Oct 14, 2017

ఒకే దేశం - ఒకే విధానం


ఒకే చట్టం, ఒకే పన్ను, ఒకటే పరీక్ష, ఒకే విద్యా విధానం, ఒకేసారి ఎన్నికలు

      ఒకే దేశం - ఒకే విధానం నినాదం ఇప్పటిదేం కాదు. ఎప్పటి నుంచో దీనిపై చర్చ జరుగుతోంది. దేశంలోని కొన్ని కోట్ల మంది చిరకాల వాంఛ కూడా ఇది. ఇప్పుడు జమిలి ఎన్నికల ప్రస్తావన రావడంతో మళ్లీ ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ విశిష్టత. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని మతాలు, భాషలు, సంస్కృతులు, వాతావరణ పరిస్థితులతో ఒక్కటిగా ఉండటం మన దేశం ప్రత్యేకత. దేశంలో ఎన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలపించినప్పుడు అందరూ ఎలా లేచి నిలబడతారో, అదే విధంగా మనం అంతా ఒక్కటే అనే భావన బలపడవలసిన అవసరం ఉంది. పూల దండలో ఎన్నిరకాల పూలు ఉన్నా దారం ఒక్కటే, అదే విధంగా మతాలకు, భాషలకు, సంస్కృతులకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగకుండా దేశ పౌరులందరిలో ఏకత్వం పటిష్టంగా ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో అన్ని రంగాల్లో ఇంకా ఎంతో అభివృద్ధి సాధించవలసి ఉంది. రాజకీయాలను పక్కన పెట్టి  ఈ ఏకత్వానికి ఎన్నో సంస్కరణలు చేయవలసి అవసరం ఉంది. దేశం అంతటా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కసారిగా కాకపోయినా క్రమంగా ఒకటే చట్టం, ఒకటే పన్ను, ఒకటే పరీక్ష, ఒకే విద్యావిధానం, ఒకేసారి ఎన్నికలు.... వంటివి ప్రవేశపెట్టవలసి ఉంది. అత్యశ అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు కులాలు, మతాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రతిపదికన జరుగాలి. అంతకంటే ముందు దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ సంక్షేమ శాఖలను ఒక గొడుగుకు కిందకు తీసుకురావలసిన అవసరం కూడా ఉంది. లబ్దిదారులు పొందే ఆర్థిక సహాయంలో ఎటుంటి కోత విధించకుండా  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ... ఇలా అనేక రకాల సంక్షేమ శాఖలన్నిటిని కలిపివేస్తే చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అలాగే దేశమంతటా లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దేశ విస్తీర్ణం, జనాభా, భిన్న సంస్కృతులు, వేరువేరు వాతావరణ పరిస్థితులు, జాతీయ-ప్రాంతీయ పార్టీలు, ప్రజాస్వామ్య మనుగడ....వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ లాభాలే ఎక్కువ. ఎన్నికల వ్యయం ఏడాదికి ఏడాది విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికల వల్ల అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకూ లాభమే. 2014లో 16వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఆరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభ ఎన్నికలు కూడా  జరిగాయి. ఆ తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాలలో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 2015 జనవరిఫిబ్రవరిలో ఢిల్లీ శాసనసభకు, సెప్టెంబర్‌నవంబర్‌లో బీహార్‌ శాసనసభకు, 2016 ఫిబ్రవరిమార్చిలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. 2017 ఫిబ్రవరిమార్చిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 2014 మార్చి నుంచి 2017 మార్చి వరకూ 19 రాష్టాలలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. వీటికి తోడు  పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం అయిదారు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు సరేసరి. ఈ కారణంగా అటు పాలకులు, ఇటు ప్రతిపక్షం వారు ఎక్కువ కాలం రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు.  పరిపాలన పైన దృష్టి తగ్గిపోతోంది. 2009లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.1,115 కోట్లయితే, 2014 ఎన్నికలకు రూ. 3,870 కోట్లు, అంటే మూడు రెట్ల కంటే ఎక్కవ ఖర్చయింది. లోక్‌సభ ఎన్నికల ఖర్చు కేంద్రం, శాసనసభ  ఎన్నికల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. రెండు  ఎన్నికలు ఒకేసారి జరిగితే మొత్తం ఖర్చును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీల, పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక ఎన్నికలంటే అవినీతి అక్రమాలు - రాజకీయ పార్టీల వికృత విన్యాసాలు, మతాల, కులాల, వర్గాల ఘర్షణలు, పలు రకాల విభేదాలు.... వంటి వాటితో సమాజంలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎన్నికల సమయంలో కుల, మతాల ప్రసక్తిలేకుండా మన దేశంలో ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించే పరిస్థితిలేదు. ఎన్నికలు ఎన్నిసార్లువస్తే అన్ని సార్లు సమాజంలో, వ్యక్తుల్లో ఇటువంటి కలుషిత పరిస్థితులు నెలకొంటూనే ఉంటాయి. దానికితోడు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ నియమావళి అమలులోకి రావడం వల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతుంది.  అయిదేళ్ళ పొడుగునా ఎక్కడో ఒక చోట  ఎన్నికలు జరిపించే విధానానికి వెంటనే స్వస్తి చెప్పాలని ఎన్నికల కమిషన్‌ 1999లో సమర్పించిన నివేదికలో పేర్కొంది. అత్యవసరమైన సందర్భంల్లోనే శాసనసభ ఎన్నికలు విడిగా నిర్వహించాలని, మిగిలిన సందర్భాల్లో జమిలి ఎన్నికలే నిర్వహించాలని లా కమిషన్‌ స్పష్టం చేసింది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

         జమిలి ఎన్నికల వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నమాట వాస్తవం. అయితే ఈ విధానం వల్ల వ్యయంతోపాటు సమాజానికి హానికలిగించే అనేక సంఘటనలను, ఆలోచనలను, సమస్యలను దూరం చేయవచ్చు. విశాల ధృక్పదంతో ఏకత్వం పెంపొందడానికి ఉపయోగపడుతుంది. యుపీపీఎస్సీ, ఐఐటీ వంటి పోటీ పరీక్షలు దేశవ్యాప్తంగా ఒకేసారి, ఒకే విధానంలో నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతున్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల ద్వారా కూడా ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.  జాతీయ పార్టీలతోపాటు అనేక ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యమేలుతున్న ప్రస్తుత నేపధ్యంలో లోక్‌సభకూ, శాసనసభకూ ఒకే సారి ఎన్నికలు జరిగితే లోక్‌సభ ఓటు జాతీయ పార్టీకీ, శాసన సభ ఓటు ప్రాంతీయపార్టీకి వేసేటంతటి విచక్షణా జ్ఞానం ఓటర్లకు ఉండదన్న వాదనలో పసలేదు. అది ఓటర్లను కించపరచడమే అవుతుంది. భారతీయ ఓటర్లు అంత తెలివితక్కవవారేమీకాదు. ఓటర్లు ఎంత విచక్షణగా, ఎంత తెలివితేటలతో ఓట్లు వేశారో మన దేశంలో జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్ధమవుతుంది. దేశంలో అత్యవసర పరిస్థితి తరువాత, రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తరువాత, రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారో అందరికీ తెలిసిందే. ఎక్కడా ఒకే పార్టీకి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. ఆయా సందర్భాలను బట్టి కొన్ని పార్టీలను ఆకాశానికెత్తితే, కొన్ని పార్టీలను నామకూపాలు లేకుండా చేశారు. వారి విజ్ఞతకు ఈ ఎన్నికలే నిదర్శనం. ఒకే ఎన్నికల విధానం ద్వారా  ఒకే భాష (హిందీ), ఒకే మతం (హిందూ), ఒకే పార్టీ (బీజేపీ) పాతుకుపోతుందన్న భయంలో అర్థంలేదు. జమిలి ఎన్నికల వల్ల ఓటర్లు రానురాను ఒకే పార్టీ వైపు మొగ్గు చూపుతారని, ఫెడరల్ స్ఫూర్తికి, రాష్ట్రాల హక్కులు, అధికారాలకు విఘాతం కలుగుతుందన్న వాదన సరైందికాదు.  దేశానికి పోరాటాల చరిత్రతోపాటు రాజకీయ పార్టీలను, వ్యక్తులను మార్చివేసిన ఘనత కూడా ఉంది. ఓటర్లు అనేక సందర్భాల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కేంద్రంలో ఒక పార్టీని, రాష్ట్రంలో ఒక పార్టీని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. జమిలి ఎన్నికల వల్ల శాసనసభ కాలం కుదించడం, పొడిగించడంతోపాటు ఇంకా అనేక సమస్యలు వస్తాయి. ఏదైనా ఒక ప్రధాన విధానాన్ని సంస్కరించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవడం సహజం. దేశ, సమాజ ప్రయోజనం దృష్ట్యా వాటిని అధిగమించవలసిన అవసరం ఉంది. జమిలి ఎన్నికల వల్ల ఖర్చు ఒక్కటేకాదు, ఇతరత్రా అనేక విధాలుగా దేశానికి ప్రయోజన చేకూరుతుంది. అయితే మన రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కుల ప్రకారం జమిలి ఎన్నికలు నిర్వహించడం కష్టం. అందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించవలసి ఉంటుంది. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలిపినా, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అంగీకరించే అవకాశాలు తక్కువ. అయితే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మాత్రం జమిలి ఎన్నికలకు సుముఖంగా ఉంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికల నిర్వహణకు జాతీయ, ప్రాంతీయ పార్టీలను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించవలసిన అవసరం ఉంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...