Oct 10, 2017

అనంతపురం -అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే భూసేకరణపై ప్రత్యేక దృష్టి


Ø ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.27,600 కోట్లు
Ø 26,793 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయం
Ø ఎక్స్ ప్రెస్ హైవే పొడవు 393.59 కి.మీ
Ø మొత్తం రోడ్ల పొడవు 598.83 కిలో మీటర్లు
Ø నిర్మాణ బాధ్యత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగింత
Ø ఎక్స్ ప్రెస్ హైవేకు సమాంతరంగా రైల్వే ట్రాక్‌ ప్రతిపాదన
Ø మారనున్న వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రం
Ø పారిశ్రామిక ప్రగతికి అవకాశం

             అనంతపురం - అమరావతి  ఎక్స్ ప్రెస్ హైవేకు భూ సేకరణ పనులు వేగం పుంజుకున్నాయి. త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని దీనిపై ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే అత్యంత పొడవుగా, మలుపులు లేకుండా దీనిని నిర్మించనున్నారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో దీని నిర్మాణం కీలకం కానుంది. సవివర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. 393.59 కిలోమీటర్లు నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టుకు రూ.27,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.   రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. ‘నేషనల్ ఎక్స్ ప్రెస్ వే గా కేంద్రం దీనిని గుర్తించింది. దీని నిర్మాణ బాధ్యతను కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగించింది.  2019 నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  రాష్ట్రంలోని 5 జిల్లాలను నూతన రాజధానికి కలు పుతూ నిర్మించే ఈ రహదారితో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా కరవు ప్రాంతమైన రాయలసీమకు  ఈ రహదారి ద్వారా బెంగళూరు, చెన్నయ్‌, హైదరాబాద్‌ ప్రధాన నగరాలకు అనుసంధానం ఏర్పడుతుంది.  రాయలసీమ జిల్లాల నుంచి అమరావతికి ప్రయాణ కాలం, దూరం గణణీయంగా తగ్గుతుంది. గుంటూరు జిల్లాలో 82.4 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 226.9 కిలోమీటర్లు, కర్నూలు జిల్లాలో 160.6 కిలోమీటర్లు, కడప జిల్లాలో 64.2 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 68.6 కిలోమీటర్లు  ఈ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మిస్తారుకర్నూలు నుంచి ఒక లైన్‌, కడప నుంచి మరో లైన్‌ వచ్చి ఈ రహదారిని కలుస్తాయి. కర్నూలు నుంచి నన్నీరు, భాగ్యనగర్ మీదుగా 75.60 కి.మీ. పొడవున,  కడప నుంచి కుమ్మరకొట్టలు, ఎడవల్లి మీదుగా 88 కి.మీ. పొడవున నేషనల్ ఎక్స్ ప్రెస్ వేతో కలిసేలా రెండు రోడ్లు నిర్మిస్తారు.  దేశంలోనే అతిపెద్దదైన ఈ రహదారి ప్రాజెక్టు కోసం మొత్తం 26,793 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 9324 హెక్టార్ల భూమి అటవీ ప్రాంతంగా ఉంది. దీన్ని నోటిఫై చేయాలి. ఈ మార్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా వున్నాయో గుర్తిస్తున్నారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియలో వేగం ఉన్నప్పటికీ, భూములు ధరలు అధికంగా ఉండటం, భూముల ధరలపై స్పష్టత లేకపోవడం వల్ల గుంటూరు జిల్లాలో కొంత జాప్యం జరుగుతోంది. ఈ జిల్లాలో కూడా వేగంగా భూమి సేకరించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ని ఆదేశించింది.

           మొత్తం నిర్మాణాన్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందిప్రస్తుతం దీనిని 6 వరుసల రహదారిగా నిర్మించాలన్నది ప్రతిపాదన. అయితే భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో వుంచుకుని 8 వరుసలకు సరిపడా స్థలాన్ని సేకరిస్తున్నారుఉత్తరప్రదేశ్ లో 300 కిలోమీటర్ల మేర 4 వరుసలతో నిర్మించారు. కడప, కర్నూలు రహదారులు కలుపుకొని  అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవేను మొత్తం 598.830 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. అనంతపురం-అమరావతి రహదారి (393.59 కి.మీ) 6 వరుసలుగా, కడప, కర్నూలు రహదారులు 4 వరుసలుగా నిర్మించాలని ప్రతిపాదించారు. ఇంతటి పొడవైన రహదారికి ఎక్కడా మలుపులు ఉండవు. అవసరమైనచోట అక్కడక్కడ సొరంగ మార్గాలు, వంతెనలు నిర్మిస్తారు. దీని నిర్మాణం పూర్తి అయితే దేశంలో ఇటువంటి మొదటి రహదారి అవుతుంది.   ఈ ఎక్స్ ప్రెస్ హైవేకు సమాంతరంగా రైల్వే ట్రాక్‌ కూడా నిర్మించనుండటం దీని ప్రత్యేకత. ముఖ్యంగా భూ సేకరణ నిమిత్తం సాధ్యమైనంత తక్కువ మొత్తాన్ని వెచ్చించాలని అనుకుంటున్నారు. భూముల ధరలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో భూ సమీకరణ విధానానికి వెళ్లాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాజధాని తరహాలో భూ సమీకరణ చేపడితే ప్రాజెక్టు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే పారిశ్రామిక ప్రగతికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దొనకొండ ఏర్పడనున్న డెడికేటెడ్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్ కు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుకు ఈ రహదారి దగ్గరగా వెళుతుంది. ఈ  రహదారికి రెండువైపులా నీరు, ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలలో చిన్నచిన్న పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...