May 19, 2019

ఈవీఎం, వీవీప్యాట్ల కథా కమామిషు!
          






          ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టడంతో ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అయితే ఈ ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ట్యాంపరింగ్ (దురుద్దేశంతో పాడుచేయడం) వంటి వివాదాలు చెలరేగుతున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నారా చంద్రబాబు నాయుడు వంటివారితోపాటు దేశంలోని 22 జాతీయ, ప్రాంతాయ పార్టీలు  కూడా వీటిని వ్యతిరేకించడం ఆలోచనలకు తావిస్తోంది. ప్రపంచం వ్యాప్తంగా 120 దేశాల్లో వీటిని వినియోగించడంలేదు. 20 దేశాలలో మాత్రమే వినియోగిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ రాజకీయ పక్షాలు ఈవీఎంలను విశ్వసించడంలేదు. వాటి నిర్వహణ,  వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టాలన్న ఆలోచన  భారత ఎన్నికల సంఘా(ఈసీఐ)నికి 1977లో వచ్చింది. వీటిని తయారు చేసే బాధ్యతను హైదరాబాద్ లోని భారత ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ సంస్థ(ఈసీఐఎల్)కు అప్పగించింది. పలు దశల తరువాత ఈసీఐఎల్, బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ కార్పోరేషన్(బీఈఎల్)లు కలిసి సంయుక్తంగా ఈవీఎంలను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈవీఎంలను దేశంలో మొట్టమొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రంలోని పారూర్ శాసనసభ నియోజకవర్గంలోని 50 పోలింగ్ కేంద్రాలలో ప్రవేశపెట్టారు. అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటి వినియోగానికి సంబంధించి నిర్ధిష్టమైన చట్టంలేదని ఆ ఎన్నికను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆ తరువాత వాటిని వినియోగించలేదు. 1989 ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించే విధంగా 1988 డిసెంబర్ లో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి  సవరణ చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలలో జరిగిన 25 నియోజకవర్గాల్లో వినియోగించారు. దాంతో వాటి గురించి ప్రజలకు బాగా తెలిసింది. ఆ తరువాత 1999లో 45 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 2000లో హర్యానాలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో, 2001లో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ లలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని వినియోగించారు. 2004లో లోక్ సభ సాధారణ ఎన్నికల్లో దేశంలోని 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పది లక్షలకుపైగా ఈవీఎంలను వినియోగించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ఈసీఐఎల్ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో, కట్టుదిట్టమైన భద్రత నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలకు తావులేదని ఈసీఐ పేర్కొంది. 2010లో నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేసినట్లు  తెలిపింది. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యం కానేకాదని స్పష్టం చేసింది.

         కాల క్రమంలో ఈవీఎంల ఆకృతిలో మార్పులు తీసుకువచ్చారు. వీటి వినయోగానికి సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సాంకేతికపరమైన మార్గదర్శకాలను, సూచనలను ఇస్తూ వస్తోంది. ఈవీఎంల జీవిత కాలపరిమితి 15 ఏళ్లు. 1989-90లో తయారు చేసిన ఈవీఎంలు అన్నింటిని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. నిపుణులు రూపొందించిన నిబంధనల ప్రకారం వాటిని ధ్వంసం చేస్తారు. 2010 అక్టోబర్ 4న జరిగిన అఖిల పక్షాల సమావేశంలో ఈవీఎంల వాడకంపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటి) వ్యవస్థ గురించి చర్చకు వచ్చింది. ఆ తరువాత సాంకేతిక నిపుణుల కమిటీ పలుసార్లు సమావేశమై ఈవీఎంలతోపాటు వీవీపీఏటీ వ్యవస్థకు రూపకల్పన చేశాయి. బీఈఎల్, ఈసీఐఎల్ వాటిని తయారు చేశాయి. 2011లో జమ్మూ, కాశ్మీర్ లోని లడఖ్, కేరళలోని తిరువనంతపురం, మేఘాలయలోని చిరపుంజి, తూర్పు ఢిల్లీలో, రాజస్థాన్ లోని జైసల్మేర్ లలో వీవీపీఏటీ వ్యవస్థ క్షేత్రస్థాయి పరీక్ష కోసం నమూనా ఎన్నికలు నిర్వహించారు. రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, పౌరసమాజ సభ్యులు, నిపుణుల సూచనలు, సలహాల మేరకు ఈ వ్యవస్థ రెండవ వెర్షన్ తయారు చేశారు. ఎన్నికల సంఘం ఈవీఎంలతోపాటు వీవీపీఏటీలను వాడటానికి వీలుగా 2013లో ఎన్నికల నిర్వహణా నియమాలు-1961కి సవరణ చేశారు.
ఓటర్లు తమ ఓటు తాము వేయాలనుకున్నఅభ్యర్థికి పడిందా, లేదా అనేది సరిపోల్చుకోవడానికి ఈ వీవీప్యాట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రింటర్, డిస్ప్లే యూనిట్ ఉంటాయి. ఓటరు ఓటు వేసినప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తుని వీవీపిఏటీ ఒక పేపరు స్లిప్ పై ముద్రిస్తుంది. స్క్రీన్ పైన ఆ స్లిప్ 7 సెకండ్లు కనిపిస్తుంది. ఆ తరువాత ఆ స్లిప్ కట్ అయి సీలువేసిన డ్రాప్ బాక్స్ లో పడుతుంది. నాగాలాండ్ లోని నోక్సేన్ శాసనసభ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లను వినియోగించారు. 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో, 2019లో దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వీటిని వినియోగించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో ర్యాండమ్ గా ఒక పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన  వీవీప్యాట్ స్లిప్ లను తప్పనిసరిగా లెక్కించాలన్న నిబంధన ఉంది.

ఇదిలా ఉండగా, దేశంలోని 22 రాజకీయ పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ఈవీఎంల ఓట్లతోపాటు కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. వీవీపాట్ లో 7 సెకండ్లు కనిపించవలసిన గుర్తు మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.  వీవీపాట్ స్లిప్ లను 50 శాతం లెక్కించాలంటే ఆరు రోజులు సమయం పడుతుందని, అందుకు భారీగా అదనపు సిబ్బంది కావాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది.   బ్యాలెట్‌ విధానంలో ఒక నియోజకవర్గంలో ఓట్లు లెక్కించేందుకు 16 గంటల సమయం పడుతుందని వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరు రోజులు సమయం ఎందుకు అన్న సందేహాన్ని  ప్రతిపక్షాలు  లేవనెత్తాయి. ఎన్నికల సంఘం తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకొని 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్న రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు మే 7న  తిరస్కరించింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వీవీప్యాట్‌ స్లిప్ లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్ 8న తీర్పు ఇచ్చింది.  ఆ ప్రకారం ప్రతి శాసనసభ నియోజక వర్గంలో  ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ర్యాండమ్ గా 5 పోలింగ్‌ బూత్‌లను ఎంపిక చేసి, అక్కడి వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కిస్తారు. వీవీ ప్యాట్‌ స్లిప్ ల లెక్కింపునే పరిగణనలోకి తీసుకుంటారు. 5 పోలింగ్‌ బూత్‌ల్లోని వీవీ ప్యాట్‌ స్లిప్పులకు ఈవీఎంలలోని ఓట్లకు తేడా ఉంటే,  అప్పుడు ఆ శాసనసభ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల్లోని వీవీప్యాట్‌ స్లిప్ లను లెక్కిస్తారు. ఈసీఐ చెబుతున్న ప్రకారం ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు తేడా రావడానికి అవకాశం లేదు. అందువల్ల ఈవీఎం ఓట్లతోనే ఫలితాలలో స్సష్టత వస్తుంది. పటిష్టమైన సమాచార, మీడియా వ్యవస్థ ఉన్నందున మే 23వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే, మధ్యాహ్నానికి అనధికారికంగా ఫలితాలు వెల్లడవుతాయి. అయిదు బూత్‌ల్లోని  వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించి, అధికారికంగా ఫలితాలు ప్రకటించడానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...