Jan 2, 2017

అమరావతి మౌలిక వసతుల ప్రణాళిక పూర్తి


Ø 90 శాతం పైగా భూమి స్వాధీనం
Ø ప్రధాన రోడ్లకు టెండర్ల పిలుపు
Ø ప్రముఖ సంస్థలకు భూముల కేటాయింపు
Ø మౌలిక వసతులు, భూగర్భ కేబుల్ కు త్వరలో టెండర్లు
Ø 742 ఎంఎల్డీ మంచినీరు – 592 ఎంఎల్డీ మురుగునీరు
Ø 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు - 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరా
          
          నూతన ప్రజా రాజధాని అమరావతి మహానగరానికి కావలసిన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రణాళిక పూర్తి అయింది. అత్యున్నత స్థాయిలో మౌలిక వసతులతోపాటు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవనం, పర్యావరణ అనుకూల అభివృద్ధి అమరావతికి మూలస్థంభాలుగా ప్రభుత్వం భావిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న రాజధానికి అవసరమైన ప్రధాన రోడ్లు, నీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా, కేబుల్ వ్యవస్థ వంటి మౌలిక అవసరాలను తీర్చడానికి కావలసిన చర్యలను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆధునిక రాజధానికి 742 ఎంఎల్ డీ(మిలియన్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇంత నీటి సరఫరాకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునికమైన రీతిలో మురుగునీటి పారుదల వ్యవస్థను రూపొందించారు. 592 ఎంఎల్ డీల మురుగు నీరు ప్రవహించే అవకాశం ఉందని లెక్క తేల్చారు. ఇందు కోసం 316 (నాళాలు, అనుబంధ నాళాలు) కిలోమీటర్లు +277 (సంగ్రాహకాలు) కిలో మీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణం చేస్తారు. అలాగే 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరాకు కావలసిన చర్యలు చేపట్టారు. ఇన్ ఫ్రాస్టక్చర్, పీఎంసీ(ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్), బ్రూ అండ్ గ్రీన్ (జలకళ-పచ్చదనం) ... అందరు కన్సల్టెంట్లతో సీఆర్డీఏ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మౌలిక వసతుల అభివృద్ధి, గృహ నిర్మాణం, వాణిజ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, విద్య ప్రాజెక్టులు, పర్యాటకం, దాని అనుబంధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, సేవల రంగం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

90 శాతం పైగా భూమి స్వాధీనం
            అమరావతి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. 90 శాతం పైగా భూమిని సీఆర్టీఏ స్వాధీనం చేసుకుంది.  రాజధాని పరిధిలో 53,478 ఎకరాల భూమి ఉంది. ఇందులో 37,505 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం కింద సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 34,984 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అత్యంత ఆధునిక ప్రభుత్వ భవనాల మాస్టర్ ఆర్కిటెక్ట్ లుగా లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్, మన దేశానికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ లను ఎంపిక చేశారు. మిగిలిన ప్రభుత్వ భవనాల ఆర్కిటెక్ట్ ల ఎంపికకు కూడా టెండర్లను పిలిచారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అత్యంత సౌకర్యంగా ప్రజా రవాణా వ్యవస్థకు రూపకల్పన చేశారు. దానికి అనుగుణంగానే ప్రధానమైన రోడ్లు అన్నిటికి టెండర్లు పిలిచారు. భూగర్భంలో ఈహెచ్ టీ(ఎలక్ట్రానిక్ హై టెక్షన్) కేబుల్ లైన్స్ అమర్చడానికి టెండర్లను త్వరలో పిలుస్తారు.

 రానున్న అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగునంగా రాజధానిలో వివిధ ప్రముఖ విద్య, వైద్య సంస్థలకు భూములు కేటాయించారు. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు.  ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.

  రాజధానిలో పాఠశాలలు, స్టార్ హోటళ్లు, హాస్పటళ్లు, ఎంఐసీఈ(మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్) సెక్టార్ లో నిర్మాణానికి సీఆర్డీఏ ఆర్.ఎఫ్.పీ.లను ఆహ్వానించింది.  160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. అందులో భాగంగా  జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఆర్ఎఫ్ పీలను ఆహ్వానించింది. అలాగే ఒక 5స్టార్, ఒక 4స్టార్, 4 త్రీస్టార్ హోటళ్లకు ఆర్ఎఫ్ పీలను విడుదల చేసింది. ఇప్పుడే ప్రత్యేక పరిశ్రమగా ఎదుగుతున్న ఎంఐసీఈ రంగంలో కూడా టెండర్లను పిలిచారు. మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ శక్తి వంటి వాటికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...