ఇస్కఫ్ 20 రాష్ట్ర మహాసభల్లో వక్తల పిలుపు
మదనపల్లి: మత అసహనం, యుద్ధోన్మాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇస్కఫ్ 20 వ మహాసభ పిలుపు ఇచ్చింది. ఇస్కఫ్, ఆంధ్ర ప్రదేశ్, 20వ మహాసభ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఏ కారణం చేత అయినా యుద్ధం ఎక్కడ వచ్చినా అది వినాశనానికి దారి తీస్తుందని ఇస్కఫ్ మహాసభ స్పష్టం చేసింది. ప్రపంచ మానవాళికి ఫాసిజం ప్రధాన శత్రువు అని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) స్పష్టం చేసింది. రాష్ట్ర అధ్యక్షులు టి ఎస్ సుకుమారన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ముందుగా పెహాల్గావ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారికి మహాసభ రెండు నిముషాల మౌనం పాటించి నివాళి అర్పించింది. అనంతరం ఇస్కఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పదిహారి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళి తీవ్రమైన సంక్షోభాల మధ్య జీవిస్తున్నట్టు పదిహారి పేర్కొన్నారు. ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు యుద్ధ ఉన్మాదాన్ని పెంచుతున్నాయని విమర్శించారు. ఇందులో భాగమే పలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి అని గుర్తు చేశారు. భారత దేశంపైన కూడా ఉగ్రదాడి జరిగిందని, అగ్రదేశాలు తమ ఆయుధ వ్యాపారాల కోసం ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, అగ్ర రాజ్యాలే ఆయుధాలు అమ్ముతున్నాయని విమర్శించారు. యుద్ధం అనేది మానవాళి వినాశనానికి దారి తీయగలదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ఫాసిజం జడలు విప్పుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అది మానవాళికి ప్రధాన శత్రువని బిజయ్ కుమార్ పదిహారి పేర్కొన్నారు. హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడ్డ నేతల నుంచి స్ఫూర్తి పొంది పని చేయవలసి ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రానున్న ఆగస్టు 30 న ఫిడేల్ క్యాస్త్రో జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు పదిహారి తెలిపారు. ఇప్పుడు వివిధ దేశాల మధ్య సంబంధాలు బలహీన పడుతున్నాయని, ఈ క్రమంలో ప్రజల మధ్య స్నేహ సంబంధాలను పెంచడం ద్వారానే మానవ సంబంధాలు బలపడుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఇస్కఫ్ దశాబ్దాలుగా పని చేస్తున్నదని, మరింత చైతన్యవంతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. భారతదేశానికీ అన్ని ప్రపంచ దేశాల ప్రజాలతో స్నేహ, శాంతి పూర్వక సంబంధాల మెరుగు పరచడం ఇస్కఫ్ ఆశయమని స్పష్టం చేశారు.
ఈ మహాసభల్లో పాల్గొనడానికి చెన్నై నుండి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ రష్యా సెర్జెయ్ అజారోవ్ సందేశమిచ్చారు. రష్యా -భారతదేశం మధ్య సహకార సంబంధాలకి చాలా విస్తారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం భారతదేశంతో కలసి పని చేయాలనీ తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇది పరివర్తన కాలమని, అన్న రంగాల్లో కొత్త శక్తులు ఉద్భవిస్తున్నాయని, వాటిని నిజమైన అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని కోరారు. రష్యా, భారతీయ సంబంధాల విషయంలో రష్యా అధ్యక్షుడు వి. పుతిన్ అంచనాలు చాలా ఉన్నతంగా ఉన్నాయని తెలిపారు. భారతదేశం రష్యాకు దశాబ్దాలు సహజ భాగస్వామి అని, మిత్రదేశంగా ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మాధ్య ఉన్న సంబంధాలు పరస్పర ఆర్థిక ప్రయోజనాలకు చెందినవి కాదని పేర్కొన్నారు. నమ్మకం, స్నేహంతో కూడిన గొప్ప దీర్ఘకాలిక సంబంధం అని పేర్కొన్నారు. భారత సమాజం అభివృద్ధికి సోవియట్ కాలం నుంచి ఇప్పటికీ రష్యా పూర్తి అండగా ఉందని తెలిపారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు భారత సామర్థ్యాన్ని, సాంకేతిక పురోగతిని పెంచడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య సంస్కృతిక, క్రీడలు, కళా సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే అనేక సంవత్సరాల నుండి భారతీయ నిపుణులు రష్యాలో శిక్షణ పొందారని తెలిపారు. భారత దేశం సార్వభౌమాధికారంతో స్వతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక ప్రోత్సాహాన్ని రష్యా నిత్యం అందిస్తూనే ఉన్నదని తెలిపారు. విద్యకు సంబంధించి చాలా ఉన్నతమైన మేళవింపు ఉన్నదని పేర్కొన్నారు. ఈ చర్యలు స్వయం విశ్వాసాన్ని ప్రోత్సహించడం, దేశ ప్రజలకు ఆర్థిక వ్యవస్థలో రాణించగల శక్తిని అవకాశాలను, అందిస్తాయని పేర్కొన్నారు. భారత్ ఒక శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని తాము అభిలషిస్తున్నామని పేర్కొన్నారు. రెండు దేశాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చర్యలకు మార్గం సుగమం చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఇస్కఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితాల రాజశేఖర్ కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. గత మూడేళ్లలో ఇస్కఫ్ కృషిని వివరించారు. దేశంలో పేట్రేగిపోతున్న మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడం ఇస్కఫ్ బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గడచిన 19 వ మహాసభ నెల్లూరులో జరిగిన నాటి నించి చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. శాంతి, సంస్కృతీ, ప్రజా కళల గురించి మాట్లాడటానికి ముందు మన దేశంలో మతోన్మాద ప్రమాదం గురించి, మత సామరస్యం పాటించాల్సిన అవసరం గురించి వారం క్రితం జరిగిన దుస్సంఘటన గురించి రాజశేఖర్ చెప్పారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం జిల్లాలో బైసారన్ అనే ప్రసిద్ధ పర్వత పర్యాటక ప్రదేశంలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని 26 మంది అమాయక ప్రజలను హత్య చేశారు, ఇంకా పలువురు గాయపడ్డారు. ఈ అమానుష ఉగ్రదాడిని ఇస్కఫ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు ఈ రకమైన దాడులు కాశ్మీరి ప్రజల ప్రజాతంత్ర ఆకాంక్షలకు ఏ విధంగా తోడ్పాటుగా ఉండవని, ఏ మతానికీ మేలు చేయవున్నారు. ముఖ్యంగా ఈ దాడిని ఖండిస్తూ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన తీరు కూడా మనం గమనించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఆర్టికల్ 370, 35ఎ రద్దు చేస్తే మౌలిక సమస్యలు పోతాయని ప్రకటించినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఈ ఘటన నిరూపించిందని అన్నారు. ఈ దురంతం పైన సమగ్ర న్యాయ విచారణ అవసరమని, పౌర సమాజం పని చేసే అవకాశం కల్పించటం, ఇస్కఫ్ లాంటి సంస్థలు చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందని రాజశేఖర్ చెప్పారు. మతాన్ని, సంస్కృతి ని కలాగాపులగం చేసి జనాలను మభ్యపెట్టాలని చూస్తున్న శక్తుల నిజ స్వరూపాన్ని చర్చకు పెట్టి సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడం మనందరం కర్తవ్యంగా స్వీకరించాలని ఇస్కఫ్ ఉప ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి యల్ నరసింహులు, ఎస్ కె యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యలు వెంకటరెడ్డి తదితరులు సందేశం ఇచ్చారు. ఈ సమావేశానికి ఇస్కఫ్ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహులు, తమిళనాడు ఇస్కఫ్ నేత భాస్కరన్, ఇస్కఫ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ , ఇస్కఫ్ 20వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్ష కార్యదర్సులు జి.వీ.శివకుమార్, తుంగా శ్రీధర్ రావు, ఇస్కఫ్, తిరుపతి నాయకుడు రామచంద్రయ్య, ఇస్కఫ్, కడప జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి, డాక్టర్ పి.సంజీవమ్మ, ఇస్కఫ్, గుంటూరు జిల్లా సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ, సి హెచ్ శ్రీదేవి, ఇస్కఫ్ కోశాధికారి కె.సత్యాంజనేయ, అనకాపల్లి నేత M. మాధవరావు, కృష్ణాజిల్లా నుంచి ఆర్. పిచ్చయ్య, బుద్ధవరపు వెంకట్రావు, మోతుకూరి అరుణ్, దోనేపూడి సూరిబాబు, యువజన సమాఖ్య జాతీయ నేత నక్కి లెనిన్ బాబు, జర్నలిస్టు సి.ఎన్.క్షేత్రపాల్ రెడ్డి, సిపిఐ మదనపల్లి కార్యదర్శి మురళి, నెల్లూరు జిల్లా నించి రమేష్, వి. రామచంద్ర మూర్తి, అనంతపూర్ నుంచి వసంతబాబు, పలనాడు జిల్లా నుంచి చెన్నకేశవరావు, ఏలూరు జిల్లా నుంచి కడుపు కన్నయ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లక్ష్మి గణపతి తదితరులు హాజరయ్యారు.
ఆలోచింపజేసిన పాట
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన పాటలు మహాసభ ప్రతినిధులను అలోచింపచేసాయి. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఆర్ పిచ్చయ్య, గుర్రప్ప, చారులత, నాగరాజుల బృందం సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్న వివిధ ప్రతీఘాత శక్తుల నుంచి, యుద్దోన్మాదం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అశాంతి నుండి మానవాళిని రక్షించు కోవాలని, స్నేహ సంబందాలను మెరుగు పర్చుకోవలసిన ఆవశ్యకతను చెప్పే గీతాలను ఆలపించి సభికులను ఉత్తేజ పరిచారు. తెనాలికి చెందిన బెజ్జంకి నాగమణి ఆలపించిన కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన పాట "పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్యగీతం" పాటకు ప్రతినిధుల నుంచి మంచి స్పందన వచ్చింది.
సభకు హాజరైన వివిధ జిల్లాల ప్రతినిధులు తమ జిల్లాల్లో జరిపిన కార్యకలాపాలను వివరించారు. మహాసభల మొదటిరోజు సాయంత్రం కాశ్మీర్ పర్యాటకుల మృతులకు సంతాపంగా ఇస్కఫ్, సిపిఐ, అన్నమయ్య జిల్లా సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిపాయి. మహాసభ ప్రాంగణం నుంచి మదనపల్లి బస్టాండ్ దగ్గర వున్న డాక్టర్ అంబెడ్కర్ విగ్రహం సర్కిల్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. తర్వాత జరిగిన సభలో సిపిఐ, అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.ఎల్. నరసింహులు, బిజయ్ కుమార్ పదిహరి, కాగితాల రాజశేఖర్ ప్రసంగించారు.
మహాసభల రెండవ రోజు ఇస్కఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. టి. ఎస్. సుకుమారన్, ఆచార్య వి. బాలమోహన్ దాస్, బొల్లిముంత కృష్ణ అధ్యక్ష వర్గంగా, కాగితాల రాజశేఖర్ అధ్యక్షునిగా, ఎస్. నరసింహులు, తుంగ శ్రీధర్ రావు ప్రధాన కార్యదర్శులుగా, ఉప ప్రధాన కార్యదర్శిగా ఎం. M. మాధవరావు, రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కూన అజైబాబు, నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్.వి. రమేష్ బాబు, గుంటూరు జిల్లాకు చెందిన కాగితాల నిర్మల ఎన్నిక అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా ల మహాసభ పూర్తీ అయిన తర్వాత ఈ జిల్లాలకు రాష్ట్ర కార్యదర్శి పదవులు రిజర్వు చేయడమైనది. ఇస్కఫ్ రాష్ట్ర కోశాధికారిగా సత్యాంజనేయ, ప్రచార కార్యదర్శిగా మదనపల్లికి చెందిన జి.వి. శివకుమార్ ఎన్నిక అయ్యారు.