Oct 31, 2017

స్పష్టమైన విధానాలతో పారదర్శక పాలన

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
అర్ధ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలపై సమీక్ష
Ø ప్రతిపక్షాల ‘శ్వేత పత్రం’ డిమాండ్ హాస్యాస్పదం
Ø  ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం  త్రైమాసికం వివరాలు శాసనసభకు సమర్పణ
Ø ఆశాజనకంగాలేని ప్రభుత్వ ఆదాయం
Ø ఆర్థిక నియంత్రణ అవసరం
Ø రూ.10వేల కోట్లకు పైగా మూలధన వ్యయం
Ø 2018-19 బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం
        సచివాలయం, అక్టోబర్ 30: మూడేళ్లుగా ఆర్థిక శాఖతోపాటు ఇతర అన్ని శాఖల్లో, అన్ని అంశాల్లో స్సష్టమైన విధానాలతో పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో సోమవారం ఉదయం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో అర్ధ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలను మంత్రి  సమీక్షించారు. అనంతరం తన ఛాంబర్ లోనే  మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే ‘శ్వేత పత్రం’ విడుదల చేస్తుందని, ప్రతి పక్షాలు డిమాండ్ చేసినంత మాత్రాన విడుదల చేయవలసిన అవసరంలేదని,  ప్రస్తుతం తాము ‘శ్వేత పత్రం’ విడుదల చేయడంలేదని, చేయం అని ఆయన గట్టిగా చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం ప్రకారం ప్రతి త్రైమాసికం ఆదాయ,వ్యయాల వివరాలు శాసనసభలో ప్రవేశపెడతామని, రాబోయే శాసనసభ సమావేశాల్లో 2017-18 తొలిత్రైమాసికం పూర్తి వివరాలు ప్రవేశపెడతామన్నారు. అది ‘శ్వేత పత్రం’కు మించి ఎక్కువ విలువైందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు ‘శ్వేత పత్రం’ కోసం డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు. తొలిత్రైమాసికం నివేదిక అర్ధంకాకపోతే ‘శ్వేత పత్రం’కూడా అర్ధం కాదన్నారు.
ఆశాజనకంగాలేని రెవెన్యూ రాబడి
           ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో రెవెన్యూ రాబడి ఆశాజనకంగాలేదని మంత్రి చెప్పారు. ఆదాయం పెరుగుదలలో వృద్ధిరేటు ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగాలేకపోవడం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నాన్ రెవెన్యూ ఆదాయం తగ్గడం వల్ల పరిస్థితి ఇలా ఉన్నట్లు వివరించారు. ఎక్సైజ్, మైన్స్ అండ్ మినరల్స్ శాఖల ఆదాయం కొంత మెరుగుగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో వ్యయం కూడా ఎక్కువగా అవుతున్నట్లు చెప్పారు. నీటిపారుదల, రోడ్లు,భవనాలు, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు తెలిపారు. కొన్ని శాఖలు అదనపు బడ్జెట్ కోరుతున్నాయన్నారు. మూలధన వ్యయం రూ.10వేల కోట్లకు పైగా ఖర్చుచేశామని, దీని ద్వారా స్థిరాస్తులు పెరుగుతాయని,  అభివృద్ధిపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందనడానికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు. మూలధన వ్యయం మంచిదేనని, రెవెన్యూ వ్యయం మంచిదికాదన్నారు. ఉద్యోగులు డీఏ ఇచ్చామని, పీఆర్సీ భారం పెరుగుతోందని చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,794 కోట్లు రుణం తీసుకోవడానికి అవకాశం ఉందని, ఇప్పటివరకు రూ.16,100 కోట్లు రుణం తీసుకున్నామని, రూ.6వేల కోట్లు వడ్డీ చెల్లించినట్లు మంత్రి వివరించారు. బిల్స్ ఎక్కువ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక నియంత్రణ అవసరం అన్నారు. వ్యయాలను క్రమబద్దీకరించినట్లు చెప్పారు.  జీతాలు ఆపడంలేదని, పెండింగ్ బిల్స్ కూడా పది రోజుల్లో చెల్లిస్తామని, ఆందోళన అవసరంలేదని చెప్పారు. నవంబర్ 10 నుంచి వర్క్ బిల్లులు అన్నీ చెల్లిస్తామని, కాంట్రాక్టర్లు ఎవరూ పనులు ఆపవలసిన అవసరంలేదన్నారు.

కేంద్రం నుంచి రావలసిన నిధులు
          పోలవరం ప్రాజెక్ట్, గ్రామీణ ఉపాధి హామీపథకం(నరేగా) వంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా ఖర్చు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పోలవరానికి సంబంధించి రూ.1000 కోట్లు, నరేగాకు సంబంధించి రూ. 1200 కోట్లు కేంద్రం నుంచి రావలసి ఉందన్నారు. గతంలో నరేగా పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందేవని, అందువల్ల తాము ముందుగా చెల్లించేవారమని చెప్పారు. ఇప్పుడు నరేగా నిధులను  కేంద్రం నేరుగా కూలీలకే చెల్లిస్తోందని, అందువల్ల తాము ముందుగా చెల్లించడం సాధ్యం కాదన్నారు.

2018-19 బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం
           శాఖలవారీగా 2018-19 బడ్జెట్ ప్రక్రియ ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు.  బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం మార్పులకు సంబంధించి కేంద్రం నుంచి తమకు ఏవిధమైన సూచనలు అందలేదని, అందువల్ల  ఫిబ్రవరి నెలాఖరులోగానీ, మార్చి మొదటి వారంలో గానీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు.

వ్యయాల క్రమబద్దీకరణకు కమిటీ
             వ్యయాల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కమిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శితోపాటు ఆడిటర్ నరసింహ మూర్తి, మరికొందరు నిపుణులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. 2018-19 బడ్జెట్ రూపొందించడంలో ఈ కమిటీ సలహాలు, సూచనలు అందింస్తుందని చెప్పారు. బడ్జెట్ సక్రమంగా రూపొందించకపోతే ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయన్నారు. అప్పులు రెండు రకాలుగా ఉంటాయని, ఒకటి ప్రభుత్వం నేరుగా అప్పు చేయడం, రెండు ఆఫ్ బడ్జెట్ అప్పులని, అంటే ఆర్టీసీ, సివిల్ సప్లైస్, విద్యుత్, నీటిపారుదల వంటి కార్పోరేషన్లు అప్పులు తీసుకోవడం అని వివరించారు. ఈ రకమైన అప్పులు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు  చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి పరిమితి ఉంటుందని, కార్పోరేషన్లకు ఆ పరిమితి ఉండదని తెలిపారు. కార్పోరేషన్లు తీసుకునే రుణాలకు ప్రభుత్వం హామీ ఉంటుందని చెప్పారు. రైతు సాధికార సంస్థ రూ.2వేల కోట్లు రుణం తీసుకున్నట్లు తెలిపారు. రైతు రుణ మాఫీ పథకం కింద ఈ ఏడాది రూ.3వేల కోట్లు ఇస్తామన్నారు.  వ్యయ నియంత్రణలో భాగంగా ఎక్కవ వడ్డీ రేటుకు తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుతున్నట్లు వివరించారు. గతంలో 10.5 శాతం వరకు వడ్డీ రేట్లు ఉండేవని, ఇప్పుడు వాటిని 7.9 రేటుకు మార్చి వడ్డీ చెల్లింపులు తగ్గిస్తున్నట్లు చెప్పారు.

త్వరలో మరో పది వేల ఉద్యోగాల భర్తీ
          తమ ప్రభుత్వం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, తొలివిడత పది వేలు భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చిందని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని, మళ్లీ మరో పది వేల ఉద్యోగాలు భర్తి చేస్తామని చెప్పారు. వివిధ శాఖల నుంచి ఖాళీల సమాచారం సేకరిస్తున్నామని, వివరాలు అందగానే మంత్రి మండలి ఆమోదంతో ఏపీపీఎస్సీకి అందజేస్తామన్నారు. ఈ ఉద్యోగాలే కాకుండా డీఎస్సీ ద్వారా కూడా ఖాళీలను భర్తీ చేసినట్లు చెప్పారు.

జీఎస్టీలో కొంత గందరగోళం వాస్తం
          జీఎస్టీ విషయంలో కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన పన్నుల విధానంలో కొన్ని లోటుపాట్లు ఉండటం సహజం అని,  కాలక్రమంలో అన్నీ సర్ధుకుంటాయని చెప్పారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని వినతి పత్రాలు అందజేయడం అనేది నిరంత ప్రక్రియ అన్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో గౌహతిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. చింతపండు, గ్రానైట్ వంటి వాటిపై పన్ను తగ్గించాలని అడగనున్నట్లు మంత్రి చెప్పారు.

పెట్రోల్ ధరలపై నిర్ణయం సీఎందే
            సరిహద్దు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలోని పెట్రోల్ ధరలతో పోల్చితే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని, దాంతో సరిహద్దు జిల్లాల్లో పెట్రోల్ బంకుల వ్యాపారం పడిపోయి, వారు  నష్టపోతున్నట్లు తెలిపారు. పెట్రోల్ ధరలు తగ్గించే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవలసి ఉందని మంత్రి యనమల చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...