Oct 23, 2017

కర్నూలు జిల్లాలో అత్యాధునిక విత్తన పరిశోధనా కేంద్రం


వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి
Ø సీఎం అయోవా పర్యటన విజయవంతం
Ø 80 దేశాలకు టెక్నాలజీ సహకారం అందిస్తున్న అయోవా విశ్వవిద్యాలయం
Ø 7 లక్షల 89వేల మంది రైతుల రుణ మాఫీ
Ø మొత్తం రూ.914.33 కోట్లు విడుదల
Ø ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటున్న రుణమాఫీ విధానం
            సచివాలయం, అక్టోబర్ 23: అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ సాంకేతిక సహకారంతో కర్నూలు జిల్లాలో అత్యాధునిక విత్తన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. 650 ఎకరాల విస్తీర్ణంలో రూ. 680 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారుఅయోవా విశ్వవిద్యాలయం సందర్శించి వచ్చిన తరువాత మంత్రి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, అయోవా విశ్వవిద్యాలయం, వ్యవసాయ ఉత్పత్తిదారుల సహకారంతో ఏర్పాటు చేసే ఈ కేంద్రానికి తొలివిడతగా రూ.150 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియాసలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులతో కలసి తన అయోవా పర్యటన విజయవంతంగా ముగిసినట్లు చెప్పారు. ఆ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక విత్తన పరిశోధనా కేంద్రం ఉన్నట్లు తెలిపారు. అక్కడ 300 రకాల విత్తనాలు, 350 రకాల వ్యాధులుపై పరిశోధన చేస్తారని తెలిపారు. ఆ విశ్వవిద్యాలయం 80 దేశాలకు టెక్నాలజీ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. తమ పర్యటనలో ఒకే రైతు మంచి విత్తనాలు, ఆధునిక యంత్రపరికరాలతో 9వేల ఎకరాలల్లో  పంటలు పండించడం చూశామన్నారు.  మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతులకు రుణ మాఫీ, అవుట్ పుట్ సబ్సిడీ, విత్తన పంపిణీ వంటి కార్యక్రమాలతోపాటు రైతులకు ఆధునిక సాంకేతిక అంశాల్లో సహకరించేందుకు ప్రభుత్వం  బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ తో  ఒప్పందం చేసుకోకున్నట్లు తెలిపారు. నవంబర్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు విశాఖలో జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నామని, ఆ  సదస్సు ముగింపు రోజు  బిల్ గేట్స్ వస్తారని చెప్పారు.
7 లక్షల 89వేల మంది రైతుల రుణ మాఫీ
         ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 లక్షల 89 వేల మంది రైతుల ఖాతాలకు రూ.761.94 కోట్ల  రుణ(అసలు)మాఫీ, పది శాతం వడ్డి కింద రూ.152.39 కోట్లు జమ చేసినట్లు వివరించారు. మొత్తం రూ.914.33కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రెండవ దఫా తీసుకోనివారికి కూడా ఈ దఫా చెల్లించినట్లు చెప్పారు. అర్హత ఉన్న చివరి రైతు వరకు రుణ మాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 9 లక్షల ఫిర్యాదులు రాగా, 5.80 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని, రూ.555కోట్లు చెల్లించామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 1670 ఫిర్యాదులు అందగా, 665 పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల రోజును ప్రకటించి పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 25న కడప జిల్లాలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, మిగిలిన జిల్లాల్లో కూడా తేదీలు ప్రకటించామని చెప్పారు. రుణమాఫీకి సంబంధించి ఇంత చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. రుణ మాఫీకి సంబంధించి మనం అనుసరించే విధానాలను తెలుసుకొని, అనుసరించడానికి  ఇతర రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయని, మహారాష్ట్ర నుంచి ఒక అధ్యయన బృందం కూడా వచ్చినట్లు మంత్రి తెలిపారు.
అవకతవకలు లేకుండా రుణ మాఫీ
          ఎటువంటి అవకతవకలు లేకుండా రాష్ట్రంలో రుణ మాఫీ జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు సి.కుటుంబ రావు తెలిపారు. 2007-08లో రుణమాఫీ చేశారని, రూ.120 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా మాఫీ చేస్తున్నట్లు చెప్పారు.  అర్హత ఉన్న పది లక్షల మంది రైతులు వచ్చి నమోదు చేసుకున్నా రుణ మాఫీ చేస్తామని చెప్పారు. మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల వారు మన విధానాలను ప్రశంసిస్తున్నారని, ఇక్కడ ఎలా అమలు చేస్తున్నారో, ఏ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటున్నారన్నారు. రుణ మాఫీ విధానంపై ప్రతిపక్షాలు బురద జల్లడం మంచిదికాదని  హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు కుటుంబరావు చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...