Jan 2, 2017

పారిశ్రామిక ప్రగతి 9.98 శాతం


·       ప్రణాళికా శాఖ అర్థ సంవత్సరం గణాంకాలు
·       ఖనిజాలు, సహజ వాయువు 87.50 శాతం వృద్ధి
·       మైనింగ్ విభాగంలో అధిక శాతం నమోదు


         ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగం గడచిన అర్థ సంవత్సరంలో స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 9.98 శాతం సాధించింది. పారిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను ఆహ్వానించడానికి, పారిశ్రామిక వృద్ధి రేటు పెంచేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దాంతో ఈ రంగంలో ఫలితాలు కనిపిస్తున్నాయి.  సామాజిక, ఆర్ధికాభివృద్ధికి  దోహదపడేవాటిలో పారిశ్రామిక రంగం అత్యంత ముఖ్యమైనదిగా ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమల స్థాపన జరిగితే ఉత్పత్తి పెరగడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోంది. దాంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.25 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధి రేటు, 2015-16 నాటికి 11.1 శాతం నమోదై రెండంకెల వృద్ధి రేటు సాధించి.
   రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక  ఉత్పత్తి రూ.63,229 కోట్లతో  9.98 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ గణాంకాలను 2011-12 ధరల ఆధారంగా రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించింది. గత ఏడాది అర్థ సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఉత్పత్తి రూ. 57,490 కోట్లు.  ఈ ఏడాది మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో రూ.32,022 కోట్లతో 10.49 శాతం వృద్ధి రేటు సాధించగా, రెండవ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 31,207 కోట్లతో 9.46 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో అర్థ సంవత్సరంలో పారిశ్రామిక రంగం  5.60 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది.

మైనింగ్ లో 12.20 శాతం వృద్ధి రేటు
           పారిశ్రామిక రంగంలోని వివిధ విభాగాలను పరిశీలించినట్లైతే  మైనింగ్, క్వారీల్లో రూ. 5,750 కోట్ల ఉత్పత్తి జరిగి 12.20 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొదటి త్రైమాసికంలో రూ. 2,838 కోట్లతో 12.35 శాతం, రెండవ త్రైమాసికంలో రూ.2,912 కోట్లతో 12.05 వృద్ధి రేటు నమోదైంది. ఖనిజాల ఉత్పత్తి పెరగడం వల్ల ఈ విభాగంలో వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఖనిజాలు, సహజవాయువు ఉత్పత్తి పెరుగుదల అద్వితీయంగా పెరిగి, 87.50 శాతం వృద్ధి రేటు నమోదైంది. అలాగే గ్రావెల్, కలర్ గ్రానైట్ ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా విభాగాలు రూ.9,125 కోట్లతో 11.70 శాతం వృద్ధి రేటు సాధించింది. మొదటి త్రైమాసికంలో రూ. 4,454 కోట్లతో 10.01 శాతం, రెండవ త్రైమాసికంలో రూ. 4,671 కోట్లతో 13.36 శాతం వృద్ధి రేటు నమోదైంది.  విద్యుత్ ఉత్పత్తులు పెరగడంతో ఈ వృద్ధి సాధ్యమైంది.

           ఉత్పత్తి విభాగం రూ.25,798 కోట్లతో 10.20 శాతం వృద్ధి శాతం సాధించింది. మొదటి త్రైమాసికంలో రూ. 12,941 కోట్లతో 10.83 శాతం, రెండవ త్రైమాసికంలో రూ. 12,857 కోట్లతో 9.57 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ విభాగంలో  ప్రైవేట్ కార్పోరేట్ రంగం 11.90 శాతం వృద్ధి రేటు సాధించింది.  నిర్మాణ విభాగం రూ.22,556 కోట్లతో 8.52 శాతం వృద్ధి రేటు సాధించాయి. మొదటి త్రైమాసికంలో రూ. 11,789 కోట్లతో 9.87 శాతం, రెండవ త్రైమాసికంలో రూ.10,767 కోట్లతో 7.08 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొత్తంగా చూస్తే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు తక్కువగా ఉంది.

        పెట్టుబడులు రాబట్టడానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల వేగవంతంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. దాంతో రాష్ట్రంలో  ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నిలవడం ఖాయం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...