Jan 27, 2017

నగదు రహిత లావాదేవీల్లో ఏపీదే అగ్రస్థానం


Ø పెద్ద నోట్ల రద్దుతో పెరిగిన క్యాష్ లెస్ లావాదేవీలు
Ø ప్రపంచంతో పోటీకి దిగనున్న ఏపీ
Ø లక్కీ వినియోగదారులు, వ్యాపారుల పథకాలు

           నగదు రహిత లావాదేవీల్లో దేశంలో రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచింది. ఒక చర్యకు రెండు లాభాలన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒకందుకు పెద్దనోట్లను రద్దు చేస్తే, అది విస్తృత స్థాయిలో నగదు రహిత లావాదేవీలకు దారి తీసింది. ఆ విధంగా రెండు రకాలుగా మంచిదైంది. ముఖ్యంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రారంభంలో ప్రజలు ఇబ్బందులు పడ్డా క్రమంగా అలవాటుపడిపోతున్నారు. డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు,  నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా రాష్ట్రంలో చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  దాదాపు 41 శాతం లావాదేవీలతో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత తేలికైన, ఆధునిక పద్దతుల్లో నగదు రహిత లావాదేవీలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రపంచంతో పోటీకి దిగనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆధార్ ఆధారిత చెల్లింపులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి.
          డిజిటల్ లావాదేవీలపై కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి కన్వీనర్ గా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రాష్ట్రంలో విజయం సాధించి ఆ పదవికే వన్నె తెచ్చారు. ఈ లావాదేవీలకు సంబంధించి ఆయన చూపిన చొరవ, కనపరిచన శ్రద్ధ అమోఘం. యుకేలో ప్రస్తుతం 56 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మన దేశంలో 11 శాతమే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 41 శాతం జరుగుతున్న లావాదేవీలను వచ్చే ఆరు నెలల్లో 60 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపులన్నీ ఆన్ లైన్ చేయడానికి అవకాశం కల్పించారు.  అన్ని రకాల పన్నులు, విద్యుత్, టెలిఫోన్ వంటి అన్ని బిల్లులు ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ జతపరచి ఉన్నట్లైతే ఏటీఎం కార్డు లేకుండానే వేలి ముద్ర ద్వారా బిల్లులు చెల్లించే సౌకర్యం కూడా వచ్చేసింది. ఆప్కో వంటి షోరూముల్లో ఇటువంటి చెల్లింపులు జరుగుతున్నాయి. అన్ని రకాల వ్యాపార సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు.... వంటి అన్ని చోట్ల నగదు రహిత చెల్లింపులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఊహించని స్థాయిలో ఈ లావాదేవీలు జరుగుతున్నాయి.

          నగదు రహిత చెల్లింపుల వల్ల లాభాలు
          నగదు రహిత చెల్లింపుల వల్ల వెంట డబ్బు తీసుకువెళ్లవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా చిల్లర సమస్య ఉండదు. 24 గంటల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా చెల్లింపులు చేయవచ్చు. నకిలీ నోట్ల భయం ఉండదు. దొంగలు డబ్బు దోచుకెళతారన్న భయం ఉండదు. చెల్లింపులకు రక్షణ ఉంటుంది. మరి ముఖ్యంగా డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద పడిగాపులు పడవలసి అవసరం ఉండదు. హెచ్ పీ గ్యాస్ వంటి సంస్థలు ఇటువంటి చెల్లింపులకు డిస్కౌంట్లను కూడా ప్రకటించాయి. నగదు రహిత చెల్లింపులు రాష్ట్రంలో ఓ ఉద్యమంలా చేపట్టడంతో వ్యాపారస్తులకు  ఈపాస్ మిషన్లను తక్కువ ధరలకే అందిస్తున్నారు. వ్యాపారులు కూడా నగదును డిపాజిట్ చేయడం కోసం బ్యాంకులకు వెళ్లి, క్యూలో నిలబడవలసి అవసరంలేదు. ఆ సమయాన్ని వారు వ్యాపారాభివృద్ధికి వినియోగించుకోవచ్చు. వారికి కూడా నకిలీ నోట్ల భయం ఉండదు. చిల్లర సమస్యలు ఉండవు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని వివిధ ప్రాంతాలకు
ఏటీఎం, రూపే కార్డులు వినియోగం, ఈపోస్ మిషన్లు ద్వారా చెల్లింపులపై రాష్ట్రంలో ప్రభుత్వ, బ్యాంకుల  అధికారులు, విద్యార్థులు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. వారంతా గ్రామాల్లో పర్యటించి నగదు రహిత లావాదేవీల వల్ల ప్రయోజనాలు  గ్రామీణులకు తెలియజెబుతున్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేశారు. ప్రభుత్వంలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పోలీస్... వంటి శాఖలు, బ్యాంకులు, హెచ్.పీ, భారత్ గ్యాస్ వంటి సంస్థలు కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నాయి. వివిధ యాప్స్ ని డౌన్ లోడ్ చేయడం, వాటిని వినియోగం వంటి వాటిని కూడా ఆ కరపత్రాలలో చేర్చారు.

లక్కీ వినియోగదారుల పథకం
         నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం లక్కీ వినియోగదారుల పథకం కూడా ప్రవేశపెట్టింది. లక్కీ డిప్ ద్వారా  ప్రతి రోజూ 15 వేల మందికి వెయ్యి రూపాయల చొప్పున బహుమతులు ఇస్తారు. ఇలా వంద రోజులు ఇస్తారు. మళ్లీ వారానికి ఒక రోజు తీసే డ్రాలో లక్ష, పది వేలు, 5 వేల రూపాయల చొప్పున ఇస్తారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున మెగా డ్రా తీసి భారీ బహుమతులు ఇస్తారు. మొదటి బహుమతి రూ.కోటి, 2వ బహుమతి రూ.50 లక్షలు, మూడవ బహుమతి రూ.25 లక్షలు ఇస్తారు. వినియోగదారులకే కాకుండా వ్యాపారుల కోసం కూడా డిజి ధన్ వ్యాపారుల పథకం ప్రవేశపెట్టారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా నగదు స్వీకరించే వ్యాపారులు ప్రతి వారం రూ.50 వేలు, రూ.5 వేలు, రూ.2,500 నగదు బహుమతి పొందే అవకాశం ఉంది. ప్రతి వారం ఏడు వేల మంది ఈ బహుమతులు పొందుతారు.   ఏప్రిల్ 14న తీసే మెగా డ్రా ద్వారా ఎంపికైన లక్కీ వ్యాపారులు కూడా రూ.50 లక్షలు, రూ.25 లక్షలు, రూ.12 లక్షలు పొందే అవకాశం ఉంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.340 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
            ఈ లావాదేవీలు దేశ వ్యాప్తంగా ఇంకా ఎక్కువగా జరగడానికి డిజిటల్ లాదేవీలన్నిటిపైన అన్ని రకాల రుసుములు రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది.  ఈ రకమైన చర్యల వల్ల దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు బాగా జరుగుతున్నాయి. దేశంలో ఇటువంటి లావాదేవీలు పెగిరిపోతే భవిష్యత్ లో అవినీతి తగ్గడానికి, నల్ల డబ్బు పేరుకుపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...