మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఓ జూనియర్ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. ఆ విద్యార్థి ఇక్కడ చేరి ఏడాది పూర్తి అయింది. ఇది ర్యాగింగ్ కాదని, ఓ విద్యార్థినిని, ఆమెకు తెలియకుండా వీడియో తీయడం వల్ల జరిగిన గొడవని తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కితే, పెద్ద కేసవుతుందని, ఆ విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, దానిని ర్యాంకింగ్ గా డైవర్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ అయినందున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎయిమ్స్ యాజమాన్యం వారు, స్థానికంగా ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం, తిరుపతికి చెందిన జూనియర్ విద్యార్థికి, సీనియర్ విద్యార్థులకు మధ్య జూన్ 23న గొడవ జరిగింది. ఆ విద్యార్థినిని 25వ తేదీ వరకు సీనియర్లు వసతి గృహంలో పలుమార్లు నిర్బంధించారు. ర్యాగింగ్ పేరిట కొట్టారు. బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. తక్షణం చికిత్స అందించడంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఢిల్లీలోని యూజీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన యూజీసీ అధికారులు ఎయిమ్స్ అధికారులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ఉన్నతాధికారుల బృందం విచారణ జరిపింది. అంతర్గత విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ర్యాగింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రాథమికంగా 15 మంది విద్యార్థులను బాధ్యులుగా తేల్చింది. అయితే, వారిలో ఇద్దరికి సంబంధంలేదని తర్వాత తేల్చారు. బాధ్యులుగా 13 మంది సీనియర్ విద్యార్థులను గుర్తించారు. వారిలో ఒకరిని 18 నెలలపాటు, మిగిలిన వారిలో కొందరిని 12 నెలలు, మరి కొందరిని ఆరు నెలలపాటు ఎకడమిక్ క్లాసుల నుంచి సస్పెండ్ చేశారు. అంతే కాకుండా, వారిని కోర్సు పూర్తి అయ్యేంతవరకు హాస్టల్ నుంచి బహిష్కరించారు. అందరికీ రూ.25 వేలు చొప్పున జరిమానా విధించారు. 13 మందిని వసతి గృహం నుంచి ఖాళీ చేయించారు. విద్యార్థుల అందరితో అంతర్గత విచారణ పూర్తయిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణా రెడ్డి వివరించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు స్వస్థలానికి తీసుకెళ్లిపోయారు. అయితే, ర్యాగింగ్ చేసినవారిలో మంగళగిరి ఎయిమ్స్ డీన్ కుమారుడు ఒకరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఎయిమ్స్‌లో ఇంత జరిగినా వారం రోజుల వరకు బయటకు తెలియనివ్వలేదు. మీడియాకూ సమాచారం లేదు. యాజమాన్యానికి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మీడియా ప్రతినిధులు కూడా ఈ ఘటనను బయటకు వెల్లడించలేదు. అందువల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నిబంధనల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి చెప్పారు. ఫిర్యాదు రాతపూర్వకంగా ఇవ్వకుండా, మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాలేదు. ఆ విద్యార్థిని గానీ, బాధిత విద్యార్థి గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో అనుమానాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు అధికార ప్రతినిధి స్పష్టంగా సమాధానాలు చెప్పలేదు. ర్యాగింగ్ చేసినవారిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు ఉన్నారా? అన్న ప్రశ్నకు ఒకసారి లేదని ఖండించారు. మరోసారి, ఎవరున్నా అందరికీ ఒకే రకమైన పనిష్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఇంతకు మించి చెప్పే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే, విద్యార్థుల భవిష్యత్తు రీత్యా వారి పేర్లను బయట పెట్టడంలేదని చెప్పారు. కమిటీ కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీడియా వారు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, విద్యార్థుల పేర్లు వెల్లడికాకపోవడంతో వారిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు ఉన్నాడా? లేడా? అన్నది స్పష్టంగా తెలియడంలేదు.
మరో వైపు ఇది ర్యాగింగ్ కాదని, ప్రేమ వ్యవహారం, సీనియర్ మహిళా విద్యార్థినిని జూనియర్ విద్యార్థి వీడియో తీయడం వల్ల జరిగిన గొడవగా చెబుతున్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే, కాలేజీ పరువు పోతుంది. అలాగే, ఆ విద్యార్థిని భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఇది వాస్తవం. అందువల్ల విద్యార్థిని విషయాన్ని బయటకు వెల్లడికాకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రశ్నించగా, అధికార ప్రతినిధి సమర్థించలేదు. ఖండించలేదు. విలేఖరులు అడిగిన ప్రశ్నలను విని ఊరుకున్నారు. స్పందించలేదు. కాలేజీ పరువు, ప్రతిష్టలు, విద్యార్థుల భవిష్యత్తు రీత్యా తమకు సహకరించమని మాత్రం ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశంలోనే మొదటగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక కాలేజీ అయినందున, ఇక్కడ పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరం ఉంది. ఈ ఘటనతో ఇక్కడ అడ్మినిస్టేషన్ లో లోపం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరుతుంటారు. విద్యార్థులలో డీన్ కుమారుడితోపాటు ఎవరున్నా క్రమశిక్షణతో మెలిగే విధంగా ఎయిమ్స్ యాజమాన్యం పటిష్టమైన చర్యలు తీసుకోవలసి ఉంది. ఎయిమ్స్ ప్రతిష్టని నిలబెట్టడం బాధ్యతగా భావించాలి. మళ్లీ ఇటువంటి సంఘటన మరొకటి జరిగితే కాలేజీ ప్రతిష్ట మంటగలిచే ప్రమాదం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడ చేర్చడానికి, అలాగే విద్యార్థులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలన్నిటినీ దృష్టిలోపెట్టుకుని ఎయిమ్స్ యాజమాన్యం ఇక ముందు అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment