Oct 13, 2017

రూ.2713 కోట్లకు పెరిగిన ఎస్సీ కార్పోరేషన్ బడ్జెట్


రుణ పంపిణీపై తొలిసారిగా శ్వేత పత్రం విడుదల చేసిన చైర్మన్ జూపూడి
Ø ఎస్సీల కోసం అనేక నూతన పథకాలు
Ø ఈ ఏడాది భూమిలేని దళితులకు భూమి, రోడ్ అంబులెన్స్ లు, డ్రోన్ కెమెరాలు, ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, బ్యాటరీ ఆపరేషన్ ట్రక్కులు, జెసీబీలు, ప్రొక్లెయినర్లు
Ø 3.27 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ
Ø 140 ఇన్నొవా వాహనాలకు రుణాలు
Ø ఈ ఏడాది 200 వాహనాలకు రుణాలు
Ø పరిమితికి మించి మాదిగలకు రుణాలు
    
        సచివాలయం, అక్టోబర్ 13: ఈ ఏడాది ఏపీ ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ బడ్జెట్ రూ.2713 కోట్లకు పెరిగిందని కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల జీవన విధానంలో మార్పు కోసం, వారు ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో  పలు పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాబోయే తరాల భవిష్యత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు.   సివిల్ సప్లైస్ కార్పోరేషన్ వారి రేషన్ రవాణాకు ఉపయోగించే విధంగా 175 వాహనాలకు రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలకు వినియోగించే విధంగా రూ.1.50 లక్షల విలువైన బ్యాటరీ ఆపరేషన్ ట్రక్కులు 5 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల కొనుగోలుకు కూడా వారికి రుణాలు ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులకు వినియోగించడానికి 500 ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ఈఎంఐ పంచాయతీరాజ్ శాఖ చెల్లిస్తుందని చెప్పారు. ఈ ఆలోచనలు  పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబువిగా పేర్కొన్నారు. భూమి కొనుగోలు పథకం ద్వారా ప్రభుత్వం రూ.2వేల కోట్లతో 4వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి దళితులకు అందజేస్తుందని చెప్పారు. బాబాసాహేబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ఆత్మగౌరవ నినాదంలో భాగంగా ఈ భూమిని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు పొందే విధంగా 3.27లక్షల మంది దళిత యువతకు సాఫ్ట్ వేర్, ఆంగ్ల భాష తదితర అంశాల్లో స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో కొందరికి ఆరోగ్య కార్యకర్తలుగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అంతేకాకుండా 200 జెసీబీలు, ప్రొక్లెయినర్లు ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిపారు.

2015-16, 2016-17లో ఇచ్చిన రుణాల శ్వేత పత్రం విడుదల
         కార్పోరేషన్ ద్వారా 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో జీఓ నెంబర్ 25 ప్రకారం ఎస్సీలోని 52 కులాలవారికి  ఇచ్చిన రుణాల శ్వేత పత్రాన్ని  చైర్మన్ జూపూడి  విడుదల చేశారు. జిల్లాలు, కులాల వారీగా లబ్దిదారుల  వివరాలు అందులో పొందుపరిచారు. పరిమితికి మించి మాదిగలకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన మాదిలకు ఇవ్వవలసినదానికంటే 3651 మందికి అదనంగా, మాలలకు 665 మందికి తక్కువగా రుణాలు అందజేసినట్లు వివరించారు. రెల్లి కులస్తులకు కూడా 111 మందికి అదనంగా రుణాలు ఇచ్చామని, ఇతర కులాలలో వారు దరఖాస్తు చేసుకోకపోవడం వల్లగానీ, ఇతర కారణాల వల్ల గానీ తక్కువమందికి ఇచ్చినట్లు, అందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. అన్ని కులాల మధ్య ఐఖ్యత, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2016-17 సంవత్సరంలో 140 ఇన్నొవా వాహనాలు అందజేసినట్లు తెలిపారు. మాదిగ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాలలకు ఇవ్వమని సిఫారసు చేస్తే వారికి వాహనాలు ఇచ్చామని, ఈ విధంగా సిఫారసు చేయడం శుభపరిణామంగా ఆయన పేర్కొన్నారు. మాలలకు 69 వాహనాలు, మాదిగలకు 61 వాహనాలు ఇచ్చినట్లు తెలిపారు. మాదిగలకు అన్యాయం జరుగుతుందన్న అపోహ కొందరిలో ఉందని, అది వాస్తవం కాదన్నారు. వారికి ఇవ్వవలసినదానికంటే రుణాలు గానీ, వాహనాలు గానీ ఎక్కువే ఇచ్చినట్లు చెప్పారు. తమకు అందరూ సమానమేనని, అందరికీ న్యాయం చేయడమే బాధ్యతగా వ్యవహరించామన్నారు. ఈ ఏడాది 200 ఇన్నొవా వాహనాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. 1974 నుంచి ఇప్పటి వరకు ఈ విధంగా పూర్తి వివరాలతో శ్వేతపత్రం ఎవరూ విడుదల చేయలేదన్నారు. ఇదే మొదటిసారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు దీనిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తాము నిజాయితీగా వ్యవహరిస్తున్నట్లు జూపూడి చెప్పారు.
              మాజీ మంత్రి మారెప్ప మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఎస్సీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. దాదాసాహేబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రాజధాని అమరావతిలో 125 అడుగుల విగ్రహం నెలకొల్పనుండటం హర్షణీయం అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించి, విమర్శలు చేస్తున్న కుల సంఘాలకు బుద్ధి చెప్పాలన్నారు.
           డైరెక్టర్ ఆకెపోగు ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో వంద కోట్ల రూపాయల లోపు ఉన్న బడ్జెట్ ను సీఎం చంద్రబాబు నాయుడు రూ.2713 కోట్లకు పెంచారన్నారు. జీఓ 25 ప్రకారం అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయని, మాదిగలకు పెద్దపీట వేశారని చెప్పారుఈ జీఓ అమలును పర్యవేక్షించడానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించడానికి సీఎం అంగీకరించారిన తెలిపారు. మాదిగ సామాజిక వర్గం కోసం లిడ్ క్యాప్ ను పటిష్టం చేస్తున్నారన్నారు. మరో డైరెక్టర్ దేవానంద్ మాట్లాడుతూ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు కృషి ఫలితంగా బడ్జెట్ పెరిగిందన్నారు. వెనుకబడిన మాదిగలకు న్యాయం చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...