Apr 28, 2025
‘కాఫీవిత్ రజా హుస్సేన్’ సాహిత్య ఎపిసోడ్స్ 2000 పూర్తి
మంగళగిరి: ఫేస్‌బుక్‌లో ధారావాహికంగా రాస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత, విశ్రాంత అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రజా హుస్సేన్ సాహితీ కాలమ్ ‘కాఫీ విత్’ 2000 ఎపి సోడ్‌లు దాటిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం రాత్రి అభినందన సభ జరిగింది. పాత మంగళగిరిలోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో (లక్ష్మీ శారీస్ మిద్దె పైన) విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు ఆధ్వర్యంలో ‘ ఓ కప్పుకాఫీ..నాలుగు మంచి మాటలు అంతే’’ అని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫేస్ బుక్ మాధ్యమంగా తెలుగు సాహితీ లోకానికి కాఫీ విత్ శీర్షికతో 2000 సాహితీ, కళా విమర్శలు అందించడం ఓ అరుదైన రికార్డ్. రజా హుస్సేన్ స్వగ్రామంలో ఆయన మిత్రులు, సహా ఉద్యోగులు, శిష్యులు, సాహిత్య అభిమానుల సమక్షంలో ఈ సభ జరగడం విశేషం. ప్రముఖ అభ్యుదయ కవి, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షత వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ షేక్ బాషా మాట్లాడుతూ, జర్నలిజంలో రజా హుస్సేన్ తనకు మార్గదర్శి అన్నారు.
వార్తలు ఎలా రాయాలో తాను రజాహుస్సేన్ దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. ఒక వార్తను అందరూ రాస్తారు గానీ, ఇన్ సైడ్ విశేషాలను కూడా సేకరించి వార్తలను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో రజా హుస్సేన్ దిట్ట అన్నారు. ఆ రోజుల్లో రజా హుస్సేన్ వార్తలు సంచలనం కలిగించాయని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీలో కమ్యూనిస్టు ప్రతినిధులు లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఆయన చెప్పారు. కాఫీవిత్ శీర్షికలో 2000 కవితలను విశ్లేషించడం సాహిత్య చరిత్రలోనే సరికొత్త రికార్డని, ఈ శీర్షిక వల్ల ఎందరో కొత్తకవులను సాహితీలోకానికి పరిచయం చేసిన ఘనత రజా హుస్సేన్ కే దక్కుతుందని అభ్యుదయకవి గోలి మధు అన్నారు. ఒక్క ఏడాదిలో వెయ్యి ఎపిసోడ్లు రాయడం చిన్న విషయంకాదని, అదీ సెల్ ఫోన్లోనే టైప్ చేసి పోస్ట్ చేస్తుండటం విశేషమన్నారు. రజా హుస్సేన్ సరళమైన భాషలో రాసిన సాహిత్యం ద్వారా ప్రజా హుస్సేన్ ఖ్యాతి పొందారన్నారు. బోధి రేఖా కృష్ణార్జునరావు మాట్లాడుతూ, రజా హుస్సేన్ ది కులమతాలకు అతీతతమైన వ్యక్తిత్వమన్నారు. ఎందరో కవులను, రచయితలను అన్వేషించి వారందరినీ కాఫీవిత్ శీర్షికలో ప్రస్తావించారన్నారు. ఇప్పుడు ‘కళల సిరి.. మంగళగిరి’ అనే పుస్తకాన్ని తెస్తున్నారని తెలిపారు.
మే నెల 12న మంగళగిరి రాయల్ కన్వెన్షన్ హాలులో జరగబోయే బుద్ధపూర్ణమ సభలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. పొట్లాబత్తుని లక్ష్మణరావు మాట్లాడుతూ…రజా హుస్సేన్ వల్ల మంగళగిరిలో సాహితీ పరిమళాలు వ్యాపిస్తున్నాయని, ఆయన సరళమైన శైలికి చదివించే గొప్ప గుణముందన్నారు. మంగళగిరిలోని తనలాంటి కళాకారులెందరినో ఈ శీర్షికద్వారా సాహితీలోకానికి పరిచయంచేసిన ఘనతరజాహుస్సేన్ కే దక్కుతుందన్నారు.గాయకులు, కమ్యూనిస్టు నాయకులు కంచర్ల కాశయ్యమాట్లాడుతూ.. రజాహుస్సేన్ వల్ల తాను లోకానికి తెలిశానన్నారు. మట్టిలో మాణిక్యాలనుగుర్తించి, సానబట్టి సాహితీలోకానికి పరిచయం చేయడం చిన్నవిషయం కాదన్నారు. గాయకుడు అల్లక తాతారావు మాట్లాడుతూ… భక్తి పాటలు పాడుకునే తనకు కాఫీవిత్ ద్వారా సాహితీలోకంలో కొత్తజీవితాన్ని ప్రసాదించారని రజాహుస్సేన్ కు కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత చరిత్రోపన్యాసకులు ఆళ్ల వెంటక స్వామి మాట్లాడుతూ, రజాహుస్సేన్ డిగ్రీకళాశాలలో తన కొలీగ్ అన్నారు. కష్టేఫలి అన్నట్లు తన కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్న రజాహుస్సేన్ కృషీవలుడని అన్నారు. తన చదువుకు తగ్గట్టు కృషినికొనసాగించడమే రజాహుస్సేన్ విజయరహస్యమన్నారు.
సీనియర్ పాత్రికేయుడు, రజా హుస్సేన్ శిష్యుడు శిరందాసు నాగార్జున మాట్లాడుతూ, మంగళగిరి వీటీజేఎం డిగ్రీ కాలేజీలో రజా హుస్సేన్ తెలుగు అధ్యాపకులుగా పని చేసే సమయంలో తను, తన భార్య ఇద్దరం ఆయన శిష్యులమని తెలిపారు. రాతలో సరళత ఆయన రచనల్లో కనిపిస్తుందన్నారు. సాహితీ లోకలంలో ఎదుగుతున్నవారిని గుర్తించి, వారిని వెలుగులోకి తేవడం రజాహుస్సేన్ దిట్ట అన్నారు. అలాగే, సాహిత్యాన్ని, కేంద్ర సాహిత్య అకాడమీ తీరుని, రాష్ట్ర ఉగాది పురస్కారాల గ్రహీతల ఎంపిక తీరుని నిర్మోహమాటంగా తీవ్ర స్థాయిలో విమర్శించారని గుర్తు చేశారు. మంగళగిరి టైమ్స్ పాత్రికేయుడు అవ్వారు శ్రీనివాసరావు మాట్లాడుతూ రజా హుస్సేన్ ను తాను అన్నయ్య అంటూ పిలుస్తానని చెప్పారు. తనకుఆయన మార్గదర్శి అన్నారు.
కౌతరపు ప్రసాద్ మాట్లాడుతూ రజాహుస్సేన్ మెత్తగా రాసినా, లోతైన విశ్లేషణ చేస్తారన్నారు.తనను అభినందించిన అందరికీ రజా హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను పుట్టిపెరిగిన ఊళ్ళో, ఇలా 40 యేళ్ళ తర్వాత మళ్ళీ మిత్రులతో కలిసి కాఫీతో ఆనందం పంచుకోవడం కిక్కెక్కించే విషయమన్నారు. మంగళగిరి తనకు జన్మనివ్వడమే కాకుండా, బతకడానికి నాలుగు అక్షరాలు కూడా నేర్పిందని చెప్పారు. ఇక్కడే చదువుకొని, ఇక్కడి డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసే అవకాశం కల్పించిందన్నారు. ఎన్ని జన్మలెత్తి తాను పుట్టినూరు రుణం తీర్చుకోగలను! అని కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్‌బుక్‌లో గత 10 సంవత్సరాలుగా వేలాది వ్యాసాలు, ఆర్టికల్స్ రాశానన్నారు. అంతకు ముందు శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాధుల బాబూ శివప్రసాద్ శాలువతో రజా హుస్సేన్ సన్మానించారు.
యునెస్కో క్లబ్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సమన్వయకర్త రామనాధం పరమేశ్వర రావు రజా హుస్సేన్‌కు మహాత్మా గాంధీ బొమ్మ ఉన్న నాణెం బహూకరించారు. అంతకు ముందు పొట్లాబత్తుని లక్ష్మణరావు, కంచర్ల కాశయ్య, అల్లక తాతారావు, కౌతరపు కవిత, భూపతి, బాలకృష్ణ, రామచంద్రరావు, పాటలు పాడి, ఇవటూరి ప్రసాదరావు ఓ పద్యం పాడి సభికులను అలరించారు. కాఫీతోపాటు భోజన ఏర్పాటు కూడా చేసిన సభ నిర్వాహకులు పొట్లాబత్తుని లక్ష్మణరావు సభలో ముగింపు మాటలు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment