Oct 25, 2017

‘సాగరమాల’పై ప్రభుత్వం దృష్టి

       
 సాగరమాల పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ పథకంలో రాష్ట్రం ప్రధాన భాగస్వామిగా ఉంది. ప్రాధమికంగా రాష్ట్రంలో రూ.1,30,762 కోట్ల వ్యయంతో 90 ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిలో 60 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం, 30 ప్రాజెక్టులను విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చేపడతాయి. ఇదిలా ఉండా, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ సాగరమాల కార్యక్రమం కింద మొత్తం 106 ప్రాజెక్టుల జాబితాను రాష్ట్రానికి అందజేసింది. వాటిలో 71 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వానికి, 31 ప్రాజెక్టులు విశాఖ పోర్టు ట్రస్ట్ కు కేటాయించింది. మళ్లీ మరో 4 ప్రాజెక్టులు మత్స్యశాఖకు కేటాయించింది. దాంతో  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన ప్రాజెక్టుల సంఖ్య 75 కు చేరింది. వాటిలో పోర్టుల ఆధునికీకరణకు సంబంధించినవి 4, పోర్టులకు రైలు మార్గాల అనుసంధానంకు సంబంధించినవి 12, పోర్టులు-రోడ్ల అనుసంధానం ప్రాజెక్టులు 24, పోర్టుకు జలమార్గం 1, పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ ప్రాజెర్టులు 5, తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించినవి 29 ప్రాజెక్టులు ఉన్నాయి.  వాటిలో 48 ప్రాజెక్టులను వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే వాటిలో 8 ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యమైనవిగా గుర్తించింది. వీటిలో 1.కాకినాడ లంగర్ పోర్ట్ మౌలిక సదుపాయల ఆధునికీకరణ ప్రాజెక్ట్. ఏపీ పోర్ట్స్ శాఖ చేపట్టే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.90 కోట్లు. 2.గాజువాక-గంగవరం 4 లైన్ల రోడ్ 6 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) చేపట్టే దీని అంచనా వ్యయం రూ.50 కోట్లు. 3. విశాఖ జిల్లాలోని గంగవరం పోర్ట్ అనుసంధానంగా ఉన్న బైస్ రోడ్ అభివృద్ధి చేయడం. ఎన్ హెచ్ఏఐ చేపట్టే దీని అంచనా వ్యయం రూ. 80 కోట్లు. 4.విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్థిక జోన్(ఎస్ఇజడ్) నుంచి గంగవరం పోర్టు వరకు 30 కిలోమీటర్ల 4 లైన్ల రోడ్డు నిర్మాణం. ఎన్ హెచ్ఏఐ చేపట్టే దీని అంచనా వ్యయం రూ.500 కోట్లు. 5. కాకినాడ లంగర్ పోర్ట్ ఉప్పాడ బీచ్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ రహదారి-16 వరకు 4 లైన్ల రోడ్ నిర్మాణం. దీని అంచనా వ్యయం రూ. 980 కోట్లు. దీనిని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఏపీఆర్డీసీ) నిర్మిస్తుంది. 6.శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి నెల్లూరు నగరానికి ఉన్న 24 కిలోమీటర్ల రోడ్ ని అభివృద్ధి చేయడం. ఎన్ హెచ్ఏఐ చేపట్టే దీని అంచనా వ్యయం రూ.300 కోట్లు. 7. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పారిశ్రామిక క్లస్టర్ కు 5 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం. రూ.90 కోట్ల అంచనా వ్యయంతో దీనిని కూడా ఎన్ హెచ్ఏఐ చేపడుతుంది. 8.నెల్లూరు జిల్లా కోస్తాతీరంలో ఉన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేయడం. రాష్ట్ర ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే దీనికి అంచనా వ్యయం రూ. 242.22 కోట్లు.  ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలు రూపొందించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆ నివేదికలు కేంద్రానికి సమర్పించి ఆ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావలసిన వాటా నిధులను త్వరగా మంజూరు చేయించుకొని ఆయా ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉంది.
         ముఖ్యంగా పనులు త్వరితగతిన జరిగేందుకు  సాగరమాల కార్యక్రమం ప్రాజెక్టు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలైన జాతీయ రహదారుల అభివృద్ధి ఏజెన్సీ(ఎన్ హెచ్ఏఐ), ఇండియన్ రైల్వే, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యుఏఐ), ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్(ఐపిఏ),  ఇతర ఏజెన్సీలతో అధికారులు  ఎప్పటికప్పుడు సమనవ్వయంతో వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే తీరప్రాంతం గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగంపర్యాటక రంగం, ముఖ్యంగా బీచ్ టూరిజం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సముద్రాన్ని, తీర ప్రాంతాన్ని అన్ని విధాల, అవకాశం ఉన్న మేరకు వినియోగించుకొని ఉత్పత్తి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నదే  ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో మొదటి సారిగా మెరైన్ బోర్డును కూడా నెలకొల్పాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

          ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జలమార్గాలకు చెందిన ప్రాజెక్టులు చేపడుతోంది. ఆసియా దేశాలలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. కేంద్ర జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా 888 కిలోమీటర్ల కాకినాడ-పుదుచ్ఛేరి జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)తో ఈ రకమైన ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఏపి నిలిచింది. అలాగే తమిళనాడు-ఏపి రెండు దక్షిణాది రాష్ట్రాలకు అనుసంధానంగా విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (విసిఐసి) శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు ఏర్పాటు కానుంది. ఇది భవిష్యత్ లో ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ గా కీలకం కానుంది. తీర ప్రాంతాన్ని వినియోగించుకొని పోర్టుల ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక  దృష్టి పెట్టింది.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...