Oct 24, 2017

అసెంబ్లీ సమయాన్ని వినియోగించుకోని జగన్


మార్కెటింగ్ శాఖ మంత్రి  ఆదినారాయణ రెడ్డి విమర్శ
Ø ఎమ్మెల్యేలు పార్టీ మారతారన్న భయంతోనే అసెంబ్లీ బాయ్ కాట్ ఆలోచన
Ø 3వేలు కాదు 30వేల కి.మీ. పాదయాత్ర చేసినా అభ్యంతరంలేదు
Ø ఆయన సీఎం కావాలని ప్రజలు దేవుని ప్రార్థించాలట
Ø 21 మందిమి ఆనాడే రాజీనామాలు సమర్పించాం
Ø అన్ని స్థానాల్లో టీడీపీ గెలవాలన్న ఆకాంక్ష
Ø ప్రపంచ దేశాలు మనవైపు చూడాలి

సచివాలయం, అక్టోబర్ 24: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతి పక్షనేత జగన్మోహన రెడ్డి బాయ్ కాట్, బాయ్ కాట్... అంటూ శాసనసభ సమయాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదని మార్కెటింగ్ శాఖ మంత్రి సీహెచ్. ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ సమావేశాల సమయంలోనే ఆయన పాదయాత్ర పెట్టుకున్నారని, సభలో ఆయన పార్టీ తరపున ఎవరూ మాట్లాకూడదనేది ఆయన ఉద్దేశమని, అందువల్లే అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని అనుకుంటున్నారన్నారు. సభలో ఆయనే మాట్లాడాలని, మరొకరికి అవకాశం ఇవ్వరని విమర్శించారు. అంతేకాకుండా ఆయన పాదయాత్రలో ఉంటే, పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ పార్టీ మారతారోన్న భయం కూడా ఆయనకు ఉందన్నారు.  జగన్ రెడ్డి పాదయాత్ర ఆపాలన్న ఉద్దేశం తమకు లేదని, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యనేతలు అందరూ పాద యాత్ర చేయాలని, ఆయన ఏం చెప్పుకుంటారో ప్రజలకు చెప్పుకోవాలని, ప్రజలు ఆయనకు ఏం చెబుతారో చెప్పాలని అన్నారు. ఆయన చెప్పేది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.  తాము ఇప్పటికే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రేషన్, పించన్, గ్యాస్, ఇళ్లు, రోడ్లు, డ్రైనేజ్... వంటి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని, ఆయన పాదయాత్రలో కూడా ఏవైనా కొత్త సమస్యలు తెలిస్తే వీటన్నిటితోపాటు వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. మూడు వేల కిలోమీటర్లు కాదు 30 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా తమకు అభ్యంతరంలేదన్నారు. ఆయన నవరత్నాలే చెప్పారని, రాష్ట్రంలో 90 రత్నాల కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. జగన్ కు రాజకీయాల్లో సరైన అవగాహన లేదని విమర్శించారు. ఎన్నికల్లో సలహాల కోసం ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నారని, ఆయన చెప్పినదానికి ఇక్కడ వ్యతిరేకంగా జరిగిందని, ఆయన మాటలు ఇక్కడ పరిస్థితులకు చెల్లవన్నారు. మొన్నటి వరకు ‘‘నేనే సీఎం, నేనే సీఎం’’ అన్న వ్యక్తి ఇప్పుడు తాను సీఎం కావాలని ప్రజలందరూ దేవుని ప్రార్ధించమంటున్నారన్నారు. నాయకుడనేవాడు ప్రజలు బాగుండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలని, ఈయన మాత్రం అందుకు విరుద్దంగా తాను సీఎం కావాలని కోరుకోవాలంటున్నారని విమర్శించారు. ఆయన కేసులకు సంబంధించి తుది తీర్పు వస్తే తీహార్ జైలుకు పంపుతారో, మరే జైలుకు పంపుతారోనని అన్నారు. పార్టీ మారిన తాము 21 మందిమి ఆనాడే రాజీనామా లేఖలు అందజేశామనిస్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉందని, అయితే ప్రతిసారి ఎన్నికలంటే ఖర్చుతోపాటు అభివృద్ధికి ఆటంకం అన్న ఆలోచనతో ఆయన ఉన్నట్లున్నారన్నారు. తన రాజీనామాని ఆమోదించమనే తాను కోరుతున్నట్లు చెప్పారు.

సుదీర్ఘకాలం అనుభవం గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ, సచివాలయం నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించారని, ఇప్పుడు అమరావతి నిర్మాణం కొనసాగిస్తున్నారని చెప్పారు. మంత్రి మండలి సమావేశంలో ఆయన ప్రతి అంశం చర్చిస్తారన్నారు. ప్రపంచ దేశాలు మన వైపు చూసేవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారని, పెట్టుబడులు రాబట్టడానికి, హామీలు అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. జమ్మలమడుగు నియోజకర్గంలోని గండికోట కూడా నీరందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులతో సహా 175 శాసనసభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, ఒకవేళ స్థానాలు పెరిగితే వాటన్నిటిలోనూ టీడీపీ గెలవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...