Oct 30, 2017

లాభసాటిగా సీఎం లండన్ ప్రయాణం


·       ఫలించిన సీఎం ప్రయత్నాలు
·       పెట్టుబడులకు రాష్ట్రంలో అవకాశాలు వివరించిన సీఎం
·       రాష్ట్రాభివృద్ధిపై పలువురు ప్రముఖలతో చర్చలు
·     సహకారం అందిస్తామని యూకే మినిస్టర్ ప్రీతి పటేల్ హామీ
·     ఫిన్‌టెక్ వ్యాలీకి సహకరించడినికి శాంటండర్ సుముఖత
·     ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పనులు డిసెంబర్ లో ప్రారంభం
·     నవంబర్ లో ప్యూర్ సర్కిల్ బృందం ఏపీకి రాక
·     అమరావతి పాలన, న్యాయ నగరాల ఆకృతులలో స్వల్ప మార్పులకు సూచన
·       లండన్‌లో విభిన్న రవాణా వ్యవస్థల నిర్వహణ పరిశీలన

   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల లండన్ ప్రయాణం రాష్ట్రానికి లాభసాటిగా సాగింది. పరిశీలనలు, చర్చలు, సమాలోచనలు, వరుస ముఖాముఖి సమావేశాలతో ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ తో జరిగిన ఈ ప్రయాణంలో రాష్ట్రానికి బహుముఖ ప్రయోజనాలు కలిగే విధంగా ఆయన పలువురు ప్రముఖులను కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. భారత్, యూకే మధ్య మరి ముఖ్యంగా యూకె-ఆంధ్రప్రదేశ్ మధ్య వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర రంగాల సంబంధాలు మరింత బలపడేవిధంగా ఆయన ప్రయాణం సాగింది. ప్రతి క్షణాన్ని ఆయన రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి,  పెట్టుబడులు రప్పించడానికి, సాంకేతిక సహాకారం పొందడానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే వినియోగించుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి.  తనను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన యూకేలోని భారత డిప్యూటీ హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ కి కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, ఓడరేవులు, అంతర్గత జల రవాణా మార్గాల గురించి వివరించి యూరప్, ఇంగ్లండ్ నుంచి పెట్టుబడులు పెట్టే సంస్థలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వమని  కోరారు.  ‘ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐఓడీ) నిర్వహించిన వివిధ సంస్థల సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.  రాష్ట్రం దేశానికి మధ్య భాగాన ఉండటం, సుదీర్ఘమైన సముద్రతీరం,  రైలు మార్గాలు, రహదారులు, జల రవాణా సదుపాయాలతో దేశం మొత్తానికి అనుసంధానం, నిరంతర విద్యుత్ సరఫరా, సౌర విద్యుత్ ఉత్పత్తికి పెద్దఎత్తున ప్రోత్సహం, వ్యాపార సానుకూలత...వంటి అంశాలు తమకు కలిసి వచ్చేవని, రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. దేశంలో జలకళ-పచ్చదనం నిడిన తొలి రాజధాని అమరావతి 9 నగరాలు, 27 టౌన్‌షిప్పులతో అత్యద్భుత నగరంగా రూపొందుతోందని,   వైజ్ఞానిక, పర్యాటక నగరంగా అందరికీ ఒక ముఖ్య గమ్యస్థానంగా నిలవగలదని పేర్కొన్నారు.   

మర్యాదపూర్వకంగా కలిసిన యూకే మినిస్టర్ (సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్) ప్రీతి పటేల్ తో ఆయన  కొత్త రాష్ట్రం అభివృద్ధి, రాజధాని నిర్మాణం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ది సంస్థ,  రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు, పాలనా సంస్కరణలు, -ప్రగతి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, బిగ్ డేటా, సీసీటీవీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, స్పెన్సర్లు తదితర ఐటీ, ఐవోటీ విస్తృత వినియోగం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకారం అందిస్తామని ఆమె సీఎంకు హామీ ఇచ్చారు.  సీఎంతో సమావేశమైన యూకేలోని ప్రముఖ గ్లోబల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థ  శాంటండర్ఇండియా డెస్క్ డైరెక్టర్ ఎడ్వర్ట్ డిక్సన్, ఎక్స్‌ పోర్ట్స్-ఏజన్సీ ఫైనాన్స్ అధిపతి ఫిలిప్స్‌లు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వివిధ ఉత్పత్తుల విక్రయాలకు అవసరమయ్యే ఆర్థిక సాయం అందిస్తామని, ఇకపై రాష్ట్రంలోని ఎగుమతిదారులు, యూకేలోని దిగుమతిదారులకు కావాల్సిన ఆర్ధికమద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు.  గుంటూరు నుంచి మిర్చి ఎగుమతుల వ్యవహారాల్లో ఇప్పటికే తాము పాలుపంచుకుంటున్నట్లు, ఇక ముందు ఏపీతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ఏపీలో ఎగుమతిదారులు, యూకేలో కొనుగోలుదారుల మధ్య సంధానకర్తగా కూడా వ్యవహరిస్తామని చెప్పారు. ఫిన్‌టెక్ రంగంలోనూ అగ్రగామైన శాంటండర్ఏపీలోని ఫిన్‌టెక్ వ్యాలీకి సహకరించడినికి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఆహారశుద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వ్యవహారాలలో ఆర్థిక ఊతానికి అంగీకరించారు.ముఖ్యమంత్రితో ముఖాముఖి సమావేశం జరిపిన ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’(ఐయుఐహెచ్)కు చెందిన అజయ్ రాజన్ గుప్తా అమరావతిలో నెలకొల్పే హెల్త్ సిటీప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలు పెడతామని సీఎంకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ  ఎల్ అండ్‌ టీకి అప్పగించినట్టు వెల్లడించారు. 2018 అక్టోబరు నాటికి భవంతుల నిర్మాణం పూర్తి చేసి ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పారు.

భారత్‌లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించి ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు తమ మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తున్న వైద్య పరికరాలు, ఐటీసీ సిస్టమ్స్ తయారీలో అగ్రగామిగా వున్న టెలిమేటిక్, బయోమెడికల్ సర్వీసెస్(టీబీఎస్) గ్రూపు చైర్మన్, యూకేఐబీసీ విదేశీ వ్యవహారాల జనరల్ మేనేజర్ నికోలా పాంగెర్‌ సీఎంతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తయారీ కర్మాగారాన్ని టీబీఎస్ నెలకొల్పాలని ఆయనకు సీఎం సూచించారు. ఏపీఈడీబీతో తమ భారత ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతారని పాంగెర్ తెలిపారు. పంచదారకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధ చక్కెర (నేచురల్ స్వీటనర్) ను ఆహార, పానీయాల పరిశ్రమలకు అందిస్తున్న ప్రపంచంలోని అగ్రశేణి ఉత్పత్తి సంస్థ ప్యూర్ సర్కిల్ సీఈవో మెగోమెట్ మసగోవ్‌ తనను కలసిన సందర్భంగా సహజసిద్ధ చక్కెర ఉత్పత్తికి అవసరమైన తోటలను దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా, చైనాలలో సాగు  చేస్తున్న విధంగా ఏపీలోనూ ఆ తరహా మొక్కల పెంపకానికి ముందుకురావాలని సీఎం ఆహ్వానించారు.  సానుకూలంగా స్పందించిన మెగోమెట్ మసగోవ్‌ నవంబర్ మొదటి వారం తమ బృందాన్ని రాష్టానికి పంపించేందుకు అంగీకరించారు. తాను కూడా డిసెంబర్ నెలాఖరులో అమరావతి సందర్శిస్తానని చెప్పారు.

అమరావతి నగర ఆకృతులను రూపొందించే ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌ అధినేత లార్డ్ ఫోస్టర్‌, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇంతవరకు రూపొందించి సిద్ధం చేసిన పరిపాలన, న్యాయనగరాల ఆకృతులను పరిశీలించారు. రాజధాని ప్రభుత్వ భవన సముదాయ ఆకృతుల రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ముఖ్యంగా హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుదిరూపానికి వచ్చింది. శాసనసభ భవంతి ఆకృతులలో సీఎం కొద్దిపాటి మార్పులను సూచించారు. హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుది రూపానికి వచ్చింది. ముఖద్వారం, భవనంలో ఇతర భాగాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని సీఎం  అభిప్రాయపడ్డారు. త్వరలో ఆ మార్పులను పూర్తి చేసి సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్దేశించారు. సచివాలయానికి సంబంధించి జరిపిన సమాలోచనలో ఒక స్పష్టత వచ్చింది. మొత్తం 5 టవర్లుగా సచివాలయాన్ని నిర్మిస్తారు. ఇందులో రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 భారీ టవర్లు ఉంటాయి. వీటికి కొంచెం ఎడంగా సీఎం కార్యాలయం, సీఎం కార్శదర్శుల కార్యస్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం, వీటిన్నింటితో వేరే టవర్ ఉంటుంది. ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలిచే  అత్యద్భుతమైన రాజధానిని నిర్మించడం కోసమే ఇంత పెద్దఎత్తున కసరత్తు చేయాల్సివస్తోందని నార్మన్ సంస్థ ప్రతినిధులకు సీఎం చెప్పారు. దాని నిర్మాణశైలి, ఆకృతులు అసాధారణ రీతిలో, అపూర్వంగా నిలిచేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. నవ్యాంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసేలా, ప్రజాశక్తి ప్రతిబింబించేలా,  వారికి గర్వకారణంగా నిలిచేలా అపూర్వంగా, గొప్పగా, భారతీయత ఉట్టిపడేలా, సహజ వనరులను ఉపయోగించుకునేలా ఆకృతులను రూపొందిస్తున్నామని ఫోస్టర్ సంస్థ రూపకర్తలు క్రిస్ బాబ్, పిడ్రో సీఎంకు వివరించారు.

లండన్ ప్రస్తుత జనాభా 86 లక్షలు. సెంట్రల్ లండన్‌లో 13 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, అక్కడ నివసించే ప్రజల సంఖ్య కేవలం లక్ష మాత్రమే. అంటే నిత్యం వస్తూ పోతూ ఉండే వారి సంఖ్య 12 లక్షలు. అక్కడ ట్రాఫిక్ నిర్వహణ ఒక పెద్ద సవాలు. భవిష్యత్ లో రాజధాని అమరావతిలో ఎదురయ్యే సమస్యలను దృష్ఠిలోపెట్టుకొని లండన్‌లో విభిన్న రవాణా వ్యవస్థల నిర్వహణ, కాలుష్య నియంత్రణ వ్యవస్థ, వాహనాలకే కాకుండా, పాదచారులు, సైక్లిస్టులు ప్రయాణించడానికి వీలుగా ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించారు. అమరావతిలో అత్యుత్తమ రవాణా వ్యవస్థ నెలకొల్పాలన్న కృతనిశ్చయంతో ఉన్న సీఎం అక్కడి నిఘా వ్యవస్థ, వీధుల్లోని కెమెరాలు, బస్ స్టాప్ లు, ప్రయాణికుల రద్దీ వంటి వాటిని కూడా గమనించారు. మొత్తం నగరంలో రైలు, బస్సు, కార్లు, భూగర్భ రైల్వే, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ కమాండ్ సెంటర్ నుంచి నియంత్రంచే విధానాన్ని అక్కడ అధికారులు ముఖ్యమంత్రి బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లండన్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన-మౌలికవసతుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఆర్థికాభివృద్ధి మండలి కార్యనిర్వహణ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ వున్నారు.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...