Apr 20, 2025

తెలుగు జాతి గర్వించదగిన నేత చంద్రబాబు


ప్రపంచంలో వస్తున్న మార్పులను ముందుగానే గమనించగలిగిన దిట్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి  తెలుగు యువత ప్రపంచం నలుచరుగులా విస్తరించడానికి అవకాశం కల్పించిన దార్శనికుడు.  చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు 1950, ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు నాయుడు యూరప్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తన 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నారావారి పల్లెకు  పొరుగునే ఉన్న శేషాపురంలో చంద్రబాబు ప్రాథమిక విద్యాభ్యాసం, చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు.  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1972లో బి.ఏ., 1974లో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. చిన్నతనంలో ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన పాఠశలకు వెళ్లిన మధ్యతరగతి జీవితపు అనుభవాలను మూటగట్టుకున్న ఓ మామూలు కుర్రాడు రాష్టానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే క్రమంలో  చంద్రబాబు ఎన్నో సంక్షోభాలు, మరెన్నో సంఘర్షణలు, సవాళ్లు ఎదుర్కొన్నారు.  

1977లో  పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు.  28 ఏళ్ల వయసులోనే  చంద్రబాబు  1978 ఫిబ్రవరి 25న జరిగిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ విజయం సాధించారు. 1978 మార్చి 15న ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన ఆయన, రెండేళ్లకే 1980 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ రకంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, నవ్యాంధ్రలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారు.  41 ఏళ్లుగా వరుసగా అసెంబ్లీలో ఉన్నారు. ఎవరికీ లేని రికార్డు ఆయనకు ఉంది.  1981, సెప్టెంబర్ 10న   ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడంతో ఆయన దశ ఉజ్వలంగా వెలిగిపోతోంది.  ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రెండు వారాలకు 1983 జనవరి 23న  చంద్రబాబు దంపతులకు  లోకేష్ జన్మించారు. 

1984 మే 27న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కర్షక పరిషత్ చైర్మన్‌గా నియామితులయ్యారు. 1985లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1989లో ఎన్టీఆర్ స్వయంగా  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు నాయుడు ఓ పక్క రాజకీయ నాయకుడిగా పార్టీని చక్కదిద్దుతూ, మరో పక్క 1992లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. 1995 ఆగస్టు సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడారు. 1995 సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ (యునైటెడ్ ఫ్రంట్) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ విధంగా ఆయన జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగిపోయారు.  రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ముగ్గురు ప్రధానుల ఎంపికలో, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపిక విషయంలో చంద్రబాబు  దేశ రాజకీయాల్లో  అత్యంత కీల పాత్ర  పోషించారు. 

1997 మార్చిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. 1999 ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.  ఆ విధంగా తన ఆలోచనల ద్వారా ప్రపంచ వ్యాపార, ఐటీ దిగ్గజాలను ఆకర్షించే స్థాయికి ఎదిగారు. 1998 మార్చి 19న చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఎన్డీఏ ఏర్పాటైంది. 

1999 జనవరి 26లో ‘ఆంధ్రప్రదేశ్ విజన్: 2020’ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన దార్శనిక పత్రం ఫలితమే సైబరాబాద్ ఏర్పాటు. ఆ తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయింది.  1999 అక్టోబర్ 25న చంద్రబాబు అధ్యక్షతన స్వర్ణాంధ్రప్రదేశ్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో, ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళ్ళే సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ, అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.

2014లో రాష్ర్టం విడిపోయిన తర్వాత, నవ్యాంధ్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జనసేనలను కలుపుకుని ఘనవిజయం సాధించారు. 2014 జూన్‌ 8న  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2015 మార్చి 30న దేశంలో మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు 'పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు'కు శంకుస్థాపన చేశారు. 2015 సెప్టెంబర్ 17న  కృష్ణా - గోదావరి నదుల పవిత్ర సంగమం జరిగింది. 2015 అక్టోబరు 22న  ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.  పాలనలో భరోసాకు మరో పేరు, దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన చంద్రబాబు నాయకత్వంలో 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. దాంతో చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ, పేదరికం లేని సమాజ నిర్మాణంలో భాగం పీ4 విధానాన్ని ప్రకటించి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 

పరిపాలనా దక్షతతో అనేక సంస్కరణ తీసుకువచ్చిన చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నేతగా పేరుఘడించారు. 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24వ తేదీని 'నాయుడు డే'గా ప్రకటించారు.   ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబును 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం'గా పేర్కొంది. ఎకనామిక్ టైం వార్తా సంస్థ 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది.  అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ మాస పత్రిక 'ప్రాఫిట్' చంద్రబాబును 'హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్‌లో ఒకరు' అని పేర్కొంది. బీబీసీ కూడా 'సైబర్ సావీ చీఫ్ మినిస్టర్' అంది. సిఎన్ఎన్ వార్త సంస్థ ‘సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని పేర్కంది.  టైమ్ ఆసియా సంస్థ 'సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్ 1999' అవార్డును చంద్రబాబుకు ప్రకటించింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టోంగ్... తదితరులు భారతదేశానికి వచ్చినప్పుడు తమ షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమవడాన్ని తప్పనిసరి చేసుకుంటారు.  

2003 జూన్ 26న ‘ప్రజాస్వామ్యంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ-పరిపాలన’ అనే అంశాలపై ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగువారు గర్వించదగ్గ ఇంతటి మహానేత చంద్రబాబు నాయుడు  “అదృష్టాన్ని నేనెప్పుడూ నమ్ముకోలేదు. నా కష్టాన్నే నమ్ముకున్నాను” అని స్పష్టంగా చెప్పారు. అదే మనకు ఆదర్శం కావాలని ఆశిస్తూ, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు.

- శిరందాసు నాగార్జు, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...