Apr 26, 2025

మహామహుల మేధో నిలయం- ఆంధ్రవిశ్వవిద్యాలయం

అక్షర క్రమంలో ద్వితీయమైనా, అద్భుతమైన ఆవిష్కరణతో అద్వితీయ ప్రతిభా పాటవాలకు ఆలవాలం ఆంధ్రవిశ్వవిద్యాలయం. సాంస్కృతిక రాజధాని గాను, కళల కాణాచి గాను ప్రపంచపు దృష్టిని ఆకర్షించిన విశాఖ నగర సిగలో ఆణిముత్యం గా విరాజిల్లుతున్న విద్యల కోవెల ఆంధ్రవిశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదేమో!

ఎందరో మేధావుల్ని ప్రపంచానికి అందించిన సర్వ శాస్త్రాల సమాహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారం.. వాస్తవానికి విశ్వవిద్యాలయమని వ్యవహరించాల్సి వున్నా, కళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పమే విశ్వవిద్యాలయాన్ని 'విశ్వకళా పరిషత్తు'గా మలచడం వెనుక గొప్ప నేపధ్యమే ఉంది.. వ్యవస్థాపక ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డికి సాహిత్యం, సంగీతం, లలితకళ లంటే ఎక్కువ మక్కువ. 'ముసలమ్మ మరణం' వంటి సంచలన నవల సీ ఆర్ రెడ్డి కలం నుంచి ఉద్భవించిన రచనే.. వసుధా రచయిత కావడం, కళల పట్ల ఉత్తమాభిరుచి ఉండడం వల్ల విశ్వకళాపరిషత్తుగా పేరును ఖరారు చేశారు.. ఇందుకు ఎందరో కవులు, కళాకారుల సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. పేరుకు తగ్గట్టుగానే తొలి విభాగం 'తెలుగు' కావడం ఎందరో ప్రశంసలు అందుకుంది..భాషాసంయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలుగు విభాగం మరింత విశిష్టత సంతరించుకుంది.. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవికోకిల గుర్రం జాషువా, ఆధునిక జాషువా గా ప్రసిద్ధి గాంచిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రముఖ భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి, ఆచార్య దోణప్ప,ఆచార్య ఎస్వీ జోగారావు తదితర ఉద్దండులు తెలుగు విభాగం ప్రసాదించిన ప్రముఖులే కావడం విశేషం..
ఇక శాస్త్ర సాంకేతిక రంగాలలో విశ్వవిఖ్యాతి గాంచిన ఎందరో శాస్త్రవేత్తలు ఆంధ్ర కళామతల్లి బడిలో చదివి,ఒడిలో పెరిగిన వారే.. వారిలో ప్రొఫెసర్ సూరి భగవంతం (ఫిజిక్స్ ), ఆచార్య జ్ణానానంద (న్యూక్లియర్ ఫిజిక్స్) ఆచార్య సీ. మహదేవన్ (జియోలజీ) ఆచార్య టీ ఆర్ శేషాద్రి (కెమిస్ట్రీ),ఆచార్య బీ. రామచంద్రరావు( స్పెస్ఫిజిక్స్),ఆచార్య సీ ఎస్ రావు (స్టాటిస్టిక్స్),ఆచార్య సి.వీ. రామన్,(ఫిజిక్స్) ఆచార్య ఆర్. రంగదామరావు (మెటీరియాలజీ),ఆచార్య రామనాధం వంటి దిగ్గజ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో రాణించారు.. ఆయా రంగాలలో అనేక ఆవిష్కరణలు చేసి ఆంధ్ర విశ్వకళామతల్లి ఖ్యాతిని దశ దిశలా విస్తరింపచేశారు.. నోబెల్ ,భట్నాగర్ అవార్డులతో సహా ఎన్నెన్నో రివార్డులు కైవసం చేసుకున్నారు.. ఉపగ్రహ ప్రయోగాల వ్యవస్థ (ఇస్స్రో )లోను మన శాస్త్రవేత్తలు ఉన్నారంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఔన్నత్యాన్ని కొలిచేందుకు సాధనాలే లేవని చెప్పవచ్చు.. దేశ సమాచార వ్యవస్థకు కేంద్రబిందువు గా పరిగణించే 'నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్'(నిక్ నెట్, న్యూఢిల్లీ)లోను డజన్ల సంఖ్యలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదివిన శాస్త్రవేత్తలు ఉండడం గర్వకారణమే కదా.. వీరితో పాటు పాలనా పరంగానూ ఎందరో మేధావుల్ని అందించిన ఘనత ఆంధ్రవిశ్వవిద్యాలయానిదే.. ఇక్కడ చదివిన ఎందరో ఆచార్యులు దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా వెళ్లడం సర్వ సాధారణ విషయంగా మారింది.. ఐ ఐ టీ లతో పాటు అనేక కేంద్రీయ విద్యాలయాలకు సైతం ఉప కులపతులుగా నియామకం కావడం సంతోషించాల్సిన విశేషమే మరి..వీరితో పాటు ఎందరో ఐ ఏ ఎస్ లు, ఐ పీ ఎస్ అధికారులు సైతం ఇక్కడ చదివి, తమ పదవుల్లో రాణించడం చెప్పుకోదగ్గ అంశమే..
కళలకు రూపం-కళాకాంతుల'విశ్వరూపం'
దేశంలోనే తొలిసారిగా విశ్వవిద్యాలయ స్థాయిలో 'రంగస్థల'(థియేటర్ ఆర్ట్స్), విభాగం ప్రారంభమయింది ఇక్కడే.. నటన, దర్శకత్వం లో డిప్లొమా కోర్సులు నిర్వహించిన ఘనత శ్రీ కే వీ గోపాలస్వామి గారిదే.. వారి పేరుతోనే ఆరుబయలు రంగస్థల వేదిక (ఓపెన్ ఎయిర్ థియేటర్)ను ఏర్పాటు చేశారు.. ఆ వేదిక మీద ప్రదర్సన చేయడం ఒక మహదవకాశంగా భావించేవారు.. కానీ అది ఒకప్పటి మాట.. ఇప్పడు దాని స్వరూపమే మార్చేశారు.. అదనపు హంగుల పేరుతో లేనిపోని రంగులు అద్ది ప్రదర్శనకు ఉపయోగించే వీలు లేకుండా చేయడం శోచనీయం.. సంగీతం, నృత్య విభాగాలు కూడా ఆంధ్రవిశ్వకళాపరిషత్తు సొంతం.. ఆచార్య పద్మశ్రీ నేదునూరి కృష్ణ మూర్తి వంటి కళాస్రష్టల నేతృత్వంలో ఏర్పాటైన సంగీత విభాగం ఆరు కచేరీలు,నృత్య విభాగం మూడు ఆరంగేట్రాలతో విలసిల్లు తున్నాయి..ఇక ఆంధ్రవిశ్వకళాపరిషత్తుకు మరో మణిమకుటం 'లలిత కళల'(ఫైన్ ఆర్ట్స్) విభాగం.. ప్రపంచస్థాయి చిత్రకారుల్ని రూపొందించిన విభాగం ఇది..భారత పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం రూపశిల్పి ఈ విభాగపు ఆచార్యుడు, దివంగత రవిశంకర్ పట్నాయక్.. అది మనకు గర్వకారణమే కదా..
ఘన చరిత్రలో తనకంటూ ఎన్నో పేజీలను లిఖించుకున్న ఆంద్రావిశ్వకళామ తల్లి రాజకీయ ప్రముఖులకు సైతం జన్మ నిచ్చింది.. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్తు అధ్యక్షులు పద్మ విభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ,శ్రీ స్టాలిన్ ,ఉత్తమపార్లమెంటెరియన్లుగా పేరు గడించిన ఎంవీఎస్ మూర్తి, కింజరాపు యర్రం నాయుడు పాటు మంత్రులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు ఇంకా ఎందరో ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చిన వారే..
మహామహులకు జన్మనిచ్చిన మన 'న్యాయ కళాశాల'
1945సంవత్సరం లో పురుడు పోసుకున్న న్యాయకళాశాల దేశానికి ఎందరో న్యాయమూర్తులను మన దేశ న్యాయవ్యవస్థ కు అందించింది. కొందరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు గాను, ఇంకొందరు హైకోర్టు న్యాయమూర్తులు గాను గొప్ప సేవలందించారు.. భారత దేశ ఎన్నికల సంఘానికి చీఫ్ కమీషనర్ గా విధులు నిర్వహించి, ఆ రాజ్యాంగ పదవికే వన్నె తెచ్చారు జీ వీ జీ కృష్ణ మూర్తి.. వారు చదివిందీ మన న్యాయకళాశాలలొనే.. 'బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 'చైర్మన్ గా సేవలందించిన దివంగత డీ వీ సుబ్బారావు ఈ చదువుల తల్లి ముద్దుబిడ్డడే.. అంతేకాదు, 'అంతర్జాతీయ లా కమీషన్' సభ్యులు గా ప్రపంచ గుర్తింపు పొందిన పి. ఎస్. రావు కూడా మన లా కళాశాల పూర్వ విద్యార్ధే.. ప్రతిష్టాత్మక భారత దేశపు పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ (సభాపతి )గా రాణించిన దివంగత జీ ఎం సీ బాలయోగి సైతం ఇక్కడ చదివి అంత పెద్ద స్థాయికి ఎదిగిన ఆణిముత్యమే.. ఇంకా జస్టిస్ కే. రామస్వామి, జస్టీస్ అమరేశ్వరి, జస్టిస్ ఐ. పాండురంగారావు, జస్టిస్ ఎన్డీ పట్నాయక్, జస్టిస్ పీ. రామకృష్ణ రావ్, ..ఇంకా మరెందరో న్యాయ నిపుణులు, న్యాయ మూర్తులు ఈ చదువుల తల్లి ఒడిలో పెరిగి పెద్దయిన వారే..
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం,వ్యావహారిక భాషా ఉద్యమం తో పాటు అనేక ఉద్యమాలకు పురుడు పోసిన రణక్షేత్రం ఆంధ్రవిశ్వవిద్యాలయం..మహోన్నత ఆశయాలు, మహత్తర లక్ష్యాలతో తొలి విశ్వవిద్యాలయంగా ఆరంభమై, అంచలంచలుగా ఎదిగి నూరేళ్ళ సంబరాలకు ఉవ్విళ్లూరుతున్న చదువుల తల్లి వందేళ్ల పండుగ ఆరంభోత్సవానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ని కానీ, రాష్ట్రాధినేత ముఖ్యమంత్రిని కానీ, కనీసం విద్యాశాఖ మంత్రిని కానీ ఒప్పించి, రప్పించలేకపోవడం వెలితిగానే భావించాలి..ఇంత గొప్ప చదువుల తల్లి సంబరాలను ఇలా సాదా ,సీదాగా నిర్వహించదలచడం వర్సిటీ వైభవాన్ని విస్మరించడం గా పరిగణించాలని అభిమానులు వాపోవడం సమంజసమని గ్రహించాలి..ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధునామూర్తి ముఖ్య అతిథిగా రావడం కొంతలో కొంతైనా ఊరటనిచ్చే అంశం..
కొసమెరుపు: వివిధ రంగాలలో ప్రావీణ్యం కనబరిచిన ప్రసిద్ధులను 'కళాప్రపూర్ణ'(గౌరవ డాక్టరేట్)తో సత్కరించటం యూనివర్సిటీ సాంప్రదాయం గా వస్తోంది.. ఈ కోవలో 'వేయిపడగల' విశ్వనాధ సత్యనారాయణ గారికి కళాప్రపూర్ణ ఇచ్చిన చాలా కాలానికి గుర్రం జాషువా గారికి కూడా ప్రదానం చేశారట.. ఓసారి పూర్వ విద్యార్థుల సమావేశానికి ఈ ఇద్దరు ప్రముఖులు హాజరయ్యారు.. విశ్వనాధ మాట్లాడుతూ "ఈ మధ్య కాలంలో గుర్రాలు, గాడిదలకు కళాప్రపూర్ణ లు ఇస్తున్నారు" అని వెటకరించారట! దానికి గుర్రం జాషువా గారు "అవును!నిజమే!సుమీ గాడిదలకు ముందుగా ఇచ్చి గుర్రాలకు తరువాత ఇవ్వడం అపచారమే కదా" అని దీటుగా చమత్కరించారట !! మేధావులు ఢీ కొంటే ఇలానే ఉంటుంది మరి!!
(ఏప్రిల్16, ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వందేళ్ల పండుగ ఆరంభ సూచకంగా)
ఆచార్య పీటా బాబీ వర్ధన్,
జర్నలిజం విభాగపు పూర్వాధి పతి & డీన్
మీడియా విశ్లేషకులు,ఆంధ్ర విద్యాలయం.

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...