
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు ఉద్యోగ జీవితం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచే ప్రారంభమైంది. అలాగే, ఆయన మనవడు నారా లోకేష్ రాజకీయ జీవితం కూడా మంగళగిరి నుంచే ప్రారంభమైంది. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం చేశారు. 1947లో ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి అయిన తర్వాత, మద్రాసు సర్వీసు కమిషన్ నిర్వహించిన పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఏడుగురిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ ఏడుగురిలో ఎన్టీఆర్ ఉన్నారు. ఆ విధంగా ఆయనకు అప్పుడు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది.ఆయన దేసంతా సినిమాలపై ఉండటంతో ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేదు. ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లో నటించేందుకు వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1986 ఏప్రిల్ 9న మంగళగిరిలో ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేసి, తన హయాంలోనే పూర్తి చేయించారు. ఎన్టీఆర్ హయాంలోనే మంగళగిరి సమీపంలోని చిన్న కాకానిలో యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు యార్లగడ్డ వెంకన్న చౌదరి రూ. 30 లక్షల విరాళమిచ్చారు. అందుకే దీనికి ఆయన పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిని యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆంకాలజీ లివింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గా మార్చారు. 1989లో ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఏర్పడినప్పుడు మొదటి గ్రంథాలయాన్ని ఎన్టీఆర్ మంగళగిరిలోనే ప్రారంభించారు. ఈ విధంగా ఎన్టీఆర్‌కు అనేక విధాల మంగళగిరితో అనుబంధం ఉంది.



ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కుమారుడు, ఆయన మనవడు నారా లోకేష్ రాజకీయ జీవితానికి పునాది పడింది ఇక్కడే. ఆయన 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి అయినప్పటికీ, 2019 ఎన్నికల్లో లోకేష్ మొదటిసారిగా మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనుకోకుండా ఎన్నికలకు 20 రోజుల ముందే ఆయన ఇక్కడ పోటీచేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. తక్కువ సమయం ఉండటం వల్ల, ఆ ఎన్నికల్లో ఆయన 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఏమాత్రం జంకకుండా, మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరి ప్రజలనే నమ్ముకున్నారు. ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గంలో 29 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు చేరువయ్యారు. ముఖ్యంగా మంగళగిరిలో పద్మశాలీ సామాజిక వర్గానికి చేనేత కార్మికుల సంఖ్య అధికం. ఆ సామాజిక వర్గంవారే ఇక్కడ అంతకు ముందు నాలుగుసార్లు గెలిచారు. వారి సంక్షేమం, ఉపాధి కోసం అనేక చర్యలు చేపట్టారు. అలాగే, పేదల కోసం, మహిళల కోసం విద్య, వైద్యం, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, అన్న క్యాంటిన్.. వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు. ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో పని చేశారు. అలాగే, పాదయాత్ర ద్వారా యువశక్తిని కూడగట్టారు. 2024లో ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలోనే లోకేష్ పోటీ చేశారు.5,337 ఓట్ల తేడాతో ఓడిపోయినందున, 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించమని ఆయన కోరారు. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తానని తండ్రి చంద్రబాబు నాయుడుకు చెప్పారు. కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు ఏకంగా 91,413 ఓట్ల మెజార్టీలో గెలిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల కంటే అధిక మెజార్టీ సాధించారు. మెజార్టీలో రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిపారు. రేపు ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలే నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని కూడా చేస్తారు. 39 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీకి విజయాన్ని చేకూర్చారు. గతంలో 1983, 1985లో రెండు సార్లు మాత్రమే, అదీ ఎంఎస్ఎస్ కోటేశ్వరారావు గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ టీడీపీ గెలవలేదు.

ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా లోకేష్ ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఆ దిశగానే చర్యలు కొనసాగుతున్నాయి. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమం చేపట్టి పేద ప్రజల చిరకాల కలని నిజం చేశారు. పేదలు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారో, అక్కడే వారిని శాశ్విత హక్కుపట్టాలు అందజేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తిపై మూడు వేల మందికి శాశ్వత హక్కును కల్పించారు. జీరో పావర్టీ -పీ4 విధానాన్ని కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ప్రారంభించి, మొదటి బంగారు కుటుంబాలను కూడా ఇక్కడివారినే ఎంపిక చేశారు. మంగళగిరి ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆస్పత్రికి ఈరోజు నారా లోకేష్ శంకుస్థాపన చేస్తారు.
ఇది కూడా తాత ఎన్టీఆర్‌తో ముడిపడిన విషయం. 1986 ఏప్రిల్ 9న మంగళగిరిలో ప్రభుత్వ హాస్పిటల్‌కి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు.39 ఏళ్ల తర్వాత అదే ఆస్పత్రిని నారా లోకేష్ మంత్రి మండలిని ఒప్పించి వంద పడకల ఆస్పత్రిగా పెంచారు. తాత ఎన్టీఆర్ చిన్నకాకానిలో ఏ నెలలో, ఎక్కడైతే యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారో, అదే ప్రదేశంలో, అదే ఏప్రిల్ నెలలో ఈరోజు వంద పడకల ఆస్పత్రికి నారా లోకేష్ శంకుస్థాప చేస్తారు. అయితే, బాధాకరమైన విషయం ఏమిటంటే, మంగళగిరి నియోజకవర్గం బీసీలు, ముఖ్యంగా చేనేత వర్గం పద్మశాలీల చేయిజారిపోయింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కూటమి ప్రభుత్వం వారిలో పలువురికి నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఆ రకంగా వారికి న్యాయం జరుగుతోంది. అలాగే, వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రిని కూడా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలే ఎన్నుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment