May 30, 2019



కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు !
 
          ప్ర్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఆర్థిక పరిస్థితుల రీత్యా ముఖ్యమంత్రి పదవి ఓ సవాల్ లాంటిది. అత్యంత దారుణంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఎన్నికల మేనిఫెస్టో అమలు, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు వంటి ముఖ్య అంశాలు ఈ నెల 30న నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే  వైఎస్ జగన్మోహన రెడ్డి ముందున్నాయి. పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులు, వివిధ శాఖల ప్రక్షాళన, పాదర్శక పాలన, దుబార వ్యయం నియంత్రణ వంటి ఆలోచనలతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అన్నిటికంటే ముఖ్యం పొరుగురాష్ట్రాలతో సఖ్యత, కేంద్రంతో సత్ సంబంధాలు నెరపాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే సరైన విధానంగా ఆయన భావిస్తున్నారు.  అదేవిధంగానే ఆయన వ్యవహరిస్తున్నారు.  రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో రాజధాని నిర్మాణం అత్యంత ముఖ్యమైనది. ఓ పెద్ద యజ్ఞం లాంటిది. అందులో జరిగిన అవకతవకలను సరిదిద్దవలసి ఉంది. రైతులకు సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి. కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టుకోవాలి. రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన, పూర్తిగా కేంద్రం వ్యయంతో నిర్మించే పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.97 వేల కోట్లుగా ఉన్న రుణ భారం కాస్తా రూ.2.58 లక్షల కోట్లకు చేరిందని అంచనా. అంతేకాకుండా ప్రభుత్వంలోని  కార్పొరేషన్‌లు, ఇతర సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.  ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులూ తక్కువ ఏమీలేవు. ఈ పరిస్థితులలో కేంద్రం సహాయ సహకారాలు తీసుకోవలసిన అవసరాన్ని జగన్మోహన రెడ్డి గుర్తించారు. ఆడంబరాలకు పోకుండా అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ దుబారా ఖర్చులను తగ్గిస్తూ ఆర్థిక శాస్త్రవేత్తలు, ఇతర నిపుణుల సలహాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇది ఓ శుభపరిణామం.
                  నవరత్నాలలో భాగమైన  ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12.50 వేల  చొప్పున 4 ఏళ్లలో 50 వేలు చెల్లించడం - వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత బోర్లు – వైఎస్ హయాంలో ఎందరో జీవితాలను నిలిపిన ఆరోగ్యశ్రీ , యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన - వృద్దాప్య ఫించన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్​ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు కుదింపు - విద్యార్థులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌తోపాటు ఏడాదికి 20 వేల స్టైఫండ్ - పేదల కోసం ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టించడం – జలయజ్ఞం - పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇచ్చే "అమ్మఒడి" పథకం,  స్వయం సహాయక సంఘాల రుణ మాఫి - దశల వారీగా మద్యపాన నిషేధం లాంటి హామీలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. వీటన్నిటితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా రైతులు, యువత, పేదలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

             2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు ఈ దేశంలో ఏ యువనేత ఎదుర్కోలేదు. తండ్రి అకాల మరణం - ఆ తరువాత రాజకీయ పరిణామాలు,  తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు - ఉప ఎన్నికలలో దాదాపు అన్ని సీట్లు గెలుపు  - అనేక కేసుల్లో ఇరికించడం జైలు జీవితం 2014 ఎన్నికల్లో ఒంటరి పోరాటం అధికారం చేజిక్కకపోయినా పట్టుదలతో పోరాటం కొనసాగింపు ప్రజా సంక్షేమ పథకాల అధ్యయనం అన్ని వర్గాల వారిని ఆకర్షించేవిధంగా నవరత్నాల రూపకల్పన రాజధాని రైతుల పక్షాల పోరాటం -ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదం పార్టీ ఎంపీల రాజీనామా - కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి పార్టీ నేతల నోటీసులు టీడీపీని ఇరుకున పెట్టడం 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక వ్యూహం బీసీలకు అధికంగా టిక్కెట్లు ఇవ్వండం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారంలో నూతన వరవడి – ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగటం - టీడీపీ వారి విమర్శలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం ...... వంటివాటితో సాగింది ఆయన రాజకీయ పోరాటం.  ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొని ఘనవిజయం సాధించారు. ముందుగా తాము ఊహించిన, ఆశించిన విధంగా తమపై ఎంతో నమ్మకంతో  అత్యధికంగా 151 శాసనసభా స్థానాలలో గెలిపించడంతో బాధ్యత పెరిగినట్లుగా జగన్ భావిస్తున్నారు. ఆ నమ్మకాన్ని చెదరనివ్వకుండా ఆరు నెలల లోపలే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకునే రీతిలో పనులు చేయాలన్న తపనతో ఆయన ఉన్నారు. తండ్రికి మించిన పట్టుదలతో ఒంటరి పోరాటం చేసి 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుని ఎదుర్కొని ఘన విజయం సాధించిన జగన్ అంతే పట్టుదలతో  ప్రత్యేక హోదా సాధించి, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని, తమకు న్యాయం చేస్తారని రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. తనకు ప్రజలు ఇచ్చిన అద్వితీయమైన మద్దతుని దృష్టిలో పెట్టుకొని  జగన్మోహన రెడ్డి సుపరిపాలన అందిస్తారని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...