Apr 20, 2025

పేదరికంలేని సమాజసృష్టే చంద్రబాబు లక్ష్యం

నేడు 75వ పుట్టినరోజు - వజ్రోత్సవం 

దేశం, రాష్ట్రం అభివ‌ృద్ధి, పేదరికం లేని సమాజ సృష్టి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు లక్ష్యం. తన  47 ఏళ్ల రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా 15వ ఏట కొనసాగుతున్న  చంద్రబాబు ఈ రోజు తన 75వ పుట్టినరోజు (వజ్రోత్సవం) వేడుకలను కుటుంబ సభ్యులో యూరప్‌లో జరుపుకుంటున్నారు.   సమర్థవంతమైన రాజకీయ నేతలు రాజకీయాల్లో విజయం సాధించడంతోపాటు పరిపాలనా సామర్థ్యం కలిగి ఉండి, ఆర్థిక వ్యవస్థను క్రమపద్దతిలో పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించడం  ముఖ్యంగా భావిస్తారు. ఈ మూడు లక్షణాల్లో  చంద్రబాబు తన సమర్థతను ప్రదర్శించి,  శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఆర్థిక అంశాలపై అవగాహన ఉండాలి. దేశ, విదేశాల్లోని ఆర్థిక సంస్థల నుంచి ఎంతైనా అప్పు తేవచ్చు. అయితే తీసుకువచ్చిన డబ్బుని సమర్థవంతంగా వినియోగించి (మనీ మేనేజ్ మెంట్) ఫలితాలను సాధించాలి. ఆర్థిక వ్యవస్థను అద్వితీయమైన రీతిలో చక్కదిద్దటంలో  దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నారు. సంస్కరణలు, సరళీకరణ విధానాలతో ఆర్థిక వ్యవస్థను అద్భుతమైన రీతిలో చక్కదిద్దడంలో చంద్రబాబు  దిట్ట. సంక్షోభాల్ని సవాలుగా తీసుకుని  ముందుకు వెళ్లడం ఆయనకున్న ప్రధాన లక్షణం. ఆధునికతను అందిపుచ్చుకుని, అటు ఐటీ, ఇటు పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించడంలో, సంపదను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.   పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆయన  స్వర్ణా ఆంధ్ర@2047లో భాగంగా ఆయన ఇప్పుడు  జీరో పావర్టీ - P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) విధానాన్ని రూపొందించారు.  ఈ విధానంలో మార్గదర్శులు (ఆర్థికంగా సంపన్నులు) బంగారు కుటుంబాల(పేదలు)ను ఆదుకుంటారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.  


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని అందరికంటే ముందుగా గ్రహించి,  ఐటీకి  విశేష ప్రాధాన్యతనిచ్చి లక్షలాది మంది యువతకు బంగారు భవిష్యత్తు కల్పించారు. అన్ని సామాజిక రుగ్మతలకు విరుగుడు ‘విద్య’ ఒక్కటే అని నమ్మి,  ప్రాథమిక విద్య మొదలుకొని సాంకేతిక ఉన్నత విద్య వరకు ఎనలేని ప్రోత్సాహం కల్పించారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ నిపుణులుగా తెలుగువారు ఉండటానికి మూల కారణం చంద్రబాబు. ఇది అందరూ అంగీకరించే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే  చంద్రబాబు నాయుడు ఆధునికతలో దార్శనికులు. సమాజంలో సంపద సృష్టించడంలో ఆరితేరిన ఆర్థిక నిపుణుడు. 

చంద్రబాబు నాయుడు 28 ఏళ్లకే 1978లో మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే, వెంటనే మంత్రి అయ్యారు. ఇక రాజకీయాలలో  తిరిగి చూడనేలేదు.అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయంగా ఎదిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు(9 సంవత్సరాలు), నవ్యాంధ్రకు రెండు సార్లు, మొత్తం నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.  పరిపాలనా దక్షుడిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో  రాజకీయ సమీకరణలను తనకు అనుకూలంగా అత్యద్భుతంగా  మలచుకొని 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువగా వచ్చే ప్రాంతాన్ని ఏపీగా విభజించి, రాజధాని లేని, నిండా అప్పుల్లో మునిగిన ఏపీని అప్పగించారు. అయినా,  చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ఒక పక్క నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి,  మరో పక్క వినూత్నమైన రీతిలో అభివృద్ధి వ్యూహాలను అనుసరించి సమ్మిళిత వృద్ధి సాధించారు.నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి  భూ సమీకరణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. వేల ఎకరాలు సమీకరించడం మాటలుకాదు. అంత భూమిని రైతులు ఇవ్వడానికి అంగీకరించరు. ఒకవేళ అంగీకరించినా అసలే లోటుబడ్జెట్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అవకాశం ఇవ్వదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనదైన తీరులో స్పందించారు. పూలింగ్ ద్వారా భూ సమీకరణ విధానం అతని ఆలోచనే. రైతులకు సమన్యాయం అందించే విధంగా  ఓ కొత్త విధానం మన రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు 25 రెవెన్యూ గ్రామాల (29 గ్రామాలు)కు చెందిన 25,871 మంది రైతులు 32,513 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇంత భూమి ఈ విధంగా సమీకరించలేదు. స్వచ్ఛందంగా కూడా ఇలా ఇంత భూ సమీకరణ చేయవచ్చని చేసి చూపించి చంద్రబాబు ఓ కొత్త వరవడి సృష్టించారు. 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు తన సమర్థతతో దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టినా, 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులుపెట్టినా, జైల్లో పెట్టినా పడిలేచిన కెరటంలా చంద్రబాబు మళ్లీ దూసుకొచ్చారు. సంక్షోభాలను ఎదుర్కోవడం ఆయనకు కొత్తేమీకాదు. తనదైన రాజకీయ వ్యూహాలతో  మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.   రాజధాని అమరావతిలో  అర్థంతరంగా  నిలిపివేసిన నిర్మాణాలను కొనసాగించడానికి పూనుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రాజధాని అమరావతి నిర్మాణ పనులను మే 2న పున:ప్రారంభిస్తారు.  అమరావతిని అన్ని హంగులతో ఓ అద్వితీయమైన మహానగరంగా రూపొందించడానికి  తుళ్లూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరి ప్రాంతాల్లో మరో 44 వేల ఎకరాల భూ సేకరించాలన్న ఆలోచనలో  చంద్రబాబు ఉన్నారు.    అపార రాజకీయ, పాలనా  అనుభవంతో  చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిద్దాం. చంద్రబాబుకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్  - 9440222914

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...