May 31, 2019

సీఎం జగన్ ప్రసంగంతో స్పష్టత

సంక్షేమానికి, అవినీతి రహిత పాలనకు పెద్దమీట

            నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించిన  వైఎస్ జగన్మోహన రెడ్డి తొలి ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులకు, కొత్త ఒరవడికి  నాంది పలికారు. పాలనలో వేగం, సంక్షేమానికి పెద్దపీట వేయడంతోపాటు అవినీతి రహిత పాలన అందించడమే కొత్త ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పనుల విషయంలో ప్రజలు ఇప్పటి వరకు విసిగిపోయిన వాటికి నూతన సీఎం పరిష్కారం చూపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవసిన పనిలేకుండా వారికి కావలసిన పనులు వేగంగా జరగడం, వారి సమస్యలను నేరుగా సీఎం కార్యాలయానికి తెలియజేసే అవకాశం కల్పించడం వంటి చర్యలు వెంటనే చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వృద్ధాప్య పెన్షన్ ని వైఎస్ ఆర్ పింఛన్ పేరుతో రూ.2 వేల నుంచి రూ.2250లకు పెంచుతూ సీఎం తొలి సంతకం చేశారు. దానిని ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ రూ.3వేల వరకు పెంచుతారు. ‘నవరత్నాల’ అమలులో కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధంలేకుండా అర్హులు అందరికీ అమలు చేస్తారు. ప్రతి ప్రభుత్వ పథకం లబ్దిదారుని ఇంటికే చేరే ఏర్పాట్లు చేస్తారు. అందు కోసం ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఓ యువ వాలంటీర్ ని నియమిస్తారు. వారికి నెలకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి జరగవలసి పనుల్నీ ఈ వాలంటీర్లే చూసుకుంటారు. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.   సిఫారసుకు తావులేకుండా, లంచం అన్న మాట వినపడకుండా పాలన కొనసాగించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజలకు లంచాల సమస్య ఎదురైనప్పుడు, అర్హులకు ఏదైనా పథకం అందకపోయినా  వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి ఓ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తారు. దానిని నేరుగా సీఎం కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. అవకతవకలు జరిగినట్లు తేలితే వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. పాలనలో మార్పుల ప్రకియ వెంటవెంటనే వేగంగా జరిగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి 4 లక్షల మంది వాలంటీర్లను నియమించడంతోపాటు కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తారు. పాలనను ప్రజలకు చేరువ చేస్తారు.  అందులో భాగంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తారు.  పెన్షన్, రేషన్ కార్డ్,  ఇంటి స్థలం ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ  వంటివాటికి సంబంధించి ఏదైనా  ఇక్కడ దరకాస్తు చేసుకుంటే 72 గంటల్లో ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది. కాంట్రాక్ట్ విధానంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంలో   ఆరు నెలల నుంచి ఏడాది కాలం లోపలే పాలనలో అద్వితీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...