వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే చేనేత రంగానికి ఏపీలో మహర్దశ పట్టనుంది. అనేక ఆటుపోట్లకు తట్టుకుని దేశ వారసత్వ సంపదగా చేనేత నిలిచింది. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత వస్త్ర పరిశ్రమ రాష్ట్రంలో మళ్లీ కళకళలాడే పరిస్థితి రానుంది. చేనేత కార్మికుల చిరకాల డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నాయి. అటు కేంద్రంలోని ఎన్‌డీఏ(జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టిపెట్టాయి. ఎన్నికల హామీ మేరకు రోజుకో వరాన్ని ప్రకటిస్తున్నాయి. అలాగే, చేనేత కార్మిక సంఘాల డిమాండ్లను కూడా పరిగణలోని తీసుకుని చేనేత కుటుంబాల సంక్షేమం కోసం అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ మంత్రి మండలి ఆమోదించింది. దీంతో, 93 వేల చేనేత కుటుంబాలకు, 10,534 మరమగ్గాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది. మర మగ్గాలపై కూడా చేనేత రంగానికి చెందిన కార్మికులే వస్తాలను తయాలు చేస్తారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.96.76 కోట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చు రూ.28.16 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది. చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, బీపీఎల్ (దారిద్ర్యరేఖకు దిగువన) కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కాకుండా, చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.50 వేల ఆర్థిక సహకారం అందజేస్తామని ఇంతకు ముందే ప్రకటించింది. ముడిపదార్థాల సరఫరా పథకం కింద నూలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ చేనేత ఉత్పత్తులపై విధించే జీఎస్‌టీని తిరిగి చెల్లించేందు( రీయింబర్స్‌మెంట్) రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ, కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం క్లస్టర్ల విధాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి. ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా కేంద్రం రూ.5 కోట్లు విడుదల చేసింది. మిగిలినవాటికి మరో రూ.2 కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో రెండు వేలమంది చేనేత కళాకారులకు లబ్ధి కలుగుతుంది. కూటమి ప్రభుత్వం రాయదుర్గంలోని టెక్స్‌టైల్ పార్కుని అభివృద్ధి చేయడంతోపాటు మంగళగిరిలో తమిళనాడులోని కంచి తరహాలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మంగళగిరిలోని ఆటోనగర్‌కు ఆనుకుని 10.80 ఎకరాల స్థలాన్ని కూడా చేనేత జౌళిశాఖ అధికారులు పరిశీలించారు.
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి చేనేతకు అండగా నిలుస్తోంది. ఎన్టీఆర్ హయాంలోనూ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక పథకాలు ప్రవేశపెట్టారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పన కోసం ఎన్టీఆర్ హయాంలో జనతా వస్త్రాల పథకం ప్రవేశపెట్టారు. చేనేత సహకార సొసైటీలను బలోపేతం చేసి వారికి పని కల్పించారు. ఆప్కో ద్వారా సహకార సంఘాలలో నిల్వలను కొనుగోలు చేయించారు. వారికి ఆరోగ్యభద్రత కార్డులు అందజేశారు. 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులు లక్షా 11 వేల మందికి రూ.2 వేలు చొప్పున పెన్షన్ అందించారు. నూలు, రంగులు, రసాయనాలపై సబ్సిడీలు అందించారు. 23వేల మంది చేనేత కార్మికుల రుణాలు చంద్రన్న చేయూత పథకం ద్వారా రూ.110 కోట్ల వరకు రద్దు చేశారు. పావలా వడ్డీ పథకం ద్వారా 55,500 మంది నేతన్నలకు రూ.26.62 కోట్లు రుణాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 2.5 లక్షల మంది చేనేత కార్మికుల ప్రయోజనం కోసం టీడీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. చేనేత కార్మికుల పొదుపు పథకాన్ని అమలు చేశారు. ప్రాథమిక చేనేత సహకార సంఘ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.12,500లు ఆర్థిక సహాయం అందించారు. ప్రధాన నగరాల్లో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి, కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. మంగళగిరిలో 2024 ఫిబ్రవరిలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా 20 మగ్గాలతో వీవర్స్ శాలను ప్రారంభించారు. ఇక్కడ అధునాతన మగ్గాలతోపాటు కుట్టు శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడివారికి టెక్నాలజీపరంగా సహకరించేందుకు, చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది. మంగళగిరి చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే, ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలలో టెక్స్ టైల్స్ పార్కులు, చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, మంగళగిరిలో చేనేత కార్మికులకు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు.
చేనేతకు ప్రధాన సమస్య మార్కెటింగ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లోకి మన చేనేత ఉత్పత్తులను చొప్పించాలి. అంది అసంఘటింతంగా ఉన్న ఈ కార్మికులకు సాధ్యంకాదు. చేనేత కార్మికులు తమ వృత్తితో అంత్యంత నైపుణ్యం కలిగినవారే గానీ, వారికి మార్కెటింగ్ తెలియదు. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థని ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్, ఎగ్జిబిషన్ల ద్వారా చేనేత వస్త్రాలకు విస్తృతమైన మార్కెటింగ్‌ని కల్పిస్తే, వారి ఉత్పత్తులు అమ్ముడుపోయి, వారికి ఉపాధి లభిస్తుంది. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెడితే చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
No comments:
Post a Comment