Jan 20, 2017

సోలార్ పంప్ సెట్లపై రైతుల ఆసక్తి

Ø రాష్ట్రంలో 8,375 సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు
Ø మొదటి దశలో 6725 పూర్తి
Ø 2వ దశలో 10 వేల మంజూరు
Ø మార్చి నాటికి 2వ దశ పూర్తి
Ø విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గించే ప్రయత్నాలు
Ø వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి ప్లాంట్ల పనులు మొదలు

              విద్యుత్ పొదుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  డిసెంబర్ వరకు 8375 సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు చేశారు. ఈ  పంప్ సెట్లకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోలార్‌ పంప్‌ సెట్లతో విద్యుత్‌ ఆదా కావడమే కాకుండా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాంతో ప్రభుత్వం ఈ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తోంది. పరికరాలతో కలిపి సోలార్‌ పంప్‌ సెట్‌ ఏర్పాటుకు రూ.4.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో  రైతు రూ.55 వేలు మాత్రమే చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం సబ్సిడీ ఇస్తుంది.  మిగిలిన మొత్తం డిస్కం పెట్టుబడి పెడుతుంది. ఐదేళ్ల వరకు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఎంఎన్ఆర్ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ) మన రాష్ట్రానికి మొదటి దశ కింద 6725 సోలార్ పంప్ సెట్లను మంజూరు చేసింది. వాటన్నిటిని అమర్చడంతో మొదటి దశ పూర్తి అయింది. 2వ దశ కింద పది వేల పంప్ సెట్లను మంజూరు చేసింది. వాటిలో డిసెంబర్ వరకు 1650 పంప్ సెట్లను బిగించారు. మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపల పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తరువాత మరో పది వేల పంపుసెట్లను కేంద్రం మంజూరు చేస్తుంది. ప్రభుత్వ భవనాలపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించే బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అంతేకాకుండా విద్యుత్ ను పొదుపుగా వాడుకోవడంలో భాగంగా మేజర్ పంచాయతీలలో కూడా లెడ్ బల్బులను ఏర్పాటు చేస్తున్నారు.

          ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు బొగ్గు, గ్యాస్, చమురు వంటి సాంప్రదాయ వనరుల  ద్వారా తయారయ్యే విద్యుత్ ఉత్పత్తి సరిపోదు. దాంతో అందరి దృష్టి సౌరశక్తి, గాలి వంటి సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిపై పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. సూర్యశక్తితో అతి చౌకగా విద్యుత్ ని తయారు చేయవచ్చు. అంతే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా చాలావరకు తగ్గుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సోలార్, పవన్ ప్రాజెక్టుల ద్వారా మరింత విద్యుత్ ఉత్పత్తి  చేపడుతున్నారు.
విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గింపు
                 విద్యుత్ ను పొదుపుగా వాడుకోవడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.  పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది. సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది.  రాయితీలు, మినహాయింపులు ఇస్తామని  ప్రకటించింది. దాంతో పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. 4 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఎండలు ఎక్కువగా ఉండే రాయలసీమలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఎంతో అనుకూలం.  అనంతపురం, కడప, కర్నూలులో 4 మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. 2018 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల ద్వారా  16 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా. అనంతపురం జిల్లా ఎన్.పీ.కుంటలో 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల ప్లాంట్ ను నెలకొల్పారు. కర్నూలు జిల్లా గనిలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టు పనులు పూర్తి కావచ్చాయి. మిగిలిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం పూర్తి అయింది. వీటికి కావలసిన ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆయా జిల్లా కలెక్టర్లు పరిశీలిస్తున్నారు.  సోలార్ విద్యుత్ కు సంబంధించి నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌కాప్‌) నిర్వహణలో వెబ్‌సైట్‌ ను కూడా  ప్రారంభించారు. సౌర విద్యుత్‌ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాయలసీమలోనే సౌర,పవన విద్యుత్ రెండిటినీ ఒకే చోట ఉత్పత్తి చేసే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. 200 మెగావాట్ల మిశ్రమ(సౌర, పవన) విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా  ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను ఎంపిక చేసే పనిలో జిల్లా కలెక్టర్లు ఉన్నారు.

                 ఈ నేపధ్యంలో సౌర, పవన విద్యుదుత్పత్తితోపాటు అందుకు అవసరమైన పరికరాల తయారీ యూనిట్లను కూడా  ఏపీలో నెలకొల్పేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. 615 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తితోపాటు సౌర ఫలకాల యూనిట్‌ను నెలకొల్పేందుకు విక్రమ్‌ సోలార్‌ సంస్థ ఆసక్తి చూపింది. సుజలాన్‌ సంస్థ పనవ విద్యుత్‌కు అవసరమైన టర్బైన్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అనంతపురంలో ప్రైవేట్, పబ్లిక్ భాగస్వా మ్యంతో  విద్యుత్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు.  విద్యుత్ రంగంలో పరిశోధనలు, అధ్యయనాలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి
పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోతున్న టన్నుల కొద్దీ చెత్తా చెదారం వంటి వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఘనవ్యర్థాల నిర్వహణ పక్కాగా చేయాలని, మున్సిపాలిటీల్లో వ్యర్థాల నుంచి ఇంధన తయారీ ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. ఇందు కోసం 12 జిల్లాల్లో పది క్లస్టర్లు(సమూహాలు) ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ లో 6 నుంచి 8 మునిసిపాలిటీలు ఉంటాయి.   కర్నూలు క్లస్టర్ తప్ప మిగిలిన వాటిలో ఈ ప్లాంట్లు నెలకొల్పే పనులు ప్రారంభమయ్యాయి.  ఈ ప్లాంట్లు నెలకొల్పేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు కావలసిన పరికరాలకు ఆర్డర్లు ఇచ్చారు. కొందరు సివిల్ పనులు కూడా మొదలుపెట్టారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...