Oct 23, 2017

24 నుంచి 21.52 లక్షల దోమ తెరల పంపిణీ


మంత్రి కామినేని శ్రీనివాస్

Ø మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య,ఆరోగ్య శాఖల సమన్వయంతో దోమల నివారణకు చర్యలు
Ø త్వరలో డాక్టర్ల నియామకం
Ø   మంగళగిరిలో  ఎయిమ్స్ నిర్మాణంపై  25న సమీక్ష

     సచివాలయం, అక్టోబర్ 23: రాష్ట్రంలో దోమల వల్ల ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా ఈ నెల 24వ తేదీ  నుంచి రాష్ట్రవ్యాప్తంగా 21.52 లక్షల దోమతెరల పంపిణీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. సచివాలయంలో సోమవారం ఉదయం నుంచి 4 గంటలకుపైగా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులలు, సీజనల్ వ్యాధులు, జ్వరాలు, పథకాల అమలు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు, చంద్రన్న సంచార వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, ఆరోగ్యరక్ష, డయాలసిస్ యూనిట్ల పనితీరుపై  వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నోడల్ ఆఫీసర్స్ తో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం  సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.  విజయవాడ వాంబే కాలనీలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం తాను దోమతెరలను పంపిణీ చేస్తానని చెప్పారు. అలాగే అన్ని జిల్లాల్లో ఇతర మంత్రులు పంపిణీ చేస్తారన్నారు. దోమల నివారణకు మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్, వైద్య,ఆరోగ్య శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో  ఎయిమ్స్ నిర్మాణంపై ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ఆ జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎయిమ్స్ నిర్మాణ స్ధలం వద్దే  సంబంధింత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డెంగూ వ్యాధి కేసులు తగ్గాయని, అయితే మరి కొన్ని ప్రాంతాల్లో పెరిగాయన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాల్లో  తగ్గాయని, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కవయ్యాయని తెలిపారు. గత వారంలో రాష్ట్రంలో డెంగూ  కేసులు 272 నమోదు కాగా, ఈ వారం 305 కేసులు నమోదైనట్లు చెప్పారు. మలేరియా కేసులు తగ్గినట్లు తెలిపారు. గత వారంలో 172 కేసులు నమోదు కాగా, ఈ వారం 113 కేసులు నమోదయ్యాయన్నారు. చనిపోయిన గొర్రెలు తిన్నవారికి ఆంత్రాక్స్ వ్యాధి సోకుతుందని చెప్పారు. అనంతపురం జిల్లాలో నాలుగు గ్రామాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ ఆంత్రాక్స్  ప్రాణాంతకంకాదన్నారు. ఆంత్రాక్స్ కేసులపై పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డితో మాట్లాడానని, ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు గుర్తించిన గ్రామాలలోని పశువులకు వ్యాక్సిన్ వేయాలని మంత్రి ఆదేశించినట్లు చెప్పారు. ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై వైద్య,ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహనకల్పిస్తుందన్నారు. చంద్రన్న సంచార కేంద్రాల్లో 96 శాతం డాక్టర్లు ఉన్నట్లు తెలిపారు.  115 సీహెచ్ సీలను కొత్త శానిటేషన్ పాలసీ క్రిందకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రంలో కొత్తగా 14 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే డాక్టర్లను నియమిస్తామని మంత్రి కామినేని చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...