Jan 2, 2017

సీఈజెడ్ ఏర్పడితే మరిన్ని రాయితీలు


Ø ఎగుమతి ఆధారిత ఫ్యాక్టరీలకు అవకాశం
Ø ఉద్యోగా కల్పన ఆధారంగా పన్నుల మినహాయింపు
Ø తీర ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి


          రాష్ట్ర తీరప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న నేపధ్యంలో కేంద్రం ‘తీర ఉపాధి మండలి’ (కోస్టల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ - సీఈజెడ్‌) ఏర్పాటు చేయడం ద్వారా మరిన్నీ రాయితీలు అభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. సముద్రంలోనే కాకుండా తీరం వెంట భూగర్భంలోనూ అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది.  దానికి తోడు రాష్ట్రంలో  నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. సాగర తీరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జల రవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి) ఏర్పడుతోంది. దేశంలో తీరప్రాంతంలో ఏర్పడే  మొదటి కారిడార్ ఇది. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు 2500 కిలో మీటర్లు విస్తరించి ఉండే కారిడార్ ఇది.  భవిష్యత్ లో ఇది తూర్పు ఆర్థిక  కారిడార్ గా కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. వీటన్ని దృష్ట్యా దేశీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలు తీర ప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉండటం,  తక్కువ జీతాలకే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండటంతో విదేశీ సంస్థలు అనేకం రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని బహుళజాతి కంపెనీలు  రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు(ఎంఓయు) కూడా చేసుకున్నాయి.

           ఇదిలా ఉండగా, దేశంలో తీర ప్రాంతంలో స్థానికంగా ఉండే మానవ వనరుల్లో నైపుణ్యాలను ఉపయోగించుకుని వారికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఇందు కోసం నీతి (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సఫార్మేషన్ ఇండియా - ఎన్ఐటీఐ) అయోగ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో  తీర ఉపాధి మండళిఏర్పాటు చేయనుంది. గతంలో ఏర్పాటైన ఎస్‌ఈజెడ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి)లు, ఎన్ఐఎంజెడ్ (నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్- ప్రత్యేక పెట్టుబడి, పారిశ్రామిక, ఉత్పాదక మండలి)లకు భిన్నంగా ఇది ఉంటుంది. దీనిని కనీసం 400-500 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఈ జోన్ లో ఎగుమతి ఆధారిత యూనిట్లను ప్రోత్సహించాలన్న యోచనలో కేంద్రం ఉంది. అందువల్ల తీర ప్రాంతంలో, పోర్టులకు దగర్లో దీనిని  ఏర్పాటు చేస్తారు.  పరిశ్రమలో ఉపాధి పొందే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఐదేళ్ల నుంచీ పదేళ్ల వరకూ కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. పదివేల మంది ఉపాధి కల్పిస్తే ఐదేళ్లు, 20 వేల మంది ఉద్యోగులు ఉంటే 10 ఏళ్ల వరకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొన్ని కార్పొరేట్‌ రాయితీలు ఇస్తారు.
          సాగరమాల ప్రాజెక్ట్ లో భాగంగా   ప్రస్తుతం దేశంలో రెండు సీఈజెడ్ లను ఏర్పాటు చేస్తారు. తూర్పున ఏపీలో, పశ్చిమాన గుజరాత్ లో  వీటిని ఏర్పాటు చేస్తారు. వచ్చే బడ్జెట్‌లో  సీఈజెడ్‌లపై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు ఆచార్య అరవింద్‌ పనగారియా సారధ్యంలో ఒక బృందం ఏపీలో సీఈజెడ్‌ ఏర్పాటుకి ఉన్న అవకాశాలను సెప్టెంబర్ లో పరిశీలించింది. సీఈజెడ్‌ ఏర్పాటుకి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం-గంగవరం, కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతాలు అనువైనవిగా ఈ బృందం భావించింది.
          విశాఖ మేజర్ పోర్టుతోపాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పలు మీడియం పోర్టులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ ఎగుమతులకు ఈ పోర్టులు అనుకూలంగా ఉన్నాయి.  పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి అనువైన ప్రాంతంగా దీనిని గుర్తించారు. మెరైన్ ఉత్పత్తుల్లో దేశంలో ఏపీ అత్యున్నత స్థానంలో ఉంది. ఎగుమతులు కూడా అధికంగా ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.   2015-16 లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  అందువల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక యూనిట్లతోపాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.  రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాకలతోపాటు తీర ఉపాధి మండలి కూడా ఏర్పడితే ఇక్కడి తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...