May 6, 2019


ప్రశాంతంగా రీపోలింగ్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది
81.48 శాతం పోలింగ్

          సచివాలయం, మే 6: రాష్ట్రంలోని 5 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 6వ తేదీన పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల సమస్య గానీ, శాంతి భద్రతల సమస్య గానీ తలెత్తలేదన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా తమ విధులు నిర్వహించారని అభినందించారు.  మొత్తం 5 కేంద్రాలకు 4 కేంద్రాలలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అయిందని, ఒక కేంద్రంలో మాత్రం 47 మంది క్యూలో నిలబడి ఉండటంతో అక్కడ రాత్రి 7 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్లేనన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేశనపల్లిలో 89.23 శాతం పోలయ్యాయయని తెలిపారు. అక్కడ 956 మంది ఓటర్లకు 853 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 75.43 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ  1396 మంది ఓటర్లకు 1053 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 87.01 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ 1070 మంది ఓటర్లకు 931 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇసుకపాలెంలో 75.55 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపారు. అక్కడ 1084 మంది ఓటర్లకు 819 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలోని అటకానితిప్ప పోలింగ్ స్టేషన్ లో 84.23 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ 558 మంది ఓటర్లకు 470 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నరని చెప్పారు. రీ పోలింగ్ కు సంబంధించిన 5 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 5,064 మంది ఓటర్లు ఉండగా, 4,126 మంది (81.48 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు.

        మంగళవారం నుంచి కౌంటింగ్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. ప్రతి జిల్లా నుంచి పది మందిని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తారన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, విధివిధానాలు అన్ని వారికి వివరిస్తారని చెప్పారు.  వారు ఈ నెల 17న  ఆయా జిల్లాలలో ఇతర ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. ఈవీఎం ఓట్ల కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని చెప్పారు. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఓట్ల కంటే ఎక్కువ పోస్టల్ ఓట్లు ఉంటే వాటిని మరోసారి లెక్కిస్తారన్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం విస్తీర్ణం ఆధారంగా ఎన్ని టేబుల్స్ అనేది నిర్ణయిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది ఏ నియోజకవర్గానికి ఎవరిని ఎంపిక చేశారో ఒక రోజు ముందు మాత్రమే తెలుస్తుందన్నారు. ఎంపికకు కొన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. స్థానికులు కాకూడదు, అక్కడ నివాసం ఉండకూడదు, ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ...వంటి నిబంధనలను అనుసరించి ఎంపిక చేస్తారని చెప్పారు. ఎవరికి ఏ టేబుల్ వస్తుందో ఒక గంట ముందు మాత్రమే తెలుస్తుందన్నారు. అవన్ని పరిశీలకులు నిర్ణయిస్తారని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.
               నియోజకవర్గానికి 150 మంది వరకు ఓట్ల లెక్కింపు సిబ్బంది కావలసి ఉంటుందని, 20 శాతం మందిని అదనంగా తీసుకుంటారని చెప్పారు. ఈ నెల 23వ తేదీన పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మొదట ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారని, తరువాత నియోజకర్గానికి ఓ అయిదు వీవీప్యాట్ లను ర్యాండమ్ గా ఎంపిక చేసి లెక్కిస్తారని చెప్పారు. ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్ ల ఓట్లకు మధ్య వ్యత్యాసం లేకపోతే ఫలితాలను ప్రకటిస్తారన్నారు. వ్యత్యాసం ఉంటే వీవీ ప్యాట్ ఓట్లను మరొకసారి లెక్కిస్తారని, అప్పటికీ మార్పులేకపోతే వీవీప్యాట్ ఓట్లను మొత్తం లెక్కిస్తారని, ఆ లెక్క ఆధారంగానే ఫలితాలను ప్రకటిస్తారని వివరించారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఫలితాలు తెలుస్తాయని, అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు అంచల గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ద్వివేది చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...