Jan 24, 2017

పెట్టుబడులు రాబట్టడంలో ముందున్న ఏపీ

·       ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, విద్యుత్ సమర్థ వినియోగం, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, మౌలిక సదుపాయాల కల్పనలలో నెంబర్ - 1
·       విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ – 3
·       14 రోజుల్లో 16 శాఖల నుంచి 39 రకాల అనుమతులు

       దేశవిదేశాల నుంచి పెట్టుబడులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుంది.  సన్ రైజ్ రాష్ట్రంగా, తూర్పు ముఖ ద్వారంగా ఉంటూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. స్థిరమైన రెండంకెల ఆర్థిక వృద్ధి సాధిస్తూ 2029 నాటికి అభివృద్ధిని చెందిన రాష్ట్రంగా ఎదగడానికి ప్రభుత్వం తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు, వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం కల్పించి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత సంవత్సరం 2వ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది మొదటి స్థానానికి ఎగబాకింది. ప్రపంచ బ్యాంకు ఎనర్జీ ఎఫిషియన్సీ 2016 నవంబర్ నివేదిక ప్రకారం విద్యుత్ ని ఆదా చేయడంలో, సమర్థవంతంగా వినియోగించడంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. 2015-16లో  ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఆ విధంగా ఏపీ మొదటి స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పన విభాగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచి ఇండియాటుడే అవార్డు గెలుచుకుంది. అలాగే ఆర్బీఐ 2016 సెప్టెంబర్ బులిటెన్ ప్రకారం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఎన్సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రిసెర్చ్)2016 నివేదిక ప్రకారం వ్యాపార పెట్టుబడుల సామర్థ్యంలో 4వ స్థానం పొందింది.

14 రోజుల్లో 16 శాఖల నుంచి 39 రకాల అనుమతులు

       అంకిత భావంతో అంతర్జాతీయంగా అత్యుత్తమైన  పారిశ్రామిక విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రంగా పేరు సాధించింది. మౌలిక సదుపాయాల కల్పన, 14 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు వంటి వాటితో పెట్టుబడిదారులను  ఆకర్షిస్తోంది. వాణిజ్య సంస్కరణల అమలులో రాష్ట్రాల పనితీరుపై 2016 నవంబర్ లో కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల విధానం, అమలు (డీఐపీపీ) విభాగం, ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో ఏపీ పనితీరుని ప్రశంసించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి 1వ ర్యాంక్ ఇచ్చాయి. డీఐపీపీ జారీ చేసిన 340 పాయింట్ల వాణిజ్య సంస్కరణల యాక్షన్ ప్లాన్ (బిజినెస్ రిఫామ్స్ యాక్షన్ ప్లాన్-బీఆర్ఏపీ) ఆధారంగా ప్రభుత్వాల పనితీరుని అంచనా వేస్తారు. ఆ ప్రకారం 98.78 శాతం మార్కులతో ఏపీ 1వ ర్యాంకును పొందింది. దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 7,124 సంస్కరణలు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన సంస్కరణలను ప్రపంచ బ్యాంకు, డీఐపీపీ బృందాలు కలసి సమీక్షించాయి. నిబంధనల ప్రకారం 6,069 సంస్కరణలను ఆ బృందాలు ఆమోదించాయి. సులభతర వ్యాపార విధానాలు ప్రవేశపెట్టడంలో, అనుసరించడంలో ఏపీ మంచి ప్రగతి సాధించింది. పరిశ్రమల స్థాపనకు 16 శాఖలు ఇవ్వవలసిన దాదాపు 39 రకాల అనుమతులు ఏక గవాక్ష(సింగిల్ విండో) విధానం ద్వారా 14 రోజుల్లో ఇవ్వడంలో ఏపీ అగ్రభాగాన నిలిచింది. ఆన్ లైన్ చెల్లింపులు, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లో కూడా ఏపీ ముందుంది. ఏపీలో వ్యాట్, సీఎస్టీ, వృత్తి పన్ను మొదలైనవి అన్నీ అన్ లైన్ లోనే జరుగుతాయి. భవన నిర్మాణాలకు కావలసిన డాక్యుమెంట్లు, ప్లాన్లు ఆన్ లైన్ లో సమర్పిస్తే, ఆన్ లైన్ లోనే అనుమతిస్తారు. అనేక సమస్యలను ఆన్ లైన్ లో తెలిపితే, ఆన్ ద్వారానే పరిష్కారం లభిస్తోంది. వాణిజ్య పరమైన వివాదాలకు సంబంధించి అనేక న్యాయ ప్రక్రియలు కూడా పేపర్ లెస్ గానే జరిగిపోయతున్నాయి. ఈ విధమైన ఈ ప్రగతి ఏపీలో అద్వితీయమైన రీతిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విధంగా గత సంవత్సరం 2వ ర్యాంకులో ఉన్న ఏపీ, ఈ ఏడాది 1 ర్యాంకు సాధించింది. డీఐపీపీ రూపొందించిన కేటగిరీలలో ఏపీ నాయకత్వ స్థానంలో నిలిచింది.

వ్యాపార అనుకూలతలు
       రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావలసినంత భూమి అందుబాటులో ఉంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం  పారిశ్రామిక అవసరాలకు కావలసిన రీతిలో మౌలిక వసతులు కల్పిస్తోంది. నాణ్యమైన విద్యుత్ అందిస్తోంది. నైపుణ్యత గల మానవ వనరులకు కొదవలేదు. అన్ని ప్రాంతాలకు అనుసంధానత ఉంది. పారిశ్రామికాభివృద్ధితోపాటు పట్టణాభివృద్ధి, పర్యాటక, ఐటీ, విద్యా, వైద్యం, హార్టీకల్చర్ వంటి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. వీటన్నిటికీతోడు అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో పచ్చదనంతో నిండిన రాజధాని అమరావతిని నిర్మించనుంది. వీటన్నిటి రీత్యా రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించగలుగుతోంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...