Oct 17, 2017

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు


Ø కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు, అధికారులతో మంత్రి గంటా చర్చలు
Ø కాలేజీల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించానని చెప్పిన మంత్రి
Ø సిలబస్ ల వత్తిడి, కాలేజీలు, హాస్టళ్ల వాతావరణపై ఆందోళన
Ø 18 గంటల చదువు, ఇంటర్, ఐఐఐటీ,నీట్ వంటి సిలబస్ లతో అధిక వత్తిడి
Ø కాలేజీలను ఫ్యాక్టరీలుగా మార్చవద్దని అధికారుల ఆదేశం
Ø విద్యార్థులపై వత్తిడికి తల్లిదండ్రులు కూడా కారణమే
Ø కాలేజీ వాతావరణంలో మార్పులు చేయడానికి యాజమాన్యాలు అంగీకారం

         సచివాలయం, అక్టోబర్ 16: కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. సచివాలయం 1వ బ్లాక్ గ్రీవెన్స్ సెల్ లో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు  ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సుదీర్ఘంగా చర్చించారు.  విద్యార్థులపై చదువుల భారం, వత్తిడి, కాలేజీలు, హాస్టళ్ల వాతావరణ సరిగాలేకపోవడంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.    ప్రైవేటు కళాశాల యాజమాన్యాల ప్రతినిధులు దాదాపు 200 మందికిపైగా హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ తాను విశాఖపట్నంలో చైతన్య, నారాయణ  కాలేజీలు, హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా పరిశీలించి, విద్యార్థుల ద్వారా వారి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. కొన్ని కాలేజీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. హాస్టళ్లలో ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యార్థులకు తరగతులు, అధ్యయన తరగతులతో తీరిక, విశ్రాంతి లేకుండా వత్తిడి పెరిగిపోతుందన్నారు. యోగా, మెడిటేషన్, ఆటలు వంటివి ఏమీ లేకుండా ఎప్పుడూ చదువు, చదువు అని వారిచేత చదివిస్తున్నారన్నారు. మానసిక శాస్త్రవేత్తలు లేరని, విద్యార్థులకు కౌన్సింగ్ నిర్వహణ కూడా లేదని చెప్పారు. నలుగురు ఉండవలసిన గదిలో ఏడుగురు, ఎనిమిదిమందిని ఉంచుతున్నారని, ముగ్గురు కూర్చొవలసిన బెంచ్ పై అయిదుగురిని కూర్చోబెడుతున్నారని చెప్పారు. టాయిలెట్స్ తగినన్ని లేవన్నారు.
 మనిషికి చదువు తప్పనిసరని, అయితే అదే జీవితం కాదన్నారు. విద్యార్థి సామర్ధ్యానికి మించి వారికి ఐఐఐటీ, నీట్ వంటి కోచింగ్స్ ఇస్తున్నరని, దాంతో వారు తీవ్ర వత్తిడికి గురవుతున్నారని చెప్పారు.  ఈ కాలేజీల్లో రుబ్బడం వల్ల వారికి ర్యాంకులు వస్తున్నాయని, ఆ తరువాత వారు ఐఐఐటీ వంటి సంస్థలలో చేరి తమ చదువులను కొనసాగించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల యాజమాన్యాల వైఖరి మారాలని, ఇక ముందు వత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదలని చెప్పారు.

ఏడాదికి 220 రోజులు మాత్రమే కాలేజీ తరగతులు నిర్వహించాలని, వారానికి 24 గంటలు మించకూడదని, ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 4.30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులు  తెలిపారు. కార్పోరేట్ కాలేజీల వారు ఏడాదిలో 300 రోజులు, రోజుకు 12 గంటలు  తరగతులు నిర్వహిస్తారని, సెలవులకు విద్యార్థులను ఇళ్లకు పంపరని, ఆదివారం సెలవు ఉండదని, తరగతులు, అధ్యయన తరగతులు, పరీక్షలు నిర్వహిస్తుంటారని అధికారులు చెప్పారు. కార్పోరేట్ కాలేజీల్లోని విద్యార్థుల కంటే ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్థుల్లో అన్ని విధాల పర్సనాల్టీ డెవలప్ మెంట్ బాగా ఉంటుందని తెలిపారు. కార్పోరేట్ కాలేజీల్లో  లైబ్రరీ, ఆటల గ్రౌండ్, పరిశోధనా శాలలు, వారికి ఆనందం అందించే మార్గాలు ఏమీ లేవని, శానిటేషన్ సరిగాలేదని, డైనింగ్ హాళ్లు ఇరుకుగా ఉంటాయని  చెప్పారు.  వారానికి రెండు సార్లు పరీక్షలు పెడతారనివిద్యార్థులు సబ్జెక్ట్ ని అర్ధం చేసుకునే సమయం ఇవ్వరన్నారు. ఇక్కడ ఇంటర్ విద్యార్థులు రికార్డులు కూడా రాయరని, పది వేల రూపాయలు ఇచ్చి రికార్డులు రాయిస్తుంటారని చెప్పారు. విద్యార్థుల వద్ద  సెల్ ఫోన్ ఉండనివ్వరని, తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ల్యాండ్ లైన్ వద్ద బారులు తీరి నిలబడాలన్నారు. ఒక్కో తరగతిలో 80 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటరని,  ఇంటర్ సిలబస్ ని 5 నెలల్లో పూర్తి చేసి, ఆ తరువాత ఐఐఐటీ, నీట్... వంటి ఇతర సిలబస్ లు చెబుతారని, దాంతో విద్యార్థులపై వత్తిడి పెరిగిపోతుందని పేర్కొన్నారు.  తరగతుల నిర్వహణ, ప్రశ్నాపత్రాలు రూపొందించడం, జవాబు పత్రాలను దిద్దడం వంటి వాటితో అధ్యాపకులు కూడా వత్తిడికి గురవుతున్నారని అధికారులు చెప్పారు. యాజమాన్యాలు సిలబస్, తరగతుల నిర్వహణ, విద్యార్థులకు ఆటవిడుపు, విశ్రాంతిభవనాలకు ఫైర్ సర్టిఫికెట్ ... వంటి అంశాల్లో  బోర్డు నిబంధనలు పాటించరని చెప్పారు. నిబంధనలు పాటించని 805 కాలేజీలకు నోటీసులు జారీ చేశామని, వాటిలో 234 కాలేజీల గుర్తింపుని రద్దు చేసినట్లు తెలిపారు. మరో 134 కాలేజీలను రద్దు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థిని రెసిడెన్సియల్ కాలేజీలో చేర్చిన తరువాత మళ్లీ వారిని తల్లిదండ్రులకు అప్పగించే వరకు బాధ్యత యాజమాన్యాలదేనని చెప్పారు. కాలేజీలను ఫ్యాక్టరీలుగా మార్చవద్దని, ఆత్మహత్యలు జరుగకుండా నిర్వహణలో మార్పులు తీసుకురావాలని కోరారు. నాణ్యమైన విద్య ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించాలన్నారు. ఇంటర్ కాలేజీల్లో  సిలబస్ లోని నీతి, వాతావరణంకు సంబంధించిన సిలబస్ బోధించడంలేదని చెప్పారు.

ట్రిపుల్ ఐటికీ చెందిన అధికారులు మాట్లాడుతూ తాము సైకాలజిస్టులను నియమించామని, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు ఆటల గ్రౌండ్స్ ఉన్నాయని, యోగా తరగతులు నిర్వస్తున్నామని, డాక్టర్లు అందుబాటులో ఉంటారని, ర్యాగింగ్ పూర్తిగా నిర్మూలించినట్లు తెలిపారుతాము ఎంట్రన్స్ లేకుండా కేవలం మార్కుల ఆధారంగా అడ్మిషన్లు నిర్వహిస్తామని, గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన విద్యార్థులు తమ వద్ద కూడా కొంత వత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నయని చెప్పారు.

కార్పోరేట్ కళాశాలలు కాకుండా ఇతర యాజమాన్యాల ప్రతినిధులు మాట్లాడుతూ  విద్యార్థులను ఆకర్షించడంలో ఇంటింటికి తిరిగి వారికి సాధ్యంకాని లేనిపోని ఆశలు కల్పించి విద్యార్థులను చేర్పించే పీఆర్ఓ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్పోరేట్ కాలేజీల వారిని చూసి తాము కూడా 18 గంటల వరకు చదివించవలసి వస్తోందన్నారు. యాజమాన్యాల స్వయం పర్యవేక్షణ లేకుండా వందల కాలేజీలు నడపడం వల్ల కూడా సరైన నియంత్రణ కొరవడినట్లు చెప్పారు. ఇంటర్ బోర్డు నిబంధనలు కార్పోరేట్ కళాశాలలకు వర్తించవని, వారు ఏడాదికి 320 రోజులు కాలేజీలు నిర్వహిస్తారని ఆరోపించారు.
విద్యార్థులపై వత్తిడి పెరగడానికి యాజమాన్యాలతోపాటు తల్లిదండ్రుల తప్పు కూడా ఉందని తెలిపారు. విద్యార్థి స్థాయి, సామర్థ్యాన్ని అంచనా వేయకుండా తమ కుమారుడు లేక కుమార్తె ఐఐఐటీ, ఎంబీబీఎస్ వంటి సీటు సాధించాలని ఆశపడతారని చెప్పారు. విద్యార్థులు తమ ఇబ్బందులను తల్లిదండ్రులకు చెప్పినా వారు వినిపించుకోరన్నారు. విద్యార్థులకు పరీక్షలలో పాయింట్లు కాకుండా ఏ,బీ,సీ,డీ గ్రేడింగ్ విధానం అయితే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారు. విద్యార్థుల వయసు 14 నుంచి 18 సంవత్సరాల మధ్య మానసిక స్థితిగతుల్లో మార్పులు వస్తుంటాయని, ఆ కాలంలో జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద కంటే టీచర్లు, స్నేహితులు వద్దే ఎక్కువ కాలం గడుపుతున్నారని, అందువల్ల టీచర్లు వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాని చెప్పారు. మానవ సంబంధాలు, నైతిక విలువలు పెంపొందించవలసిన అవసరం ఉందన్నారు.

కార్పోరేట్ కళాశాల యాజమాన్యాల ప్రతినిధులు మాట్లాడుతూ కాలేజీ వాతావరణంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఆత్మహత్యలు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో చర్చించి విద్యార్థులపై వత్తిడి తగ్గిస్తామని చెప్పారు. సైకాలజిస్టులను కూడా నియమిస్తామన్నారు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ బి.ఉదయలక్ష్మి, విచారణ కమిటీ చైర్మన్ డి.చక్రపాణి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి అండ్ టెక్నాలజీ(ఆర్జీయుకెటీ) వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.రామచంద్ర రాజు, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...