ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ కోదండ రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి ఆడపడుచైన అమ్మవారి తరపున ఈరోజు స్వామివారికి పద్మశాలియ వంశస్థులు పట్టు వస్త్రములు సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య వేద పండితుల మంత్రాల నడుమ బ్రహ్మాండంగా జరిగింది. స్వామివారికి మంగళగిరి మునిసిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవితోపాటు పద్మశాలీ పెద్దలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పద్మశాలి వంశస్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ, పద్మశాలి అయిన మనకు ఇటువంటి గొప్ప అవకాశాలు రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి తరఫున మనందరం కలిసి స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కల్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం మన కులానికి మరెన్నో రావాలని అన్నారు. పద్మశాలి అంటే పట్టు వస్త్రాలు నేసే వారు మాత్రమే కాదని, పట్టుదల ఉన్నవారు కూడా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి, పద్మశాలి కార్పోరేషన్ మాజీ చైర్మన్ జింకా విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment