికి బ్రహ్మజ్ఞానం ప్రసాదించినట్లు పురాణాల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఆ తరువాత రత్నాకరుడు వాల్మీకిగా మారి ఏడు ఖండాలుగా, 24 వేల శ్లోకాలతో రామాయణ మహాగ్రంథాన్ని రచించినట్లు చెబుతారన్నారు. అటువంటి మహాకవి జయంతిని ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ప్రాంతీయ వ్యత్యాసాల తొలగింపు చర్యలు
వాల్మీకి(బోయ)లలో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, అందులో భాగంగానే సత్యపాల్ కమిటీని నియమించినట్లు బీటీ నాయుడు తెలిపారు.  బోయలను రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఎస్టీలుగా, మిగిలిన జిల్లాల్లో బీసీలుగా పరిగణిస్తారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నట్లు తెలిపారు. బోయలను ఎస్టీల జాబితాలో చేర్చాలని ఆయన కోరారు.  ఈ విషయమై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధ్యక్షతన ఒక కమిటీ రాష్ట్రంలో పర్యటించినట్లు తెలిపారు. సత్యపాల్ కమిటీ నివేదికను  త్వరలో మంత్రి మండలికి సమర్పిస్తుందని చెప్పారు.

బోయలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు
బోయ ఫెడరేషన్ ద్వారా బోయ కులస్తులకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తున్నట్లు బీటీ నాయుడు తెలిపారు. ఫెడరేషన్ ద్వారా రూ.25 కోట్లు, బ్యాంకుల ద్వారా మరో రూ.25 కోట్లు, మొత్తం రూ.50 కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా రూ.2 లక్షల వరకు రుణం అందజేస్తున్నట్లు చెప్పారు.  మహిళలకు ప్రత్యేకంగా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.  రాయలసీమ ఫ్యాక్షన్ గొడవల్లో ఇరు వర్గాల తరపున ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కవ మంది బోయలే ఉన్నారని చెప్పారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బోయలు ఎక్కువగా ఉన్నట్లు  చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది ఉంటే, ఈ రెండిటిలో ఒక్కో జిల్లాలో 12 లక్షల మంది ఉన్నట్లు నాయుడు తెలిపారు.

త్వరలో వాల్మీకి కల్చరల్ ఫెస్టివల్
రాష్ట్రంలో త్వరలో వాల్మీకి కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వాల్మీకి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణం చెప్పారు. ఈ నెల 5న వాల్మీకి జయంతి రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తామన్నారు. బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా బోయ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందజేస్తున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లోని వాల్మీకి సోదరులకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని నాగభూషణం అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...