Jan 6, 2017

విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం

Ø జన్మభూమి-మా ఊరులో ఓ సూత్రం
Ø 24 గంటలు నిరంతరం  విద్యుత్ సరఫరా
Ø ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
Ø పొదుపు చర్యల్లో ముందున్న రాష్ట్రం
Ø లోటు నుంచి మిగులుకు చేర్చిన సీఎం చంద్రబాబు
Ø మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ
Ø సౌర, పవన విద్యుత్ కు ప్రోత్సాహం
Ø 2029 నాటికి తలసరి వినియోగం లక్ష్యం 3600 కిలోవాట్లు

      విద్యుత్ ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, ఆదా చేయడంలో ఏపీ అద్వితీయమైన విజయాలు సాధిస్తోంది. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ‘జన్మభూమి-మా ఊరు’ 4వ విడత కార్యక్రమంలో కుటుంబ వికాసానికి రూపొందించిన 15 సూత్రాలలో దీనిని ఒకటిగా చేర్చింది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించేనాటికి  రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న చర్యలు, అనుసరించిన విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదల వల్ల  రెండేళ్లలో విద్యుత్ మిగిలే స్థాయికి చేరింది. గృహావసరాలకు, పరిశ్రమలకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ కూడా మిగులు విద్యుత్ సాధించడం విశేషం. రాష్ట్రంలో డిమాండ్ కు సరిప విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ నెల 3వ తేదీ మంగళవారం కూడా ఏపీఈపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ ఈస్టరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) డిమాండ్ కు సరిపడ 2068 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. అలాగే ఏపీఎస్ పీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కూడా డిమాండ్ కు సరిపడ 4018 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తోంది. విద్యుత్ లేక మూతపడిన అనేక చిన్న,మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించారు. దాంతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
 2029 నాటికి తలసరి విద్యుత్ వినియోగం లక్ష్యం 3600 కిలోవాట్లు
      తలసరి విద్యుత్ వినియోగాన్ని బాగా పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  2015లో ఉన్న1050 కిలో వాట్ల నుంచి 2019లో 1750 కిలోవాట్లు, 2022లో 2298 కిలోవాట్లు, 2029 నాటికి 3600 కిలో వాట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే పునరుద్ధరణీయ ఇంధన సామర్థ్యం 2015లో ఉన్న 2 గిగావాట్ల నుంచి 2019కి 8, 2022కి 14, 2029 నాటికి 29 గిగావాట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ధేశించింది.  గృహ వినియోగదారులకు విద్యుత్ ఖర్చు తగ్గించడానికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. నగరాలు, పట్టణాలలోని వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చడం, సౌర, పవన విద్యుత్ ను ప్రోత్సహించడం ద్వారా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
 విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పొదుపు, సంరక్షణ విధానాలలో రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతోంది. విద్యుత్ పొదుపులో రాష్ట్రానికి వరుసగా అవార్డులు వస్తుండటం ఇంధన శాఖ విజయాన్ని తెలియజేస్తోంది. గత ఏడాది అవార్డులు  ఇచ్చే సమయంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి  పియూష్ గోయెల్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ, సరఫరాల్లో నష్టాలను తగ్గించడం ఎలాగో చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. ఈ రంగంలో దేశంలోనే రాష్ట్రప్రభుత్వం మేటిగా నిలవడం అతిపెద్ద విజయం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రానున్న అయిదేళ్లలో విద్యుదుత్పత్తి, ప్రసారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టనుంది. కొన్ని గిరిజన తండాలకు తప్ప రాష్ట్రంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ఓ రికార్డు.  ఏపీలో వంద శాతం విద్యుదీకరణ దాదాపు పూర్తి అయింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డిడియుజిజేవై) ద్వారా రూ.125 లకే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు.  
          రాష్ట్రంలో ఇంతకు ముందు అయిదు లక్షల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదు. 4.50 లక్షలకుపైగా ఇళ్లకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలినవాటికి కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. కొద్ది రోజులలోనే ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి రాష్ట్రం రికార్డు సృష్టించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వంద శాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన తొలి జిల్లాగా  పశ్చిమగోదావరి జిల్లా రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్న సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఆ జిల్లా విద్యుత్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేశారు. గత మార్చి నాటికే వంద శాతం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.  వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. రైతులకు ఉచిత పంపుసెట్ మార్పిడి పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి రైతు పొలంలో ఉన్న నాసిరకం పంపు సెట్ స్థానంలో అత్యంత శక్తివంతమైన, పొదుపుగా విద్యుత్ ను వినియోగించే పంపుసెట్ ను ఉచితంగా మార్పిడి చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 15 లక్షల వ్యవసాయ పంపుసెట్ల ను మారుస్తారు.

           రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది. ఈ నష్టం 2014-15లో 11.81 శాతం కాగా,  2015-16లో 10.29 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది ఈ నష్టాన్ని సింగిల్ డిజిట్ కు తగ్గించాలన్నది లక్ష్యం. విద్యుత్ పంపిణీ, సరఫరా సక్రమంగా జరిగేందుకు 25వేల కోట్ల రూపాయలతో ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. 2015-16లో 2290 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థాన్ని సమకూర్చారు. రానున్న మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సమకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఎన్.టి.పి.సి రూ.28వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2020 నాటికి రెండు ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. నెల్లూరులో సెమ్ కార్ప్, ఇతర సంస్థలు కలసి రూ.20వేల కోట్లతో 1320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.   నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో, విజయవాడ విటిపిఎస్ లో ఒక్కోచోట 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల విస్తరణ కార్యక్రమం చేపట్టారు.  ఏపి జన్ కో ఆధ్వర్యంలో వీటి నిర్మాణం జరుగుతోంది.  విద్యుత్ ఉత్పత్తిని పెంచడంలో, పంపిణీ, సరఫరాలో నష్టాలను తగ్గించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలవడం విశేషం.

సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ
ఎల్ఈడీ బల్బుల వినియోగం ద్వారా విద్యుత్ ని పొదుపు చేయడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి  ఖర్చు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యుత్ రంగంలో అనేక ఘనవిజయాలు సాధించి, విద్యుత్ పొదుపులో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన మన రాష్ట్రం సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అతి మారుమూల ఉన్న కొద్దిపాటి గిరిజనుల ఇళ్లకు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదు. అందువల్ల ఆ ఇళ్లకు  సౌర విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుచ్ఛక్తిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పదేళ్లలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌, 8 వేల మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ రంగంలో గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటుకు విదేశీ కంపెనీలు కూడా తమ సంసిద్థతను తెలిపాయి.
         రాష్ట్రంలో 30వేల కోట్ల రూపాయలతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.  కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పరుస్తున్నారు. ఎన్.టి.పి.సి. ద్వారా అనంతపురం జిల్లాలోని సౌర విద్యుత్ పార్కు నుంచి మొదటి దశ కింద 250 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 10 నెలల్లోనే దీనిని  అభివృద్ధిపరిచారు.  రెండవ దశలో ఈ ఏడాది మార్చి నాటికి మరో 750 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేనున్నారు. ఇదే జిల్లా తాడిపత్రిలో ఏపి జెన్ కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ పార్కును నెలకొల్పనున్నారు. ఎన్.వి.వి.ఎల్. ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ఎస్ బి ఎనర్జీ, సన్ ఎడిసన్, అజూర్ పవర్, అదాని గ్రూపు చేపడుతున్నాయి.  మార్చి లోపలే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కడప జిల్లా గాలివీడులో సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేపడుతోంది. ఇదే జిల్లా మైలవరం ఎంపిటిసి, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాల ఆధ్వర్యంలో 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోనే మొదటిసారిగా వంద మెగావాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ నిల్వ యూనిట్లను కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నారు.
        సౌర విద్యుత్ పంపు సెట్ల పథకంలో భాగంగా 5,013 పంపు సెట్లు బిగించి దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రానున్న మూడేళ్ల కాలంలో ఏడాదికి పది వేల చొప్పున 30వేల పంపు సెట్లు బిగిస్తారు. ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల విషయంలో ఇప్పటికే మన రాష్ట్రం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. భవిష్యత్ లో సౌరవిద్యుత్ రంగంలో ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

ఏపీకి  జాతీయ స్థాయి అవార్డులు
        ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన సత్తా చాటుకుంటోంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఈ ఏడాది బెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్’, బెస్ట్ నోడల్ ఏజెన్సీ గా ఎంపికయింది. కేంద్ర ఎనర్జీజ్యూరీ  ఇచ్చే అవార్డుకు నెడ్ క్యాప్(జాతీయ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ) వరుసగా గెలుచుకున్న ఏడో అవార్డు. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇంధన రంగంలో 2015లో ప్రకటించిన 5 జాతీయ పురస్కారాలను మన రాష్ట్రం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రం ఒకే రంగంలో ఇన్ని అవార్డులను సాధించడం ఓ రికార్డ్. విద్యుత్‌ సమర్ధ వినియోగం, పర్యవేక్షణ, అమలు చేస్తున్న ఉత్తమ డిజైన్‌ ఏజెన్సీ (ఎస్‌.డీ.ఏ.) విభాగంగా రాష్ట్ర ప్రభు త్వానికి ఈ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ సరఫరా కంపెనీ (ఏపీడీసీఎల్‌), ఐదు జిల్లాల్లో ఎల్‌ఈడీ దీపాల సరఫరా సమర్ధవంతంగా నిర్వహించినందుకు 'బెస్ట్‌ డిస్కం'గా ఎంపికైంది. విశాఖ మహానగర పాలక సంస్థ విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసి జాతీయ అవార్డు సాధించింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...