Jan 12, 2017

గగనంలో సంక్రాంతి వెలుగులు

 ·       నేటి నుంచి  విజయవాడలో 3 రోజులు ఎయిర్ షో
·       అత్యంత సుందరంగా కృష్ణా నదీ తీరం
·       గేట్‌వే హోటల్‌లో ఏవియేషన్ సమ్మిట్‌
·       ఆకాశంలో అద్భుతం పేరుతో తొలి ఎయిర్ షో

   తెలుగువారి అతి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు  ఈ సారి విజయవాడలో అమోఘంగా జరుగుతున్నాయి. నగరం ఈ ఏడాది నూతన అనుభూతులను మదిలో నిలుపుకోనుంది. ఇప్పటికే నగరానికి పండుగల కళ వచ్చేసింది. ముగ్గుల పోటీలు, డిజ్ ధన్ మేళా, ఎయిర్ షోలు ఒకటి వెంట ఒకటి జరుగుతూ నగరం సందడి సందడిగా ఉంది. పండుగ ముచ్చట్లతో కళకళలాడుతోంది. రాజధాని అమరావతితోపాటు నగరంలో ఘంటశాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల వంటి పలు చోట్ల ముగ్గుల పోటీలు చూడముచ్చటగా జరిగాయి.  ఈ పోటీలలో వేలాది మంది యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు తెలుగుదనం ఉట్టిపడేవిధంగా లంగా ఓణీలు, పట్టు పరికిణీలు ధరించగా, మహిళలు చూడముచ్చటగా చీరలు కట్టుకొని పండుగ చేసుకున్నారు. రంగురంగుల ముగ్గులు, తప్పిట్లు తాళాలు, విచిత్రవేషధారణలతో నగరంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ మరుసటి రోజు సంగీత కళాశాల  ప్రాంగణం విద్యార్థుల నృత్యప్రదర్శనలతో దద్దరిల్లింది. మరోపక్క 9,10 తేదీలలో ఇందిరాగాంధీ స్టేడియంలో డిజ్ ధన్ మేళా జరిగింది. అక్కడ ఆధార్ రిజిస్ట్రేషన్ తోపాటు మార్పులు చేర్పులు చేశారు. బ్యాంకులతోపాటు వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల వారు నగదు రహిత లావాదేవీల గురించి వివరించాయి. ఆప్కో స్టాల్ లో అయితే వేలి ముద్రతోనే బిల్లుల చెల్లింపు జరిగిపోయాయి. బ్యాంకు పేరు, ఆధార్ నెంబర్ తెలుసుకొని వేలి ముద్ర తీసుకొని వస్త్రాలు అమ్మేశారు. వృద్ధులు వేలి ముద్ర ద్వారా పెన్షన్ పొందే విధానాన్ని గ్రామీణాభివృద్ధి శాఖవారు వివరించారు. దాంతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది.

గేట్‌వే హోటల్‌లో ఏవియేషన్ సమ్మిట్‌
           ఈనెల 12వ తేదీ గురువారం గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ ప్రారంభోత్సవం అనంతరం  విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ఎయిర్‌ షో ప్రారంభమవుతుంది.  తొలుత నగరంలోని గేట్‌వే హోటల్‌లో ఏవియేషన్ సమ్మిట్‌ నిర్వహిస్తారు. ఈ సమ్మిట్ ని రాష్ట్ర ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.  దేశవిదేశీ  అంతర్జాతీయ ఏవియేషన్ సంస్థలకు చెందిన 200 మందికి పైగా డెలిగేట్లు హాజరయ్యే  సమ్మిట్ లో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర మంత్రులు పి.అశోక్‌గజపతిరాజు, వెంకయ్య నాయుడు, వైఎస్ చౌదరి, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందినవారితోపాటు బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ సమ్మిట్ లో విమానాశ్రయు, విమానయాన సంస్థలు, విమానాశ్రయాల ప్రాంతీయ అనుసంధానతపై చర్చిస్తారు. ఏవియేషన్ మార్కెట్ లో 9వ స్థానం నుంచి 2030 నాటికి నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం భారత్ లక్ష్యం. ఆ దిశగా ఉన్న అవకాశాలపై కూడా చర్చిస్తారు. సివిల్ ఏవియేషన్  రంగంలో ప్రాంతీయ అనుసంధానతకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది.

ఆకాశంలో అద్భుతం
     12 నుంచి 14వ తేదీ శనివారం వరకు మూడు రోజులపాటు కృష్ణా నది తీరం వెంట కన్నుల పండువగా ‘ఆకాశంలో అద్భుతం’ పేరుతో  విమాన విన్యాసాలు జరుగనున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగే మొదటి ఈ ఎయిర్ షోని అద్వితీయంగా జరపాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందు కోసం భవానీపురంలోని పున్నమి ఘాట్ నుంచి  భవానీ స్నాన ఘాట్ వరకు 14 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. మొదటి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు, 13వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 11.15 వరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి 4.45 వరకు విన్యాసాలు నిర్వహిస్తారు. 14వ తేదీన ఉదయం 11 నుంచి 11.15 వరకు, సాయంత్రం 4.15 నుంచి 4.30 వరకు ఎయిర్ షో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వారు పున్నమి ఘాట్‌ ప్రాంతంలో రంగు రంగుల జెండాల ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. ఎయిర్ షో ఏర్పాట్లలో నగరపాలక సంస్థ సిబ్బందితోపాటు పోలీస్ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతోపాలు పలువురు ప్రముఖులు హాజరవుతారు. అందువల్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సుందరంగా కృష్ణా నదీ తీరం
ఎయిర్ షో విన్యాసాలను తిలకించేందుకు నగరం నుంచే కాకుండా, రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా జనం వస్తారని అంచనా. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు, విద్యార్థులకు సెలవులు అయినందున అధిక సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు నిర్మించారు.  సందర్శకుల కోసం కుర్చీలు కూడా వేసి ఉంచారు.  కరకట్ట ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.  ఈ షో సందర్భంగా ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి ఆయా శాఖలకు చెందిన  సిబ్బందిని సిద్దం చేశారు. అత్యవసర మందులు, అంబులెన్స్, అగ్నిమాపక సాధనాలు, త్రాగునీరు వంటి వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. అధికారుల ఆదేశాల మేరకు నదిలో ప్రత్యేక బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. దాదాపు రూ.80 లక్షల వ్యయంతో నగర పాలక సంస్థ తీరం వెంబట మెరక చేసింది.  కృష్ణా తీరాన్ని చూడటానికి ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. ముందుముందు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగించుకునే విధంగా నదీ తీర ప్రాంతాన్ని అత్యంత సుందరంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రాజధాని అమరావతి పేరు దశదిశలా మారుమ్రోగేలా పౌరవిమాన శాఖ ఈ ఎయిర్ షోని  జరుపుతోంది. నగరంలో తొలిసారిగా ఈ షో జరుగుతున్నందున ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాతకంగా తీసుకుంది. దేశవిదేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లు కృష్ణా నదిపై వివిధ రకాల  విన్యాసాలు నిర్వహిస్తాయి.  బ్రిటన్ కు చెందిన 4 ఎయిర్ క్రాఫ్ట్ లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...