Jan 2, 2017

ఏపీలో 44 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు


·       అత్యధికంగా గన్నవరం నుంచి 76 శాతం పెరుగుదల
·       తిరుపతి నుంచి 43 శాతం పెరుగుదల
·       విశాఖలో 15 లక్షలు దాటిన ప్రయాణికులు
·       విమానాశ్రయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

           రాష్ట్రంలో రోజురోజుకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పారిశ్రామికంగా, విద్య,వైద్య పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో దేశ, విదేశీ ప్రయాణికులు వచ్చిపోతుండటంతో విమాన సర్వీసులు కూడా పెంచారు. రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నం, తిరుపతి, గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో, ఈ ఏడాది అదే కాలంలో ఆయా విమానాశ్రయాల నుంచి ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను సంబంధిత అధికారులు విడుదల చేశారు. గత ఏడాది రాష్ట్రంలో  16,91,448 మంది ప్రయాణించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 24,28,612 మందికి చేరింది. అంటే 44 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్బోబర్ వరకు ప్రయాణించిన ప్రయాణికులను ఈ ఏడాది అదే కాలంతో పోల్చితే 19 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది.
           గన్నవరం విమానాశ్రయంలో అత్యధికంగా 76 శాతం మంది ప్రయాణికులు పెరిగారు. అమరావతికి విదేశీ ప్రముఖులు, దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఇతర రంగాలకు చెందిన ప్రతినిధులు తాకిడి ఎక్కువైంది. దాంతో అమరావతికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గత ఏడాది 8 నెలల్లో ఈ విమానాశ్రయం నుంచి 2,48,662 మంది ప్రయాణించగా, ఈ ఏడాది అదే కాలంలో 4,37,928 మంది ప్రయాణించారు. విశాఖ నగరం వివిధ పరిశ్రమలు, ఐటీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గత ఏడాది 11,00,114 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 15,25,518 మంది ప్రయాణించారు. 39 శాతం మంది ప్రయాణికులు పెరిగారు. ఏడుకొండల స్వామివారికి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తిరుపతి విమానాశ్రయం నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 43 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 2,01,272 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 2,87,131 మంది ప్రయాణించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే క్రమంలో ఇక్కడ నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 21 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 1,41,440 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 1,71,491 మంది ప్రయాణించారు.  కడప విమానాశ్రయంలో ఈ ఏడాదే రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ నుంచి 6,544 మంది ప్రయాణించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ ప్రైవేటు విమానాశ్రయం కూడా ఉంది.
             రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ స్థిరమైన రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు సాధించే క్రమంలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో
మౌలిక వసతుల కల్పనలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్ పోర్ట్  ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో విమాన రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో  ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉండటంతో దీని ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా విమాన సర్వీసులు నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్ తో దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభిస్తుంది. గన్నవరం - విశాఖపట్నం, గన్నవరం - హైదరాబాద్, గన్నవరం - తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచుతారు. అందువల్ల తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతారు.  రాష్ట్రంలో అతి పెద్దదైన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు కూడా విమాన సర్వీ సులు నడుస్తున్నాయి. దీనిని  కూడా  అభివృద్ధి చేస్తారు. రాజమండ్రిలోని మధురపూడి  విమానాశ్రయంలో రన్ వేని విస్తరణ కోసం 850 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఉన్న 1750 మీటర్ల  రన్ వేను 3,165 మీటర్ల కు పొడిగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో  జరుగుతున్న ఈ రన్ వే విస్తరణ పనులు 2018 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తారు.

   కొత్త విమానాశ్రయాల నిర్మాణం:  విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశవిదేశీ వ్యాపారులు, అధికారులు, పర్యాటకులకు గన్నవరం విమానాశ్రయం ఒక్కటే సరిపోదన్న ఆలోచనతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం(పీపీపీ)తో అంతర్జాతీయ స్థాయిలో దీనిని నిర్మిస్తారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరుగలేదు.

జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...