Jan 2, 2017

స్మార్ట్ గ్రామాలే లక్ష్యం


ü గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
ü 20 ప్రమాణాల నిర్ధేశన
ü ఎన్ఆర్ఇజీఏ పథకం కింద 9,16,295 పనులు పూర్తి
ü రూ.9,695 కోట్ల వ్యయం
ü పలు ప్రోత్సహాకాల ప్రకటన

           స్మార్ట్ గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టింది. గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందడంతోపాటు సకల సదుపాయాలు గ్రామాలకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. పంచాయతీరాజ్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు ప్రధాన శాఖలను అనుసంధానం చేసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఇజీఏ) కింద రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం(2016-17)లో అనేక లక్షల పనులు చేపట్టి పూర్తి చేశారు. శాస్త్ర సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకుంటూ పేదరికం, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన గ్రామాలను రూపొందించడమే స్మార్ట్ గ్రామాల లక్ష్యం. స్మార్ట్ గ్రామానికి 20 ప్రమాణాలను నిర్ధేశించుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామంలో అందరికీ మరుగుదొడ్డి, సురక్షిత తాగునీరు, నిరంతర విద్యుత్ సదుపాయాలతో కూడిన ఇళ్లు ఉండేలా చేస్తోంది. ప్రతి కుటుంబానికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పిస్తోంది. స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ యువకులు బ్యాంకులు, మార్కెట్లతో అనుసంధానం కావడానికి వారికి నైపుణ్యతో కూడిన శిక్షణ ఇస్తున్నారు. బహిరంగ మల విసర్జన లేకుండా ఓ ఉద్యమమే  చేపట్టారు.  ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారు. మాతా, శిశు మరణాలు తగ్గించడానికి తగిన వైద్యసేవలు అందిస్తున్నారు. నూరు శాతం ఆస్పత్రి ప్రసవాలు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 12వ తరగతి వరకు బాల బాలికలు బడి మానివేయకుండా చదువు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆరోగ్య కేంద్రం, ఇతర ప్రభుత్వ భవనాలలో త్రాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్ సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నారు. 9 సంవత్సరాల లోపు పిల్లలలో పౌష్టికాహారం లోపంలేకుండా చేస్తున్నారు. బాల్య వివాహాలు చేయకుండా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. అన్ని వ్యవసాయ నేలలలో భూసార పరీక్షలు నిర్వహించి, ప్రతి రైతుకు భూసార కార్డులు అందజేస్తున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా తెరిచేలా చర్యలు చేపట్టారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల సరిహద్దులలో పచ్చని మొక్కలు నాటి, చెట్లను పెంచే ఏర్పాట్లు చేశారు. నీటి సంరక్షణకై నీటి నిల్వ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి  గ్రామంలో సమాచార కేంద్రాన్ని, ఒక కంప్యూటర్ ల్యాబ్ ని , మీ-సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. మూడింట రెండువంతుల హాజరుతో ఏడాదికి నాలుగు సార్లు వార్డు సభలను, గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి తగు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా సమకూరిన గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా ప్రకటిస్తారు.

ఎన్ఆర్ఇజీఏ పథకం కింద 9,16,295 పనులు పూర్తి
             స్మార్ట్ గ్రామాలను రూపొందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఇజీఏ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 84,76,242 మందికి జాబ్ కార్డులు జారీ చేశారు. ఈ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ నుంచి మార్చి వరకు)లో కనీసం వంద రోజులు పని కల్పించాలి. స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వడం ఈ ప్రథకం ప్రత్యేకత. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13,104 గ్రామాలు, 47,638 నివాస ప్రాంతాలలో  పనులు చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.9,695 కోట్ల అంచనా వ్యయంతో ఎన్ఆర్ఇజీఏ పథకం కింద చేపట్టిన 9,16,295 పనులను ఈ నెల 14వ తేదీ నాటికి పూర్తి చేశారు.  రూ.15,778 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన  6,90,511 పనులు జరుగుతూ ఉన్నాయి.
          గ్రామ పంచాయతీ నిధులకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు కూడా తోడుకావడంతో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా  పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. వాడవాడలా చంద్రన్న బాటలు వేశారు. అంగన్ వాడీ భవనాల నిర్మాణం, పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, గ్రామాల పచ్చదనం, నర్సరీల పెంపకం, వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, స్మశానాల పునరుద్ధరణ వంటి పనులు చేపట్టారు. రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ స్మార్ట్ గ్రామాలుగా రూపొందించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిగేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి, బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించిన గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తారు. వంద పంట సంజీవనులు(ఫారం ఫాండ్) పూర్తి చేసిన గ్రామానికి రూ.4 లక్షలు ఇస్తారు. అన్ని ఇళ్లకు ఇంకుడు గుంతలు పూర్తి చేస్తే రూ.2 లక్షలు ఇస్తారు. ఈ విధంగా అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తోంది. అన్ని అంశాలు పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి గరిష్టంగా రూ.22 లక్షలు, జిల్లాకు రూ.11 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఇదే క్రమంలో ముమ్మరంగా పనులు జరిగితే రాష్ట్రంలోని పంచాయతీలన్నీ త్వరలోనే స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...