నాకు మంచి మిత్రుడు, ఇంటర్‌లో, డిగ్రీలో నా జూనియర్ అందె వెంకటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఆడిట్ అధికారిగా నియమితులయ్యాడు. చాలా సంతోషించాను. అతి నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన వెంకటేశ్వరరావు ఓ పక్క నేత నేస్తూ, ఇంకో పక్క ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీలో మేం ఇద్దరం ఎకనామిక్స్ విద్యార్థులమే. ఇంటర్‌లోనూ, డిగ్రీలోనూ క్విజ్‌లో మా ఇద్దరి టీమ్‌లే పోటీపడేవి. నేను మెట్రిక్ వరకు నేత నేశాను. అతను డిగ్రీ వరకు నేత నేసేవాడు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత వెంకటేశ్వరరావు ఆంధ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లోనే పీజీ చేశాడు. ఇక్కడో విషయం చెప్పాలి. సాధారంగా కాలేజీలో, యూనివర్సిటీలలో చేరిన తొలి రోజుల్లో విద్యార్థులకు హోమ్ సిక్ అంటే ఇంటి మీద బెంగ ఏర్పడుతుంది. తల్లిదండ్రులను చూడాలనిపిస్తుంది. కానీ, ఇక్కడ వెంకటేశ్వరరావు తల్లి కొడుకుని చూడకుండా ఉండలేక, మంగళగిరి నుంచి ఒక్కతే ఏకంగా విశాఖపట్నం వచ్చారు. అంత పేదరికంలో ఉండి కూడా ఆమె కొడుకు కోసం వ్యయప్రయాసలకోర్చి ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ కు రావడం అక్కడి విద్యార్థులను ఆశ్చర్యానికి గురి చేసింది. తల్లి ప్రేమంటే ఇదే. వెంకటేశ్వరరావుఆంధ్రాయూనివర్సిటీలో చదివే సమయంలో నేను నాగార్జునా యూనివర్సిటీలో లా చేశాను. ఆ తర్వాత వెంకటేశ్వరరావు కూడా నాగార్జున యూనివర్సిటీలో లాలో చేరాడు. నేను కూడా ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీజేఎంసీ, ఎంజేఎంసీ చేశాను. 2023లో నాగార్జునా యూనివర్సిటీ లా డిపార్ట్ మెంట్ ఓల్డ్ స్టూడెంట్ మీట్ లో అందరం కలిశాం. ఆ ఫొటోనే ఇక్కడ పోస్ట్ చేశాను. వెంకటేశ్వరరావు మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్. కష్టపడి ఇష్టంగా చదివే స్వభావం. సౌమ్యుడు. ఏ అవలక్షణాలు లేని ఉత్తముడు. 1996లో గ్రూప్ -1 సాధించాడు. ఆడిట్ డిపార్ట్ మెంట్ కు ఎంపికయ్యాడు. అయితే, వివిధ శాఖలలో, వివిధ హోదాలలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్‌లో జాయింట్ డైరెక్టర్/చీఫ్ ఆడిట్ ఆఫీసరు హోదాలో ఉన్న వెంకటేశ్వరరావుని ప్రభుత్వం టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా నియమించింది. కష్టపడి చదువుకుంటే, విజయం తప్పక వరిస్తుందనడానికి నిదర్శనం వెంకటేశ్వరావు. చేనేత కార్మికుడి నుంచి టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా ఎదిగి, యువతకు ఆదర్శంగా నిలిచిన వెంకటేశ్వరరావుకు అభినందనలు.మంగళగిరి అంటే చేనేత (పద్మశాలీలు), లక్ష్మీనరసింహ స్వామి గుర్తుకు వస్తాయి. అలాగే, మంగళగిరిలో కష్టజీవులు ఎక్కువ. మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన అత్యధికులు చేనేత కార్మికుడిగా లేక పడుగులు చూస్తూ చదువుకున్నవారే.ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఇటీవలే మంగళగిరికే చెందిన ఉడతా బసవరావు కర్నూల్ లోని రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యాడు. బసవరావు కూడా పడుగులు చేస్తూ ఎంతో కష్టపడి చదువుకున్నాడు. వెంకటేశ్వరరావు, బసవరావు క్లాస్ మీట్స్. మంచి మిత్రులు.
మరో ముఖ్య విషయం చెప్పాలి. మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన వారే కాదు, అందరూ కష్టజీవులే. ఈ ఫొటోలో ఉన్న మా మిత్రుడు ఓబులాపురం వెంకటేశ్వర్లు మరో గ్రేట్ పర్సన్. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఉన్నాడు. వెంకటేశ్వర్లు చిన్నప్పటి నుంచి బార్బర్ వృత్తి చేసుకుంటూ చదివాడు. లా పూర్తి చేసేవరకు కూడా బార్బర్ షాపు నడిపాడు. సొంతంగా బార్బర్ షాపు నిర్వహిస్తూ, అదే వృత్తి చేస్తూ, డిగ్రీ, బీఎల్, ఎంఎల్ చదివి ఈ స్థాయికి చేరాడు. అందుకే మా మంగళగిరి అంటే, మాకు అంత గొప్ప. ఈ ఫొటోలో ఉన్న మరో మిత్రుడు అవ్వారు శ్రీనివాసరావు. మేమిద్దరం జర్నలిజంలో స్థిరపడ్డాం. ఇంటర్ లో మాది ఒకే బ్యాచ్. శ్రీనివాసరావు బైపీసీ, నేను హెచ్ఈసీ. ఆ తర్వాత శ్రీనివాసరావు నాగార్జునా యూనివర్సిటీలో ఎంఏ ఆర్కీయాలజీ చేస్తే, నేను లా చేశాను. ఆ తర్వాత మేం ఇద్దరం చాలా కాలం కలిసే జర్నలిస్టులుగా పని చేశాం. అవ్వారు శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తమ జర్నలిస్టు అవార్డు కూడా ఇచ్చింది.
No comments:
Post a Comment